FAO report
-
ప్రకృతి ప్రకోపానికి మూల్యం... 12,300 కోట్ల డాలర్లు!
(సాక్షి, సాగుబడి డెస్క్) :: అధిక ఉష్ణోగ్రతలు, కరువు, వరదలు, తుపాన్లు, భూకంపం, కార్చిచ్చులు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులు పెను సవాళ్లు విసురుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి గతమెన్నడూ లేనంత ఎక్కువ సార్లు, తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. పంటలు, పశువులకు విపత్తుల నష్టం ప్రతి ఏటా 12,300 కోట్ల డాలర్లు! గత 30 ఏళ్లలో 3.8 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ ఆహార దినోత్సవం(అక్టోబర్ 16) సందర్భంగా ‘వ్యవసాయం, ఆహార భద్రతలపై విపత్తుల ప్రభావం’పేరుతో వెల్లడించిన మొట్టమొదటి సమగ్ర నివేదికలో ఎఫ్ఏఓ ఈ వివరాలను తెలిపింది. ఎఫ్ఏఓ నివేదికలోని ముఖ్యంశాలివీ... పంటలు, పశువులకు గత (1991–2021) 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల వల్ల 3.8 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం జరిగింది. ప్రధానంగా అధిక ఉష్ణోగ్రతలు (26%), కరువు (19%), వరదలు (16%) వల్ల వీటికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా విపత్తుల వల్ల పంటలు, పశువులకు జరిగే ఆర్థిక నష్టంలో సగానికి సగం ఆసియా దేశాల్లోనే జరుగుతోంది. ఆసియా దేశాలు 45% (1,72,000 కోట్ల డాలర్లు), ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు 22% (82,800 కోట్ల డాలర్లు), యూరప్ దేశాలు 17% (65,900 కోట్ల డాలర్లు), ఆఫ్రికా దేశాలు 15% (57,800 కోట్ల డాలర్లు), ఓసియానియా 1% (5,500 కోట్ల డాలర్లు) నష్టపోయాయి. ప్రతి ఏటా సగటున నష్టం 12,300 కోట్ల డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి కనీసం 5% ప్రకృతి విపత్తుల వల్ల చిల్లుపడుతోంది. అంటే గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా పంటలు, పశువులకు జరిగిన నష్టం.. 2022లో బ్రెజిల్ జీడీపీకి సమానం! అల్పాదాయ దేశాలు, అల్ప–మధ్య ఆదాయ దేశాల్లో ఈ నష్టం అత్యధికంగా వాటి జీడీపీల్లో 10–15% వరకు ఉంటోంది. గత 30 ఏళ్లలో గణాంకాలను పరిశీలిస్తే.. విపత్తుల వల్ల సగటున ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 6.9 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి చే జారిపోతోంది. 2021లో ఫ్రాన్స్‌లో ఉత్పత్తయిన మొత్తం ఆహార ధాన్యాలతో ఇది సమానం. ఏడాదికి 4 కోట్ల టన్నుల పండ్లు, కూరగాయలు, చెరకు ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నాం. 2021లో వియత్నాం, జపాన్ ఉత్పత్తి చేసిన పండ్లు, కూరగాయలతో ఇది సమానం. మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్ల ఉత్పత్తిలో ఏటా 1.6 కోట్ల టన్నులు కోత పడుతోంది. 2021లో భారత్, మెక్సికో దేశాల్లో ఉత్పత్తయిన వాటికి ఇది సమానం. అయితే, వ్యవసాయ జీడీపీలో ఆసియా దేశాలు 4% విపత్తుల వల్ల కోల్పోతుంటే.. ఆఫ్రికా దేశాలు 8% వరకు కోల్పోతున్నాయి. పోషకాల పరంగా చూస్తే.. విపత్తుల వల్ల గత 30 ఏళ్లుగా ప్రతి రోజూ ఒక్కొక్కరు 147 కిలో కేలరీలను నష్టపోతున్నారు. విపత్తులతో కోల్పోతున్న ఆహారం ప్రతి రోజూ 40 కోట్ల మంది పురుషులు లేదా 50 కోట్ల మంది మహిళల ఆకలి తీర్చడానికి సరిపోతుంది. కార్చిచ్చుల వల్ల ఏటా 34–37 కోట్ల హెక్టార్ల భూమిలో పచ్చదనం దగ్ధమవుతోంది. ఒక్క 2021లోనే 2.5 కోట్ల అడవులు తగులబడ్డాయి. పంటలను రక్షించుకోవడానికి ఉపకరించే, వాతారణ మార్పుల్ని దీటుగా తట్టుకునే, ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయ పద్ధతులను అమల్లోకి తేవాలి. వాతావరణ మార్పుల వల్ల ఇతర దేశాల నుంచి వచ్చిపడే సరికొత్త చీడపీడలు పంటలకు కలిగిస్తున్న నష్టం గురించి సమగ్రంగా అంచనా వేయగలిగే యంత్రాంగం, కొలమానం కొరవడ్డాయి. అయితే, ఈ నష్టం సంపన్న దేశాల్లో ఎక్కువగా ఉంటోంది. సాంకేతిక సహకారం, క్షేత్రస్థాయిలో ఉత్తమ సాగు పద్ధతులను అనుసరిస్తే వ్యవసాయంలో విపత్తుల నష్టాన్ని నివారించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తద్వారా వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకోవచ్చు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలపై రూపాయి వెచ్చిస్తే రూపాయిల మేరకు ప్రయోజనం కలుగుతోందని అంచనా. -
కత్తెర పురుగుకు కళ్లెం
మొక్కజొన్నను ఖరీఫ్‌లో ఆశించిన ఫామ్ ఆర్మీ వార్మ్ (కత్తెర పురుగు) తెలుగు రాష్ట్రాల్లో జొన్నకూ పాకింది. మొక్కజొన్నను అమితంగా ఇష్టపడే ఈ లద్దెపురుగు ఆ పంట అందుబాటులో లేనప్పుడు ఇతరత్రా 80 రకాల పంటలకు పాకే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చెబుతోంది. చాలా ఏళ్లుగా అమెరికా, ఆఫ్రికాలలో పంటలను ఆరగిస్తున్న ఈ పురుగు మన దేశంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే చాలా రాష్ట్రాలకు పాకింది. గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఇది మొక్కజొన్న పంటను ఆశించింది. మొక్కజొన్న నుంచి కొన్ని చోట్ల జొన్నకు, ఇతర రాష్ట్రాల్లో చెరకుకు కూడా పాకినట్లు చెబుతున్నారు. రసాయనిక పురుగుమందులతో ప్రయోజనం లేదని, కషాయాలు, మట్టి ద్రావణం, రాక్ డస్ట్ వంటి రసాయనికేతర పద్ధతుల ద్వారానే సమర్థవంతంగా నియంత్రించగలుగుతున్నామని, రైతులు భయపడ వద్దని ఏపీలో పర్యటిస్తున్న ఎఫ్.ఎ.ఓ.కి చెందిన సుస్థిర వ్యవసాయ నిపుణురాలు అన్నే సోఫీ, రైతు సాధికార సంస్థలో ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డాక్టర్ జాకీర్ హుస్సేన్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కత్తెర పురుగు వల్ల దిగుబడి నష్టాన్ని నిలువరించడవచ్చంటున్నారు. అంతరపంటలు, కంచె పంటగా నేపియర్ గడ్డి మొక్కజొన్న, జొన్న పొలాల్లో ఖచ్చితంగా అంతరపంటలు వేయటం మేలన్నారు. రబీలో మొక్కజొన్న వేస్తున్న రైతులు 2 సాళ్లు మొక్కజొన్న, 1 సాలు మినుము/పెసర అంతరపంటలుగా వేసుకోవాలి. కంచె పంటగా నేపియర్ గడ్డిని 4 వరుసలు వేసుకోవాలని డాక్టర్ జాకీర్ హుస్సేన్ సూచించారు. అగ్ని అస్త్రం, ఎర్రమట్టి నీరు, బూడిద, సాడస్ట్.. ఈ పురుగు సోకిన మొక్కజొన్న మొక్కల మొవ్వుల్లో అగ్ని అస్త్రం, ఎర్రమట్టి నీరు, బూడిద, సాడస్ట్ వేయడం, నీమాస్త్రం, వేపగింజల కషాయం (మార్కెట్లో అమ్మే వేపనూనె అంత బాగా పనిచేయటం లేదు) పిచికారీ ద్వారా ప్రకృతి వ్యవసాయదారులు కత్తెర పురుగు వ్యాప్తిని ఖరీఫ్‌లో సమర్థవంతంగా అరికట్టి, దిగుబడి నష్టాన్ని నివారించుకోగలిగారన్నారు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులు పురుగు సోకగానే దున్నేశారని డా. జాకీర్ హుస్సేన్ తెలిపారు. కత్తెర పురుగు లేత ఆకులను తినేస్తుందని, కండెలను ఏమీ చేయదని అంటూ ఇది కనిపించగానే రైతులు తోటలను తొలగించాల్సిన పని లేదన్నారు. గుడ్డు దశలో ఉన్నప్పుడు గుడ్లను ఆకులపై గుర్తించి, నలిపేసి నిర్మూలించుకోవడం మంచిదన్నారు. విష ముష్టి (నక్స్ వామిక) కాయలను ముక్కలు కోసి 5 రోజులు మురగబెట్టి.. 10 లీటర్ల నీటికి చిన్న గ్లాసుడు చొప్పున ఇది చల్లాలని ఆయన తెలిపారు. పంచదార పొలంలో చల్లితే చీమలు వచ్చి ఈ పురుగులను తినేస్తాయి. 16 లీటర్ల స్రేయర్ ట్యాంకు నీటిలో 20 గ్రాముల పంచదార కలిపి పంటపై పిచికారీ చేస్తే.. ఈ తీపికి వచ్చే చీమలు పురుగులను తినేస్తాయని డా. జాకీర్ హుస్సేన్(88268 97278) అన్నారు. ఇప్పట్లో నిర్మూలించలేం: ఎఫ్.ఎ.ఓ. ‘కత్తెర పురుగు చాలా ఏళ్ల నుంచే అమెరికా, ఆఫ్రికా సహా 60 దేశాల్లో ఉంది. భారత్‌లో అనేక దక్షిణాది, ఉత్తరాది రాష్టాలకు ఈ ఏడాది పాకింది. మొక్కజొన్న, జొన్న, చెరకుకు కూడా సోకింది. ఒకేసారి తుడిచిపెట్టడలేం. చాలా సంవత్సరాలు కొనసాగుతాయి. కానీ, జీవన పురుగుమందులు, ఎర్రమట్టి ద్రావణం, బయో పెస్టిసైడ్స్ తదితరాలతో అదుపు చేసుకోవచ్చు. రసాయనిక పురుగుమందులు చల్లితే సమస్య తీరదు. ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్ధతుల ద్వారా దీన్ని సమర్థవంతంగా నివారించగలుగుతున్నట్లు రైతుల పొలాల్లో జరిపిన అధ్యయనంలో గుర్తించాం..’ అని ఎఫ్.ఎ.ఓ. సుస్థిర వ్యవసాయ నిపుణురాలు అన్నే సోఫీ(70427 22338) వివరించారు. డా. జాకీర్ హుస్సేన్, అన్నే సోఫీ -
మూడో వంతు మట్టిలోకి!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఏటా 130 కోట్ల టన్నుల ఆహార పదార్థాలు మట్టి పాలవుతున్నట్లు ఐరాస అధ్యయనం వెల్లడించింది. దీని విలువ సుమారు రూ. 48 లక్షల కోట్లని అంచనా వేసింది. ఆహార ధాన్యాలను నిల్వ చేసే సామర్థ్యం లేకపోవటం, మనిషి నిర్లక్ష్యం కారణంగా ఉత్పత్తి అవుతున్న ఆహార పదార్థాల్లో మూడో వంతు వృథాగా మారుతున్నాయని తెలిపింది. దీనివల్ల వీటి తయారీకి దోహదపడే నీరు, రసాయనాలు, ఇంధనం కూడా వ్యర్థమవుతున్నాయి. ‘ఆహార ధాన్యాల వృథా - సహజ వనరులపై ప్రభావం’ పేరుతో ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ తొలిసారిగా వెలువరించిన ఈ అధ్యయనంలో అంతర్జాతీయంగా తిండిని వృథా చేయటం వల్ల కలిగే దుష్ర్పభావాల గురించి పర్యావరణ కోణంలో వివరించారు. వాతావరణం, నీరు, భూమి వినియోగం, జీవ వైవిధ్యం తదితర అంశాలను ప్రస్తావించారు. మానవ ఆహార చక్రంలోని వివిధ దశల్లో ఆహార పదార్థాల వినియోగంలో జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు రైతులు, మత్స్యకారులు, ఆహార శుద్ధిదారులు, సూపర్మార్కెట్లు, ప్రభుత్వాలు, వ్యక్తిగత వినియోగదారులు అంతా కలిసి చర్యలు తీసుకోవాలని ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ డెరైక్టర్ జనరల్ జోస్ సూచించారు. ప్రపంచంలో ఒకవైపు 87 కోట్ల మంది తిండి లేక నకనకలాడుతుంటే ఈ స్థాయిలో వృథా సరికాదన్నారు.