(సాక్షి, సాగుబడి డెస్క్) :: అధిక ఉష్ణోగ్రతలు, కరువు, వరదలు, తుపాన్లు, భూకంపం, కార్చిచ్చులు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులు పెను సవాళ్లు విసురుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి గతమెన్నడూ లేనంత ఎక్కువ సార్లు, తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. పంటలు, పశువులకు విపత్తుల నష్టం ప్రతి ఏటా 12,300 కోట్ల డాలర్లు! గత 30 ఏళ్లలో 3.8 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ ఆహార దినోత్సవం(అక్టోబర్ 16) సందర్భంగా ‘వ్యవసాయం, ఆహార భద్రతలపై విపత్తుల ప్రభావం’పేరుతో వెల్లడించిన మొట్టమొదటి సమగ్ర నివేదికలో ఎఫ్‌ఏఓ ఈ వివరాలను తెలిపింది.
ఎఫ్‌ఏఓ నివేదికలోని ముఖ్యంశాలివీ...
పంటలు, పశువులకు గత (1991–2021) 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల వల్ల 3.8 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం జరిగింది. ప్రధానంగా అధిక ఉష్ణోగ్రతలు (26%), కరువు (19%), వరదలు (16%) వల్ల వీటికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
ప్రపంచవ్యాప్తంగా విపత్తుల వల్ల పంటలు, పశువులకు జరిగే ఆర్థిక నష్టంలో సగానికి సగం ఆసియా దేశాల్లోనే జరుగుతోంది. ఆసియా దేశాలు 45% (1,72,000 కోట్ల డాలర్లు), ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు 22% (82,800 కోట్ల డాలర్లు), యూరప్ దేశాలు 17% (65,900 కోట్ల డాలర్లు), ఆఫ్రికా దేశాలు 15% (57,800 కోట్ల డాలర్లు), ఓసియానియా 1% (5,500 కోట్ల డాలర్లు) నష్టపోయాయి. ప్రతి ఏటా సగటున నష్టం 12,300 కోట్ల డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి కనీసం 5% ప్రకృతి విపత్తుల వల్ల చిల్లుపడుతోంది. అంటే గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా పంటలు, పశువులకు జరిగిన నష్టం.. 2022లో బ్రెజిల్
జీడీపీకి సమానం!
అల్పాదాయ దేశాలు, అల్ప–మధ్య ఆదాయ దేశాల్లో ఈ నష్టం అత్యధికంగా వాటి జీడీపీల్లో 10–15% వరకు ఉంటోంది. గత 30 ఏళ్లలో గణాంకాలను పరిశీలిస్తే.. విపత్తుల వల్ల సగటున ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 6.9 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి చే జారిపోతోంది. 2021లో ఫ్రాన్స్‌లో ఉత్పత్తయిన మొత్తం ఆహార ధాన్యాలతో ఇది సమానం. ఏడాదికి 4 కోట్ల టన్నుల పండ్లు, కూరగాయలు, చెరకు ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నాం. 2021లో వియత్నాం, జపాన్ ఉత్పత్తి చేసిన పండ్లు, కూరగాయలతో ఇది సమానం.
మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్ల ఉత్పత్తిలో ఏటా 1.6 కోట్ల టన్నులు కోత పడుతోంది. 2021లో భారత్, మెక్సికో దేశాల్లో ఉత్పత్తయిన వాటికి ఇది సమానం.
అయితే, వ్యవసాయ జీడీపీలో ఆసియా దేశాలు 4% విపత్తుల వల్ల కోల్పోతుంటే.. ఆఫ్రికా దేశాలు 8% వరకు కోల్పోతున్నాయి. పోషకాల పరంగా చూస్తే.. విపత్తుల వల్ల గత 30 ఏళ్లుగా ప్రతి రోజూ ఒక్కొక్కరు 147 కిలో కేలరీలను నష్టపోతున్నారు. విపత్తులతో కోల్పోతున్న ఆహారం ప్రతి రోజూ 40 కోట్ల మంది పురుషులు లేదా 50 కోట్ల మంది మహిళల ఆకలి తీర్చడానికి సరిపోతుంది. కార్చిచ్చుల వల్ల ఏటా 34–37 కోట్ల హెక్టార్ల భూమిలో పచ్చదనం దగ్ధమవుతోంది. ఒక్క 2021లోనే 2.5 కోట్ల అడవులు తగులబడ్డాయి. పంటలను రక్షించుకోవడానికి ఉపకరించే, వాతారణ మార్పుల్ని దీటుగా తట్టుకునే, ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయ పద్ధతులను అమల్లోకి తేవాలి.
వాతావరణ మార్పుల వల్ల ఇతర దేశాల నుంచి వచ్చిపడే సరికొత్త చీడపీడలు పంటలకు కలిగిస్తున్న నష్టం గురించి సమగ్రంగా అంచనా వేయగలిగే యంత్రాంగం, కొలమానం కొరవడ్డాయి. అయితే, ఈ నష్టం సంపన్న దేశాల్లో ఎక్కువగా ఉంటోంది. సాంకేతిక సహకారం, క్షేత్రస్థాయిలో ఉత్తమ సాగు పద్ధతులను అనుసరిస్తే వ్యవసాయంలో విపత్తుల నష్టాన్ని నివారించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తద్వారా వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకోవచ్చు.
ముందస్తు హెచ్చరిక
వ్యవస్థలపై రూపాయి వెచ్చిస్తే రూపాయిల మేరకు ప్రయోజనం కలుగుతోందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment