అనుబంధం తెగిపోయిందా చిన్నమ్మా?
మరిదిగారిపై కోపంతో హస్తంపార్టీకి స్నేహ హస్తం అందించింది. దాంతో ఖుషీ అయిపోయిన హస్తం పార్టీ ఏకంగా విశాఖపట్నం లోక్సభ ఎంపీ టికెటు ఇచ్చింది. కేవలం సూట్కేసుతో వెళ్లి నామినేషన్ వేసి... ఎంపీగా గెలిచింది. అంతేనా కేంద్రంలో సహాయమంత్రి పదవిని సైతం చేజిక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే పార్టీ టికెట్పై గెలిచి మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కించుకుంది. ఆమె ఎవరో ఇప్పటికే గుర్తు వచ్చి ఉంటుంది. ఆమె దగ్గుబాటి పురందేశ్వరీ అలియాస్ చిన్నమ్మ.
తనను ఇంతగా అందలం ఎక్కించిన మీకూ ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలనంటు ఒకానొక సమయంలో చిన్నమ్మ విశాఖ ప్రజలను పొగడ్తలతో ముంచెత్తింది. విశాఖ అంటే నేను... నేను అంటే విశాఖ అన్నట్లు మమేకమైపోయినా ఆమె రాష్ట్ర విభజన సమయంలో మీరు రాజీనామా చేయమంటే చేసేస్తా.... కేంద్రంతో పోరాడమంటే పోరాడతా నంటూ నాటి విశాఖ సభలలో చిన్నమ్మ ఉదరగొట్టింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిపోవడం... హస్తం పార్టీకే హ్యాండ్ ఇచ్చి కాషాయ వస్త్రం కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. కాషాయం పార్టీ టికెట్టుపై ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైంది. అది వేరే సంగతి.
అయితే ఉత్తరాంధ్ర జిల్లాలను హుదూద్ తుపాను అతలాకుతలం చేసింది. అందునా ఆమె ఒకప్పటి లోక్సభ నియోజకవర్గమైన విశాఖలో అయితే బీభత్సం సృష్టించింది. విశాఖ ప్రజలకు ఇంత జరిగిన ఆమె అటు వైపు కన్ను ఎత్తి కూడా చూడ లేదు. హుదూద్ తుపాను నేపథ్యంలో దేశంలోని వివిధ పారిశ్రామికవేత్తలు, బడా రాజకీయనాయకులు, పలు చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోహీరోయిన్లు భారీగా తమ విరాళాలు ప్రకటించారు. కానీ హుదూద్ తుపాను పై చిన్నమ్మ కనీసం స్పందించలేదు. విశాఖతో ఇక తన అనుబంధం తెగిపోయిందని చిన్నమ్మా భావిస్తున్నారో ఏమో. కనీసం ఉలుకుపలుకు లేకుండా ఉండి పోయారు.