పబ్లిసిటీ కోసమే చంద్రబాబు పాకులాట: చిరంజీవి
అనంతపురం: హుదూద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమైయ్యారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఆరోపించారు. తుపాను వస్తుందని తెలిసిన సహాయక చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో 50 మంది చనిపోయారని తెలిపారు.
గురువారం అనంతపురంలో చిరంజీవి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తుపాను సమయంలో కూడా చంద్రబాబు పబ్లిసిటీ కోసమే పాకులాడారని ఎద్దేవా చేశారు. రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... ఇప్పుడు రోజుకో మాట చెప్పి ప్రజల నుంచి తప్పించుకుంటున్నారని బాబు వైఖరీని దుయ్యబట్టారు.
బ్లాక్మనీపై బీజేపీది ద్వంద్వ వైఖరి అని అన్నారు. కేంద్రం దగ్గర చంద్రబాబుకు ఏ మాత్రం పలుకుబడి లేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడంలో బాబు విఫలమయ్యారని ఆరోపించారు. పచ్చని పొలాల్లో రాజధాని ఎందుకు పెడుతున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని ఏర్పాటుకు భూ సేకరణ కోసం రైతులను ఒప్పించాలి కానీ... బెదిరించకూడదని చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు.