గిరిపుత్రులు డ్రాపౌట్
- పాఠశాలకు దూరమవుతున్నగిరిజన చిన్నారులు
- ఏటా పెరుగుతున్న డ్రాపౌట్స్ సంఖ్య
- పరిస్థితి చక్కదిద్దేందుకు సర్కారు చర్యలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో నిర్బంధ ఉచిత విద్య అమలులోకి వచ్చినా.. వంద శాతం అక్షరాస్యత దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా.. అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరడమే లేదు. బడిబాట పట్టని గిరిజన చిన్నారుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతూనే ఉంది. అంతేకాదు మధ్యలో బడి వదిలేసే ( డ్రాపౌట్స్) వారి సంఖ్య కూడా అధికమవుతోంది.
తెలంగాణలోని 10 జిల్లాల్లో దాదాపు 20 వేల మంది గిరిపుత్రులు బడులకు దూరమైనట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. దాదాపు 1,500 మంది అసలు పాఠశాలలో అడుగు కూడా పెట్టలేదని స్పష్టమైంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి రాజీవ్‌విద్యామిషన్ నివేదికను సమర్పించింది.
పెరుగుతున్న అవుట్ ఆఫ్ స్కూల్స్ సంఖ్య..
రాష్ట్రంలో అసలు బడికి వెళ్లని పిల్లల (అవుట్ ఆఫ్ స్కూల్స్) సంఖ్య గత ఏడాదితో పోల్చితే ఈసారి అధికంగానే ఉంది. గత ఏడాది (2013-14) బడికి వెళ్లని పిల్లలు 10,795 కాగా, 2014-15లో వీరి సంఖ్య 13,059 కు పెరిగినట్లు రాజీవ్‌విద్యామిషన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ సేకరించిన వివరాలను బట్టి వీరి సంఖ్య నాలుగు వేల వరకు ఉంది. ఈ రెండింటిని కలిపితే దాదాపు 20 వేల మంది వరకు చిన్నారులు బడికి వెళ్లని వారు ఉన్నట్లు తెలుస్తోంది.
గిరిజన శాఖ నివేదిక ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 2,110 మంది, ఖమ్మంలో 1,442, నిజామాబాద్‌లో నుంచి 352 మంది బడికి వెళ్లని గిరిపుత్రులు ఉన్నట్లుగా తేలింది. రెగ్యులర్ పాఠశాలల నుంచి, ఆయా కాలాలను బట్టి బడి మానేస్తున్న వారిని అవుట్ ఆఫ్ స్కూల్‌గా పేర్కొంటుండగా, వారిసంఖ్య 1,348 గా ఉంది. వీరిలో అత్యధికంగా 1,205 మంది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
అవగాహనారాహిత్యమే కారణం
గిరిజనులకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమవడం, వారి అక్షరాస్యత శాతం తక్కువగా ఉండడంతో తమ పిల్లలను బడికి పంపించాలన్న ఆలోచన గిరిజనులకు రావడం లేదు. గిరిపుత్రులు పశువుల కాపరులుగా కొనసాగుతున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తమ పిల్లలను బడి మధ్యలో మాన్పిస్తున్నవారు కూడా ఎక్కువగా ఉంటున్నారు.
కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిన సర్కార్
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఒక కార్యాచరణ ప్రణాళిక అనుగుణంగా గిరిజన సంక్షేమ శాఖ జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించాలని ఆదేశించింది. స్కూల్ డ్రాపౌట్స్‌లను ముందుగా వేసవి శిక్షణా శిబిరాల్లో చేర్పించి, వారిని బడులకు అలవాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంఈఓలకు ఆదేశించింది. జిల్లా, డివిజన్‌స్థాయిలో శిక్షణా తరగతులను నిర్వహించడంతోపాటు అంగన్‌వాడీల ద్వారా ఈ సమస్యపై లోతుగా పరిశీలించి ఈ పిల్లలు బడులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆయా జిల్లాలకు సంబంధించి ప్రాజెక్టు అధికారులు, డీడీలు, జిల్లా గిరిజనసంక్షేమ అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి వాటికి జిల్లా కలెక్టర్లు, పీవోల ఆమోదం పొందాలని ఆదేశించింది.