రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ దందా
♦ ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా భూ సమీకరణ
♦ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మండిపాటు
సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని అమరావతి నిర్మాణం పేరిట ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా సాగిస్తోందని ప్రభుత్వ రిటైర్డ్ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ధ్వజమెత్తారు. స్టార్ హోటళ్లు, గోల్ఫ్ కోర్టుల కోసమని రైతులను బెదిరించి వేలాది ఎకరాలు సమీకరిస్తోందని విమర్శించారు.గురువారం ఉదయం విజయవాడలోని రోటరీ ఆడిటోరియంలో గ్రీన్ సాలిడర్స్ స్వచ్ఛంద సంస్థ ‘పర్యావరణం – సారవంత భూముల పరిరక్షణ’అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి మోసపూరితంగానే వ్యవహరించిందన్నారు. రాజధాని ప్రతిపాదన ఒక చోటు నుంచి మరో చోటుకు కదులుతూ.. మొదట నూజివీడు.. తర్వాత గన్నవరం, మంగళగిరి.. ఆ తర్వాత అమరావతికి చేరిందన్నారు. అసలు రాజధానికి 33వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
రాజధాని ప్రక్రియలో నన్ను దూరం పెట్టారు : రాజధాని ప్రక్రియలో అప్పటి ప్రభుత్వ సీఎస్‌గా ఉన్న నన్ను ప్రభుత్వం దూరం పెట్టింది. ప్రభుత్వ స్థలాల అన్వేషణ కోసం నన్ను సంప్రదించినప్పుడు దొనకొండను పరిపాలన నగరంగా ఏర్పాటుకు సూచించాను. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలను అభివృద్ధి చేసుకోవాలని నివేదించాను. ఆ సమయంలోనే శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేశారు. దానికి తొలుత నేను కన్వీనర్‌గా ఉంటారని చెప్పారు. నాలుగు రోజులకే సీఎస్‌గా బిజీగా ఉంటారు కాబట్టి నన్ను తొలగిస్తున్నట్లు తెలిపారు.
దేశ, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి రాజధానులను నిర్మిస్తేనే విజయవంతమవుతాయి. ‘మీరు సీఎస్‌గా ఉన్నారు.. అధికారం మీ చేతిలో ఉండింది.. ఆ రోజు మాట్లాడకుండా.. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు?’ అని చాలా మంది నన్ను ప్రశ్నిస్తున్నారు. వ్యవస్థలో పని చేసేటప్పుడు పరిమితులుంటాయి. అందుకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. అధికారికంగా ఏం చేసినా బయటకు చెప్పడానికి వీల్లేదు. రాజధాని విషయంలోనూ అదే జరిగింది. ఈ రోజు ఇలా మాట్లాడడానికి.. ఆ రోజు నేను చేసిన దానికి సంబంధం లేదు’’అని కృష్ణారావు వివరించారు.