ఆత్మవిశ్వాసం తోడుగా...
పాలమూరు : గ్రామీణ నేపథ్యం.. తనదీ వ్యవసాయ కుటుంబమే.. చిన్నప్పటి నుంచి తరగతిలో మంచి మార్కులు సాధిస్తూ.. అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు. మామూలు స్థాయినుంచి జిల్లా రెవెన్యూ శాఖ అధికారిగా ఎదిగారు రాంకిషన్. ఆత్మవిశ్వాసంతో ఉన్నతస్థాయికి చేరిన ఆయన నేడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయనది నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి.
విద్యార్థి దశలోనే ప్రత్యేకంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోనప్పటికీ.. డిగ్రీ పూర్తయ్యాక ఉన్నత చదువులపై ఆసక్తి కలగడంతో లాకోర్సు పూర్తిచేసి లాయర్‌గా స్థిరపడాలని భావించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేని నేపథ్యంలో డిప్యూటీ తహశీల్దారుగా కెరీర్ ప్రారంభించారు. ఇప్పుడు డీఆర్వో స్థాయికి చేరుకోగలిగారు. తాను ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నారో.. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
కుటుంబ నేపథ్యం
‘‘మా నాన్న మస్త్యాల జగదీశ్వర్.. అమ్మ రామమ్మ.. మాది నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి. వ్యవసాయ కుటుంబం. ఒకప్పుడు ఆస్తులు బావుండేవి. అనుకోని పరిస్థితుల్లో మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో నేను లా కోర్సు పూర్తి చేయకుండా తక్షణం ఉద్యోగం పొందాలన్న ఉద్ధేశంతో ఎంబీఏ కోర్సు పూర్తిచేశా. ఆ తర్వాత రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహశీల్దారుగా చేరా.
అయినా.. ఆత్మ విశ్వాసం సడలకుండా.. ఉద్యోగంలో చేరాక కూడా లా కోర్సు పూర్తిచేశాను. దీంతో సివిల్స్ పరీక్షలకు హాజరై మూడుసార్లు మెయిన్స్ అర్హత పొందాను. కుటంబ పరంగా ఆర్థిక స్థోమత ఉంటే.. పూర్తిస్థాయిలో సివిల్స్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉండేది. ఓ వైపు ఉద్యోగం చేస్తూ.. పరీక్షలకు సిద్ధం కావడంతో అనుకున్న విధంగా మార్కులు సాధించలేకపోయాను’’.
మా అన్నే నాకు స్ఫూర్తి
‘‘చిన్నప్పటి నుంచి నేను చదువుల్లో బాగా రాణించగలిగానంటే మా అన్న విజయ్‌కుమార్ నాకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన కష్టపడి చదివే వ్యక్తి. దీంతో ఆయనను అనుసరిస్తూ చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపడం వల్లే విజ్ఞానాన్ని పెంచుకోగలిగాను. అంతేకాకుండా ఇంటర్, డిగ్రీ కామారెడ్డిలో చదివాను. అక్కడ రోజూ గ్రంథాలయానికి వెళ్లడం, పత్రికలు, రామాయణ, మహాభారతం, పంచ కథలు వంటివి చదవడం వల్ల తెలుగు భాషపై పట్టు సాధించగలిగాను. దీంతోపాటు సామాజిక అంశాలపై కూడా అవగాహన పొందడంతో తోటివారిని మార్గదర్శనం చేస్తూ రెవెన్యూశాఖలో ఓ ప్రత్యేక గుర్తింపుతో డీఆర్వోగా పనిచేయగలుగుతున్నాను’’.
ఊహించని సందర్భాలు
నేను ఇలా కావాలని ఎన్నడూ కలలు కనలేదు. సమాజం కోసం పాటుపడాలన్న సంకల్పం వల్ల జీవితంలో ఊహించని సందార్భాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానం.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉన్నత చదువులపై దృష్టి పెట్టకుండా ఉద్యోగం సంపాదించాలనుకున్నాను. 1985లో తహశీల్దారుగా ఎంపికయ్యాను. 1986లో శిక్షణ పూర్తి చేసుకుని 1987లో మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు తహశీల్దారుగా చేరాను.
2002లో జడ్చర్ల తహశీల్దారుగా పనిచేస్తుండగానే డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతితో హైదరాబాద్ హుడాకు బదిలీ అయ్యాను.
హుడా డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కోర్టులో చాలా కేసులు నమోదయ్యాయి. వాటి పరిష్కారాన్ని నన్ను ప్రత్యేకాధికారిగా నియమించారు. దీంతో కేసుల పరిష్కారానికి ఎంతో కసరత్తు చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా సుప్రీం కోర్టు అడ్వకేట్లు చాలామందితో నాకు సన్నిహితం ఏర్పడింది. సుప్రీంకోర్టు న్యాయవాది కె.కె.గోపాల్ నన్ను పిలిచి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించడంలో గంటలో అఫిడవిట్ సిద్ధం చేశాను. ఆ అఫిడవిట్‌తో కోర్టులో కేసు గెలవడం ఎన్నో కేసులకు పరిష్కారం దక్కింది. రెండేళ్ల 5నెలల కిందట డీఆర్వోగా పాలమూరు జిల్లాకు బదిలీపై వచ్చాను.
నడిచి వెళ్లే వాణ్ణి
‘‘1987లో తహశీల్దారుగా ఉద్యోగంలో చేరినప్పుడు మాకు ప్రభుత్వ వాహనాలు ఉండేవి కావు. నాకు సొంతంగా స్కూటర్ కూడా లేదు. దీంతో నేను మొదట పనిచేసిన వంగూరు మండలంలో బస్రూట్ ఉన్న గ్రామాలకు బస్సుల్లో వెళ్లడం, లేదంటే కాలినడకన ఆయా గ్రామాలకు వెళ్లేవాణ్ణి’’.
జిల్లా పురోగతి సాధించాలి
17 ఏళ్లకుపైగా పాలమూరు జిల్లాలో ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను. ఈ జిల్లాతో నాకెంతో అనుబంధం ఏర్పడింది. జిల్లాలో చాలామంది తాగుడుకు బానిసలు కావడం వల్ల వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అంతే కాకుండా అక్షరాస్యత కూడా సాధించాల్సిన అవసరముంది. జిల్లాలో మానవ వనరులు పెరగాలి. అంతర్జాతీయ విమానాశ్రయం ఈ జిల్లాకు 20 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. షాద్‌నగర్, కల్వకుర్తి, జడ్చర్ల నియోజకవర్గాల పరిధిలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎంతో అవకాశం ఉంది. పరిశ్రమలు అధికంగా వస్తే జిల్లా అభివృద్ధి సాధ్యపడుతుంది.