ఈ వాలెట్లతో జర భద్రం కొడుకో!
న్యూఢిల్లీ: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ-వాలెట్ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇప్పటికే పలు పత్రికల్లో పూర్తి పేజీ యాడ్స్ ఇచ్చి దుమ్మురేపిన పేటీఎంతోపాటు ఫ్రీచార్జ్, పేయూమనీ, మొబిక్విక్, ఆక్సిజెన్, ఓలాక్యాబ్, బుక్‌మైషో, రిస్టారెంట్ ఫైండర్, జొమాటో లాంటి ఈ-వాలెట్స్ అన్నీ ఇదే అదనుగా తమ కార్యకలాపాలను ముమ్మరం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. నగదు లావాదేవీల స్థానంలో ఈ వాలెట్స్, డిజిటల్ లావాదేవీలను బాగా ప్రోత్సహించాలనే ప్రభుత్వ వైఖరి కూడా వారికి అనూహ్యంగా కలిసి వస్తోంది.
ఆకర్షణీయ ప్రకటనలతో బుట్టలో వేస్తారు
పెద్ద నోట్ల రద్దుకు ముందే పుట్టుకొచ్చిన ఈ వాలెట్ లేదా ఈ-పర్సు సంస్థలు ఆకర్షణీయమైన ప్రకటనలతో, ఆఫర్లతో వినియోగదారులను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. నగదు కొరతతో దేశంలో ఆర్థిక లావాదేవీలు స్తంభించిన నేపథ్యంలో ఈ వాలెట్సే మనకు ప్రత్యామ్నాయం. ఆధునిక ప్రపంచం అనుసరిస్తున్న మార్గం కూడా ఇదేకనుక మనమూ ఆ దిశలో ప్రయాణించక తప్పకపోవచ్చు. ఇప్పుడు అన్ని బ్యాంకులు కూడా ఈ వాలెట్లను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఈ వాలెట్ సంస్థల పట్ల మనం అప్రత్తంగా ఉండకపోతే ఇదే అదనుగా మనల్ని బోల్తా కొట్టించేందుకు అవి ప్రయత్నిస్తాయి. ఈ-వాలెట్ల క్యాష్‌బ్యాక్ ఆఫర్లకు, ఇచ్చే సొమ్ముకు పొంతనే ఉండదు.
ఎన్ని రకాలుగా చూసిన మన మనకొనుగోళ్లపై ఆ సంస్థలకు ఐదు శాతం కమిషన్ వస్తే అందులో ఒక్క శాతానికి మించి మనకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉండవు. అయిదు, పది, పాతిక, యాభై, వంద శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇస్తున్నామంటూ పెద్ద పెద్ద అక్షరాల్లో ప్రకటనలు ఉంటాయి. గరిష్ట పరిమితి రూ, 50 లేదా రూ.100 అంటూ పక్కన చిన్న అక్షరాలతో ట్యాగ్లైన్లు ఉంటాయి. ఈ ట్యాగ్లైన్లను గమనించకపోతే వినియోగదారులు బుట్టలో పడిపోయినట్లే.
అవి ఎలా ఉంటాయంటే..
ఊబర్ క్యాబ్‌లకు ఈ-వాలెట్‌గా పనిచేస్తున్న పేటీఎం ఓ రైడ్ ముగియగానే ‘మీరు 222 రూపాయలు అడ్వాన్స్ చెల్లించండి. ప్రతి రైడ్‌పై 25 శాతం క్యాష్‌బ్యాక్ పొందండి. ఈ సదావకాశం పదిహేను రోజులు మాత్రమే’ అంటూనే దానికి క్యాష్‌బ్యాక్ గరిష్టంగా రూ.50 అనే ట్యాగ్ లైన్ తగిలిస్తోంది. అంటే దీనర్థం 200 రూపాయల చార్జి లోపల ప్రయాణించే వారికే 25 శాతం క్యాష్‌బ్యాక్ వర్తిస్తుందన్నమాట. ఆ తర్వాత ఎన్నివందల రూపాయల దూరం ప్రయాణించినా క్యాష్‌బ్యాక్ వచ్చేది 50 రూపాయలు మాత్రమే. అది కూడా మనం అడ్వాన్స్‌గా చెల్లించిన డబ్బు మీదే. దానికి కూడా వారం రోజులు, పది రోజులు పరిమితి విధిస్తుంది. దీన్ని సరిగ్గా పరిశీలించకపోతే మొత్తం చార్జీలో 25 శాతం రాయితీ లభిస్తోందని మనం భావిస్తాం.
మరో ఈ-వాలెట్ తీరు ఇది...
మొబైల్ ఫోన్లో కనీసం వంద రూపాయలు రీచార్జి చేసుకుంటే వందశాతం క్యాష్‌బ్యాక్ ఇస్తామంటూ ‘ఫ్రీచార్జ్’ ఈ-వాలెట్ ఆగస్టు నెలలో బాగా ప్రచారం చేసింది. గరిష్ట క్యాష్‌బ్యాక్ రూ.50 అంటూ ఓ ట్యాగ్‌లైన్ తగిలించింది. అంటే వంద రూపాయల రీచార్జ్ చేసుకుంటే 50 రూపాయలు బెనిఫిట్. అంటే యాభై శాతం మాత్రమే లబ్ధి. 200 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 25 శాతం మాత్రమే లబ్ధి. ఇలా పెద్ద మొత్తానికి వెళుతుంటే రాయితీ ఈతీరుగా తగ్గుతున్నప్పుడు వంద శాతం క్యాష్‌బ్యాక్ అని ఎలా ప్రచారం చేసుకుంటారు. నూరుశాతం మాటమీద నిలబెడతామని చెప్పడం తమ ఉద్దేశంగా కంపెనీ సమర్థించుకుంటుందేమో!
సినిమా టిక్కెట్ల విషయంలో ట్యాగులు
దాదాపు అన్ని ఈ-మెయిల్ కంపెనీలు రకరకాల ఆఫర్లు ప్రకటించేది కొత్త వినియోగదారులను ఆకర్షించడం కోసమే. పాత యూజర్లు ఎవరో వారికి వెంటనే తెలిసిపోతుందికనుక ఆఫర్లను పాతవారికి ఇవ్వరు. కొత్త వారికిచ్చే ఆఫర్లకు కూడా ఎన్నో పరిమితులు ఉంటాయి. ఎక్కువగా సినిమా టిక్కెట్ల విషయంలో ఇవి జరుగుతుంటాయి. ఫలానా ఆఫర్‌ను ఉపయోగించుకోవాలంటే ఫలానా కూపన్ కోడ్ కొట్టండని, రెండు సార్లకు మించి ఉపయోగించరాదని, ఉపయోగించినప్పుడల్లా మూడు టిక్కెట్లకు మించి బుక్ చేయరాదని పరిమితులు ఉంటాయి.
లక్ష రూపాయల ఆఫర్ కూడా...
కొన్ని సంస్థలు ఆశ్చర్యకరంగా లక్షరూపాయల వరకు క్యాష్‌బ్యాక్ అంటూ ప్రచారం చేస్తున్నాయి. లాటరీ పద్ధతిలో ఒకరిద్దరిని ఎంపిక చేస్తామని ఎక్కడో ట్యాగ్‌లైన్ ఉంటుంది. లక్షలాది మంది వినియోగదారుల్లో ఒకరిద్దరికి అదృష్టం వహించేది ఎప్పుడో. ఎంపిక విధానం పారదర్శకంగా ఉంటుందో, లేదో కూడా మనకు తెలియదు. ఎక్కువ కొనుగోలు చేసిన వారికే ఈ అవకాశమనే మరో షరతు ఉంటుంది. చాలా ఈ-వాలెట్ సంస్థలు నెలకు పదివేల రూపాయల పరిమితి మించకుండా వినియోగదారుల లావాదేవీలను అనుమతిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్బీఐ వీటి పరిమితిని పదివేల రూపాయల నుంచి 20వేల రూపాయలకు పెంచింది. ప్రస్తుత పరిస్థితుల్లో నెలకు 20వేల పరిమితి చాలని వారు కూడా ఎందరో ఉన్నారు.
స్కీమ్‌లు, ఆఫర్లు క్షుణ్నంగా పరిశీలించాకే..
ఈ-వాలెట్లను ఆశ్రయించడంలో ఆనందకరమైన విషయం ఏమిటంటే మనం ఏ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు. ఏ కాగితాలు నింపక్కర్లేదు. సంస్థ సిబ్బందే మన దగ్గరికి వస్తారు. మొబైల్ నెంబర్లతో పాటు ఐడీ ప్రూఫ్‌లు తీసుకుంటారు. అవసరమైతే ఆధార్ కార్డుల వంటివి అడుగుతారు. వీటన్నింటిని ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చు. మన డబ్బే అడ్వాన్స్‌గా సంస్థ వద్ద ఉండే లావాదేవీలకైతే ఎలాంటి శ్రమలేకుండా మొబైల్ లావా దేవీలే అందుబాటులో ఉంటాయి. ఏది ఏమైనా, ఏ ఈ-వాలెట్‌ను ఎంచుకోవాలన్నా స్కీమ్‌లను, ఆఫర్లను క్షుణ్నంగా పరిశీలించాకే ఎంచుకోవడమే మంచి మార్గం. అమెరికా లాంటి దేశాల్లో క్యాష్‌బ్యాక్ చెల్లింపులకు కూడా పన్ను విధిస్తారు. మన దగ్గర ఇంకా ఆ విధానం రాలేదు.