Fertilizer subsidy
-
Budget 2024: సబ్సిడీలకు కోతలు.. తగ్గిన కేటాయింపులు
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పలు సబ్సిడీలకు కేటాయింపుల్లో కోతలు పెట్టింది. రైతులకు అందించే ఎరువులు, ఆహార, పెట్రోలియం ఉత్పత్తులకు సబంధించిన కేటాయింపులను ఈ బడ్జెట్లో గణనీయంగా తగ్గించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్లో ఎరువుల సబ్సిడీకి రూ.1.64 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.1.89 లక్షల కోట్లతో పోల్చితే 13.2 శాతం తగ్గించారు. అలాగే 2023-24 బడ్జెట్లో 1.75 లక్షల కోట్లు కేటాయించారు. కేంద్రం యూరియాపై సబ్సిడీ, ఇతర ఎరువులపై పోషకాల ఆధారిత సబ్సిడీ ఇస్తుంది. అంతర్జాతీయ ధరలు తగ్గుముఖం పట్టడం, బయో, సేంద్రియ ఎరువుల కోసం ఒత్తిడి పెరగడం , నానో-యూరియా వినియోగం పెరిగిన నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎరువు సబ్సిడీకి కేటాయింపు తగ్గుదల కనిపించింది. దేశం మొత్తం ఎరువుల వినియోగంలో యూరియా 55-60 శాతం ఉంటోంది. రైతులకు సబ్సిడీ యూరియా 45 కిలోల బ్యాగ్ రూ.242లకు లభిస్తోంది. దీనికి పన్నులు, వేప పూత ఛార్జీలు అదనం. అయితే ఇదే బ్యాగ్ అసలు ధర సుమారు రూ.2,200 ఉంది. ఇక ఆహార, పెట్రోలియ ఉత్పత్తులపై ఇస్తున్న సబ్సిడీకి సంబంధించిన కేటాయింపులను 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం తగ్గించింది. ఆహార ఉత్పత్తుల సబ్సిడీ కోసం ఈ బడ్జెట్లో రూ.2,05,250 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కేటాయించిన రూ.2,12,332 కోట్లతో పోల్చితే 3.33 శాతం తక్కువ. అలాగే పెట్రోలియం ఉత్పత్తులపై ఇచ్చే సబ్సిడీ కోసం గతేడాది కేటాయించిన రూ. 12,240 కోట్ల కంటే 2.6 శాతం తక్కువగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.11,925 కోట్లు కేటాయించింది. -
ఎకానమీకి మరింత జోష్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఆత్మనిర్భర్ భారత్ 3.0 కింద మరిన్ని చర్యలు ప్రకటించారు. నిర్దిష్ట గృహ విక్రయ లావాదేవీలపై పన్నుపరమైన ప్రయోజనాలు, మరికొన్ని రంగాలకు అత్యవసర రుణ హామీ పథకం వర్తింపు, కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహకాలు, ఎరువుల సబ్సిడీకి అదనంగా కేటాయింపులు మొదలైనవి వీటిలో ఉన్నాయి. లాక్డౌన్ అమలు చేసినప్పట్నుంచీ ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల మొత్తం పరిమాణం దాదాపు రూ. 30 లక్షల కోట్లుగా ఉంటుందని (స్థూల దేశీయోత్పత్తిలో 15 శాతం) నిర్మలా సీతారామన్ తెలిపారు. పటిష్టంగా రికవరీ... దీర్ఘకాలం లాక్డౌన్ అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన రికవరీ నమోదు చేస్తోందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉత్పత్తి గణాంకాల మెరుగుదలతో పాటు, అక్టోబర్‌లో ఇంధన వినియోగ వృద్ధి 12 శాతం పెరిగిందని.. వస్తు, సేవల పన్నుల వసూళ్లు 10 శాతం వృద్ధి చెంది రూ. 1.05 లక్షల కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన.. కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ప్రావిడెంట్ ఫండ్పరమైన సబ్సిడీని ఇవ్వడం ద్వారా ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేందుకు కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన ఆవిష్కరించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో నమోదై, కొత్తగా ఉద్యోగులను తీసుకునే సంస్థలకు ఇది వర్తిస్తుంది. దీని ప్రకారం రెండేళ్ల పాటు పీఎఫ్ చందాలో ఉద్యోగి వాటా (జీతంలో 12 శాతం), సంస్థ వాటా (జీతంలో 12 శాతం) కలిపి మొత్తం 24 శాతాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఈపీఎఫ్‌వోలో నమోదైన సంస్థలో, రూ. 15,000 లోపు నెలవారీ జీతంపై చేరే కొత్త ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలాగే రూ. 15,000 కన్నా తక్కువ వేతనమున్న ఈపీఎఫ్ సభ్యులు, కరోనా వైరస్ పరిణామాలతో మార్చి 1వ తేదీ తర్వాత ఉద్యోగం కోల్పోయి, అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలోకి చేరినా.. వారికి కూడా ఈ పథ కం వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2021 జూన్ 30 దాకా ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది. ఈ స్కీమును ఉపయోగించుకోదల్చుకున్న పక్షంలో.. 50 మంది దాకా ఉద్యోగులు ఉన్న సంస ్థలు కొత్తగా కనీసం ఇద్దరు ఉద్యోగులకు, 50 మంది కి పైగా సిబ్బంది ఉన్న సంస్థలు కనీసం అయిదు మందికి ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. ఈసీఎల్జీఎస్ మార్చి దాకా పొడిగింపు... వచ్చే ఏడాది మార్చి 31 దాకా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌ను కేంద్రం పొడిగించింది. చిన్న, లఘు సంస్థలకు ఈ పథకం కింద తనఖా లేని రుణాలు లభిస్తాయి. కామత్ కమిటీ గుర్తించిన 26 రంగాలతో పాటు హెల్త్‌కేర్ రంగానికి కూడా ఈ స్కీమ్ వర్తింపచేయనున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ కంపెనీలకు రుణాలపై ఏడాది మారటోరియంతో పాటు చెల్లింపునకు నాలుగేళ్ల వ్యవధి లభిస్తుందని వివరించారు. రియల్టీకి తోడ్పాటు... గృహ కొనుగోలుదారులు, డెవలపర్లకు ఆదాయ పన్నుపరమైన ఊరటనిచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ. 2 కోట్ల దాకా విలువ చేసే కొత్త గృహాలను స్టాంప్ డ్యూటీ సర్కిల్ రేటు కన్నా 20 శాతం తక్కువకు విక్రయించేందుకు అనుమతించేలా ఆదాయ పన్ను చట్టాన్ని సవరించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యత్యాసం 10 శాతం దాకా మాత్రమే ఉంది. అమ్ముడుపోకుండా పేరుకుపోయిన గృహాల విక్రయానికి ఊతమివ్వడంతో పాటు కొనుగోలుదారులు, డెవలపర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిర్మలా సీతారామన్ వివరించారు. ప్రస్తుతం ఐటీ చట్టంలోని సెక్ష¯Œ 43సీఏ ప్రకారం.. సర్కిల్ రేటు కన్నా ఒప్పంద విలువ 10 శాతానికి మించి తగ్గిన పక్షంలో పన్నుపరమైన జరిమానాలు ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. దీనివల్ల నిల్వలు పేరుకుపోతున్నా.. బిల్డర్లు రేట్లు తగ్గించే పరిస్థితి లేదని వివరించాయి. ఈ నిబంధన సడలించడమనేది.. రేట్లు తగ్గించేందుకు, విక్రయాలు పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. రూ. 65వేల కోట్ల ఎరువుల సబ్సిడీ .. ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ఎరువుల సబ్సిడీ కోసం రూ. 65,000 కోట్లు కేటాయిస్తున్నట్లు సీతారామన్ వెల్లడించారు. పంట సీజ¯Œ లో రైతులకు సరైన సమయంలో, తగినంత స్థాయిలో ఎరువులు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది రైతాంగానికి గణనీయంగా తోడ్పడగలదని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ పేర్కొన్నారు. ఎరువుల వినియోగం 2016–17లో 499 లక్షల టన్నులుగా ఉండగా 2020–21లో 673 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. మరిన్ని చర్యలు.. ► పట్టణ ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఇళ్ల పథకానికి అదనంగా రూ. 18,000 కోట్లు. ► కాంట్రాక్టర్లకు నిధుల లభ్యత మరికాస్త మెరుగ్గా ఉండే విధంగా ప్రాజెక్టులకు కట్టాల్సిన ముందస్తు డిపాజిట్ పరిమాణం తగ్గింపు. 2021 డిసెంబర్ 31 దాకా వర్తింపు. ► కోవిడ్–19 టీకాపై పరిశోధనలకు బయోటెక్నాలజీ విభాగానికి రూ. 900 కోట్ల గ్రాంటు. ► గ్రామీణ ఉపాధికి రూ.10,000 కోట్లు. ► మరింతగా రుణ వితరణకు తోడ్పడేలా ఎగ్జిమ్ బ్యాంక్‌కు రూ. 3,000 కోట్లు. ► డిఫెన్స్, ఇన్ఫ్రా కోసం బడ్జెట్ కేటాయింపులకు మించి రూ. 10,200 కోట్లు. -
కొత్త తరహాలో ఎరువుల సబ్సిడీ బదిలీ
న్యూఢిల్లీ: ఎరువులకు సంబంధించి రూ.70 వేల కోట్ల సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు కేంద్రం 3 కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎరువుల సరఫరా, లభ్యత, అవసరం తదితర వివరాలతో కూడిన ప్లాట్‌ఫాం, అభివృద్ధిపరిచిన పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) సాఫ్ట్వేర్, డెస్క్‌టాప్ పీవోఎస్ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి (డీబీటీ) ఎరువుల సబ్సిడీ బదిలీ చేసే పథకం రెండో విడతలో భాగంగా ఈ మేరకు ఈ సాంకేతికతలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఎరువుల సబ్సిడీ డీబీటీ మొదటి విడతను కేంద్రం 2017 అక్టోబర్‌లో ప్రవేశపెట్టింది. ఈ విడతలో పీవోఎస్ మెషీన్లలో నిక్షిప్తమైన డేటాను సరిచూసి సబ్సిడీ మొత్తాన్ని కంపెనీలకు బదిలీ చేసేవారు. ‘తాజా సాంకేతికతతో నేరుగా రైతులకు చేరువయ్యేందుకు ఎంతో దోహదపడుతుంది. ఎరువుల రంగంలో పారదర్శకత పెరుగుతుంది’అని ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ పేర్కొన్నారు. ఇప్పటివరకు 13 వెర్షన్ల పీవోఎస్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చామని, దేశంలోని 2.24 లక్షల రిటెయిల్ ఎరువుల దుకాణాల్లో పీవోఎస్ సాఫ్ట్‌వేర్‌ను తెచ్చామన్నారు. ల్యాప్టాప్స్, కంప్యూటర్లలో ఎరువుల విక్రయాలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను వినియోగించొచ్చని చెప్పారు. -
దేశవ్యాప్తంగా రైతుబంధు!
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో ఓటమిపాలైన బీజేపీ రైతులకు చేరవయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో పంటకాలానికి రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున నేరుగా వారి ఖాతాలోకే నగదును బదిలీచేసే కొత్త పథకానికి కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే, ఎకరానికి రూ.50 వేల వడ్డీ రహిత (రైతుకు గరిష్టంగా రూ.లక్ష) రుణాలు అందించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు పథకాల వల్ల కేంద్ర ఖజానాపై ఏటా రూ.2.3 లక్షల కోట్ల భారం పడే అవకాశాలున్నాయి. ఎరువుల సబ్సిడీ పథకాన్ని కూడా వీటిలో విలీనం చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలోనే వెలువడుతుందని భావిస్తున్నారు. -
సబ్సీడీలు కాదు ప్రోత్సాహకాలు కావాలి
న్యూఢిల్లీ: దేశంలో సేంద్రీయ వ్యవసాయాన్ని పోత్సహించడానికి ఎరువుల సబ్సిడీలకు బదులు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ప్రతిపాదించారు. దేశంలో తొలి ఆర్గానిక్ రాష్ట్రం సిక్కిం అని 2016లో ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సిక్కిం ప్రజలు వదులుకున్న ఎరువుల సబ్సిడీలకి రెండు రెట్ల మొత్తాన్ని నగదుగా ఇవ్వాలని కోరితే ప్రధాని స్పందించలేదని అని చామ్లింగ్ గుర్తు చేశారు. సేంద్రీయ వ్యవసాయానికి మారడానికి బిహార్, ఇతర ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం సాయం కోరుతున్నాయని తెలిపారు. సేంద్రీయ విధానానికి మారకుంటే మన భవిష్యత్ సురక్షితం కాదని హెచ్చరించారు. -
ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరణ ఆపకండి
శాంతకుమార్ కమిటీ సిఫారసులను తిరస్కరించండి ప్రధానమంత్రికి వైఎస్సార్ కాంగ్రెస్ వినతిపత్రం సాక్షి, న్యూఢిల్లీ: ఎఫ్‌సీఐ ద్వారా చేపట్టే ధాన్యం సేకరణను నిలిపివేసే ప్రయత్నలను ఉపసంహరించుకోవాలని.. ఎరువుల సబ్సిడీని పరిమితం చేయరాదని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని వైఎస్సార్ కాంగ్రెస్ కోరింది. పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు సోమవారం ప్రధానిని కలిసి ఈమేరకు ఒక వినతిపత్రం అందించారు. ‘‘ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)ను పునర్వ్యవస్థీకరించేందుకు వీలుగా శాంతకుమార్ కమిటీ చేసిన సిఫారసుల నివేదికను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలా జరిగితే వ్యవసాయాధారిత రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల రైతులకు ఇది పెద్ద దెబ్బగా పరిణమిస్తుంది. చివరకు దేశ ఆహార భద్రతకు కూడా ముప్పు తెస్తుంది. ఆ సిఫారసులను ఆమోదిస్తే అటు ఆహార భద్రతతో పాటు.. దేశంలో వ్యవసాయరంగంపై ఆధారపడిన 50 శాతం మంది ప్రజల జీవనోపాధి కూడా దెబ్బతింటుంది’’ అని ఆ వినతిపత్రంలో ఆందోళన వ్యక్తంచేశారు. వినతిపత్రంలోని ముఖ్యాంశాలివీ... ఎఫ్‌సీఐ సేకరించకపోతే... ‘‘రైతులు తమ పంటలను మంచి ధర వచ్చేంతవరకు గిడ్డంగుల్లో దాచుకునే పరిస్థితి లేదు. పంట పండిన కొద్ది రోజుల్లోనే వారు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈ పంటను ఎఫ్‌సీఐ సేకరించలేదంటే తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతయి. ఇది మానవ తప్పితమైన విషాదంగా మారుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితినే చూస్తే 2010-11లో మంచి దిగుబడులు వచ్చాయి. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఎఫ్‌సీఐ కూడా కనీస మద్దతు ధర రైతులకు అందేలా చేయడంలో విఫలమైంది. రైతులు క్వింటాలు ధాన్యాన్ని రూ. 300 ధరకు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది. ఇది రైతులను తీవ్రంగా కుంగదీసింది. దీంతో వారు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌సీఐ 80 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 35 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించారు. పైగా పంట చేతికి వచ్చిన అక్టోబరు, నవంబరు మాసాల్లో సేకరణ జరగలేదు. దీని కారణంగా రైతులు కనీస మద్దతు ధర కంటే రూ. 150 తక్కువకే అమ్ముకోవాల్సి వచ్చింది. అలాగే సరైన సమయంలో పత్తి పంట సేకరించడంలో సీసీఐ పూర్తిగా విఫలమైంది. రైతులు తక్కువ ధరకే మధ్యవర్తులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎఫ్‌సీఐల విధులను రాష్ట్రాలు నిర్వర్తిస్తాయని కేంద్రం ఎలా నమ్ముతోంది? గడిచిన పదేళ్లలో 75 శాతం ధాన్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్‌సీఐ బాధ్యతలను స్వీకరించేందుకు ఆర్థిక వనరులెక్కడివి? ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 2015-16 బడ్జెట్లో మార్కెట్ నిర్వహణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని తెలుస్తోంది.’’ స్వామినాథన్ సిఫారసులు అమలుచేయండి ‘‘మద్దతు ధరను నిర్ధారించేందుకు ఎం.ఎస్.స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలుచేయాలని నాడు ఎన్డీయే కూడా కోరింది. కానీ 2014-15 సంవత్సరంలో ఎన్డీయే అతి తక్కువగా కనీస మద్దతు ధరను పెంచింది. పంట ఉత్పత్తికి అయ్యే వ్యయంతోపాటు 50 శాతం లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని ఎంఎస్పీని ఖరారుచేయాలని ఆ కమిషన్ సూచించింది. ఉత్పత్తి వ్యయాలు అధికమవుతున్న నేపథ్యంలో 2015-16 ఖరీఫ్ సీజన్లో వరికి కనీసం రూ. 1,700 ఎంఎస్పీగా ఖరారుచేయాల్సిన అవసరముంది. లేదంటే రైతులు దురవస్థలోనే కొనసాగుతారు. మా రాష్ట్రంలో రైతులు వరస తుఫాన్లతో, వరద్లతో గడిచిన నాలుగేళ్లుగా నష్టపోతున్నారు. రాయలసీమ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఒక తుపాను నుంచి కోలుకోకముందే మరో తుపానులో రైతు కొట్టుకుపోతున్నాడు. ఇలా దెబ్బతిన్న రైతుల్లో ఒక శాతం వారినీ రాష్ట్రం ఆదుకోవడం లేదు. ఉదాహరణకు ఇటీవల హుద్‌హుద్ తుపాను సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం రూ. 21 వేల కోట్ల మేర నష్టపోతే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కనీసం దీనిలో 10 శాతం కూడా పునరావాసానికి, సహాయ చర్యలకు ఖర్చుపెట్టలేకపోయాయి.’’ ఎరువుల సబ్సిడీని పరిమితం చేయకండి ‘‘శాంతకుమార్ కమిటీ ప్రస్తుతం ఉన్న పద్ధతిని రద్దు చేసి హెక్టారుకు రూ. 7వేల చొప్పున ఎరువుల సబ్సిడీ ప్రకటించాలని సిఫారసు చేసింది. ఏపీ వంటి రాష్ట్రాల్లో హెక్టారుకు ఎన్పీకే వినియోగం చాలా ఎక్కువ. హెక్టారుకు రూ. 7 వేలకు పరిమితి విధిస్తే మాలాంటి రాష్ట్రాల్లో ఒక్క పంటకు కూడా సరిపోదు. రెండో పంటకు రైతులు సబ్సిడీ లేకుండా మార్కెట్ ధరకు కొనుక్కోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల శాంతకుమార్ నివేదికను తిరస్కరించండి. కనీస మద్దతు ధరను ఖరారు చేసేందుకు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలుచేయండి.’’ -
పార్లమెంటు సమాచారం
ఎరువులకూ ప్రత్యక్ష నగదు బదిలీ!: రైతులకు ఎరువుల సబ్సిడీని ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని రసాయనాలు, ఎరువుల మంత్రి అనంత్ కుమార్ మంగళవారం లోక్‌సభలో తెలిపారు. ఆత్మహత్యాయత్నం నేరం కాదు: ఆత్మహత్యా యత్నాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ 309 సెక్షన్‌ను తొగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి లోక్‌సభకు చెప్పారు. దీంతో ప్రస్తుతం ఏడాది జైలు శిక్ష పడుతున్న ఈ యత్నం ఇక నేరం కాబోదన్నారు. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు 685: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో గత 8 నెలల్లో పాకిస్తాన్ 685 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ రాజ్యసభకు తెలిపారు. ఈ కాల్పుల్లో 8 మంది భద్రతా సిబ్బంది 16 మంది పౌరులు చనిపోయారని వెల్లడించారు. స్వైన్‌ఫ్లూ మరణాలు 841: స్వైన్‌ఫ్లూతో ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 22 మధ్య దేశంలో 841 మంది చనిపోయారని, 14,673 మందికి ఆ వ్యాధి సోకిందని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటించారు. నల్లధన ం నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం: నల్లధన నియంత్రణకు ప్రభుత్వం సాధ్యమైన చర్యలన్నింటినీ తీసుకుంటోందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభకు తెలిపారు. సుప్రీంకోర్టు నియమిత ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), ఆస్తుల వె ల్లడి తదితరాలకు సంబంధించి ఐటీ చట్టంలోని 139 సెక్షన్లో సవరణ వంటివి ఇందులో ఉన్నాయని వివరించారు.