ex central minister
-
పబ్లిసిటీ కోసమే చంద్రబాబు పాకులాట: చిరంజీవి
అనంతపురం: హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమైయ్యారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఆరోపించారు. తుపాను వస్తుందని తెలిసిన సహాయక చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో 50 మంది చనిపోయారని తెలిపారు. గురువారం అనంతపురంలో చిరంజీవి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తుపాను సమయంలో కూడా చంద్రబాబు పబ్లిసిటీ కోసమే పాకులాడారని ఎద్దేవా చేశారు. రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... ఇప్పుడు రోజుకో మాట చెప్పి ప్రజల నుంచి తప్పించుకుంటున్నారని బాబు వైఖరీని దుయ్యబట్టారు. బ్లాక్‌మనీపై బీజేపీది ద్వంద్వ వైఖరి అని అన్నారు. కేంద్రం దగ్గర చంద్రబాబుకు ఏ మాత్రం పలుకుబడి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడంలో బాబు విఫలమయ్యారని ఆరోపించారు. పచ్చని పొలాల్లో రాజధాని ఎందుకు పెడుతున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటుకు భూ సేకరణ కోసం రైతులను ఒప్పించాలి కానీ... బెదిరించకూడదని చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు. -
అనుబంధం తెగిపోయిందా చిన్నమ్మా?
మరిదిగారిపై కోపంతో హస్తంపార్టీకి స్నేహ హస్తం అందించింది. దాంతో ఖుషీ అయిపోయిన హస్తం పార్టీ ఏకంగా విశాఖపట్నం లోక్‌సభ ఎంపీ టికెటు ఇచ్చింది. కేవలం సూట్‌కేసుతో వెళ్లి నామినేషన్ వేసి... ఎంపీగా గెలిచింది. అంతేనా కేంద్రంలో సహాయమంత్రి పదవిని సైతం చేజిక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే పార్టీ టికెట్‌పై గెలిచి మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కించుకుంది. ఆమె ఎవరో ఇప్పటికే గుర్తు వచ్చి ఉంటుంది. ఆమె దగ్గుబాటి పురందేశ్వరీ అలియాస్ చిన్నమ్మ. తనను ఇంతగా అందలం ఎక్కించిన మీకూ ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలనంటు ఒకానొక సమయంలో చిన్నమ్మ విశాఖ ప్రజలను పొగడ్తలతో ముంచెత్తింది. విశాఖ అంటే నేను... నేను అంటే విశాఖ అన్నట్లు మమేకమైపోయినా ఆమె రాష్ట్ర విభజన సమయంలో మీరు రాజీనామా చేయమంటే చేసేస్తా.... కేంద్రంతో పోరాడమంటే పోరాడతా నంటూ నాటి విశాఖ సభలలో చిన్నమ్మ ఉదరగొట్టింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిపోవడం... హస్తం పార్టీకే హ్యాండ్ ఇచ్చి కాషాయ వస్త్రం కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. కాషాయం పార్టీ టికెట్టుపై ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైంది. అది వేరే సంగతి. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలను హుదూద్ తుపాను అతలాకుతలం చేసింది. అందునా ఆమె ఒకప్పటి లోక్‌సభ నియోజకవర్గమైన విశాఖలో అయితే బీభత్సం సృష్టించింది. విశాఖ ప్రజలకు ఇంత జరిగిన ఆమె అటు వైపు కన్ను ఎత్తి కూడా చూడ లేదు. హుదూద్ తుపాను నేపథ్యంలో దేశంలోని వివిధ పారిశ్రామికవేత్తలు, బడా రాజకీయనాయకులు, పలు చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోహీరోయిన్లు భారీగా తమ విరాళాలు ప్రకటించారు. కానీ హుదూద్ తుపాను పై చిన్నమ్మ కనీసం స్పందించలేదు. విశాఖతో ఇక తన అనుబంధం తెగిపోయిందని చిన్నమ్మా భావిస్తున్నారో ఏమో. కనీసం ఉలుకుపలుకు లేకుండా ఉండి పోయారు. -
ముచ్చటగా మూడోవాడు!
ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ సహాయమంత్రి సీహెచ్ విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. దాంతో ఆ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న ముచ్చటగా మూడో అచ్చ తెలుగువ్యక్తి సిహెచ్. విద్యాసాగరరావు. ఇప్పటికే ఇద్దరు తెలుగు వ్యక్తులు మహారాష్ట్ర గవర్నర్ పదవిని అలంకరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన ప్రభాకర్ రావు (ప్రముఖ సినీ మాటల రచయిత కోన వెంకట్ తాతగారు) మహారాష్ట్ర గవర్నర్ పదవిని చేపట్టిన మొట్టమొదట తెలుగు వ్యక్తి. దాదాపు ఏడాదిపైగా ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆ పదవిని అలంకరించిన రెండో వ్యక్తి. ఆయన రెండేళ్ల వరకు ఆ పదవిలో ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తెలుగు వ్యక్తి సిహెచ్ విద్యాసాగరరావు ఆ పదవిని చేపట్టనున్నారు. బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహారించిన విద్యాసాగరరావు... రెండు సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రంలో హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం విదితమే. గతంలో ఎన్డీఏ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వి. రామారావును సిక్కిం గవర్నర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ 282 సీట్లు కైవసం చేసుకుంది. దాంతో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూపీఏ ప్రభుత్వ హాయాంలో నియమించిన గవర్నర్లకు మంగళం పాడుతూ వారి స్థానాల్లో బీజేపీ నాయకులను గవర్నర్ పదవుల్లో నియమించే కార్యక్రమంలో భాగంగా విద్యాసాగర్ రావు ఎంపిక జరిగింది.