ఎఫ్‌సీఐ పునర్నిర్మాణంపై ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: ప్రజా పంపిణీ పథకం(పీడీఎస్) అమలులో కీలకపాత్ర పోషించే భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) పునర్నిర్మాణంపై తగిన సూచనలు చేసేందుకు 8మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. పనితీరు, వ్యయం పరంగా ఎఫ్‌సీఐలో ఉన్న లోపాలను తొలగించే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చే సినట్టు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ తన ఉత్తర్వులో పేర్కొంది.
పార్లమెంటు సభ్యుడు శాంతకుమార్ అధ్యక్షుడిగా ఎఫ్‌సీఐ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ సీ విశ్వనాథ్, వ్యవసాయ ఉత్పత్తుల ధరల కమిషన్ మాజీ చైర్మన్ అశోక్ గులాటీ, ఎలెక్ట్రానిక్స్, ఐటీ కార్యదర్శి రామ్ సేవక్ శర్మ, పంజాబ్, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, అహ్మదాబాద్ ఐఐఎంకు చెందిన జీ రఘురామ్, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన జీ నాంచారయ్య తదితరులు కమిటీ సభ్యులుగా ఉంటారు.
కనీస మద్దతు ధర, ఆహార ధాన్యాల నిల్వ, పంపిణీ, ఆహార భద్రత తదితర అంశాలపై ఎఫ్‌సీఐ మరింత క్రియాశీలకంగా నిర్వహించవలసిన పాత్రను గురించి ఈ కమిటీ సూచనలు చేస్తుంది. కమిటీ మూడు నెలల్లోగా తన నివేదిక సమర్పించవలసి ఉంటుంది.