కాపుల సమస్యను పరిష్కరించండి
చంద్రబాబుకు చిరంజీవి లేఖ
- ముద్రగడ కుటుంబం పట్ల అమానుషంగా ప్రవర్తించారు
- చానళ్ల ప్రసారాల నిలిపివేత దారుణం
సాక్షి, హైదరాబాద్: పట్టువిడుపుతో కాపుల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కె.చిరంజీవి కోరారు. ఈ మేరకు ఆయన శనివారం లేఖ రాశారు. కాపు, బలిజ, ఒంటరి కులాలకు సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలంటూ దీక్షకు దిగిన మాజీమంత్రి ముద్రగడ పద్మనాభంను పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. ముద్రగడ కుటుం బంపట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషంగా ఉందన్నారు. తుని సంఘటనల్ని పురస్కరించుకుని చేస్తున్న అరెస్టులు ఏకపక్షంగా ఉన్నాయని, ముద్రగడ దీక్షకు సంబంధించిన వార్తల్ని ప్రసారం చేయకుండా కొన్ని చానళ్ల ప్రసారాలను నిలుపుదల చేయడం ప్రభుత్వ నియంతృత్వానికి పరాకాష్ట అని విమర్శించారు.
కాపుల రిజర్వేషన్ల అంశంతోపాటు ఎస్సీ వర్గీకరణ, బీసీలకు ఉపప్రణాళిక అమలు తదితర అంశాల్ని సానుకూల వైఖరితో వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. మంత్రులు, శాసనసభ్యులతో ఎదురుదాడి చేయించే సంకుచిత విధానాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. హింసాత్మక సంఘటనల్లో గోదావరి జిల్లాల వారెవ్వరూ లేరని, రాయలసీమ నుంచి వచ్చిన కొందరు ఇందుకు పాల్పడ్డారని చెప్పి.. ఇప్పుడు చేస్తున్న అరెస్టులను ఏవిధంగా సమర్థించుకుంటారని ప్రశ్నిం చారు. ఇదిలా ఉండగా శాసనమండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య శనివారం చిరంజీవిని ఆయన నివాసంలో కలసి ముద్రగడ దీక్ష పరిణామాలపై చర్చించారు.