చంద్రబాబుపై చిరంజీవి ఫైర్
హైదరాబాద్ : కాపు సామాజిక వర్గం పట్ల చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు చిరంజీవి మండిపడ్డారు. కాపుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. చిరంజీవి ఈ సందర్భంగా శనివారం ఓ లేఖను విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం అరెస్ట్ను ఆయన తీవ్రంగా ఖండించారు.
తుని ఘటనలను పురస్కరించుకుని చేస్తున్న అరెస్ట్లు ఏకపక్షంగా ఉన్నాయని చిరంజీవి తన లేఖలో పేర్కొన్నారు. కాగా తునిలో జరిగిన హింసాత్మక ఘటనలను ఎవరూ సమర్థించరని, బాధ్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. అయితే తుని ఘటనలో గోదావరి జిల్లాల వాసులు ఎవరూ లేరని చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు అక్కడ చేస్తున్న అరెస్ట్లను ఏవిధంగా సమర్థించుకుంటారని ప్రశ్నించారు.
సున్నితమైన సామాజిక సమస్యల పరిష్కారంలో ప్రదర్శించాల్సిన రాజకీయ పరిణితి లేకుండా కక్షగట్టినట్లు వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో తగదని చిరంజీవి అన్నారు. మొదటి నుంచి ముద్రగడ పద్మనాభం పట్ల ప్రభుత్వ అనుసరిస్తున్న పంథా...ఘర్షణాత్మకంగా ఉందన్నారు. ఆయన చేస్తున్న దీక్షకు రాజకీయాల్ని ఆపాదించి సమస్యను పక్కదారి పట్టించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ముఖ్యమంత్రికే తెలియాలన్నారు. తుని ఘటన అంశంలో ప్రభుత్వం సంయమనం పాటించి సమస్యను పరిష్కరించాలని చిరంజీవి సూచించారు. సిబీఐ విచారణ ద్వారానే తుని ఘటన నిందితుల్ని చట్టానికి పట్టించే కార్యక్రమం జరగాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముద్రగడ వార్తలను ప్రసారం చేయకుండా కొన్ని చానళ్లను నిలిపేయడం ప్రభుత్వ నియంతృత్వ పాలనకు పరాకాష్ట అని చిరంజీవి అభివర్ణించారు.