కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పలు సబ్సిడీలకు కేటాయింపుల్లో కోతలు పెట్టింది. రైతులకు అందించే ఎరువులు, ఆహార, పెట్రోలియం ఉత్పత్తులకు సబంధించిన కేటాయింపులను ఈ బడ్జెట్‌లో గణనీయంగా తగ్గించింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీకి రూ.1.64 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.1.89 లక్షల కోట్లతో పోల్చితే 13.2 శాతం తగ్గించారు. అలాగే 2023-24 బడ్జెట్‌లో 1.75 లక్షల కోట్లు కేటాయించారు.
కేంద్రం యూరియాపై సబ్సిడీ, ఇతర ఎరువులపై పోషకాల ఆధారిత సబ్సిడీ ఇస్తుంది. అంతర్జాతీయ ధరలు తగ్గుముఖం పట్టడం, బయో, సేంద్రియ ఎరువుల కోసం ఒత్తిడి పెరగడం , నానో-యూరియా వినియోగం పెరిగిన నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎరువు సబ్సిడీకి కేటాయింపు తగ్గుదల కనిపించింది.
దేశం మొత్తం ఎరువుల వినియోగంలో యూరియా 55-60 శాతం ఉంటోంది. రైతులకు సబ్సిడీ యూరియా 45 కిలోల బ్యాగ్ రూ.242లకు లభిస్తోంది. దీనికి పన్నులు, వేప పూత ఛార్జీలు అదనం. అయితే ఇదే బ్యాగ్ అసలు ధర సుమారు రూ.2,200 ఉంది.
ఇక ఆహార, పెట్రోలియ ఉత్పత్తులపై ఇస్తున్న సబ్సిడీకి సంబంధించిన కేటాయింపులను 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం తగ్గించింది. ఆహార ఉత్పత్తుల సబ్సిడీ కోసం ఈ బడ్జెట్‌లో రూ.2,05,250 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కేటాయించిన రూ.2,12,332 కోట్లతో పోల్చితే 3.33 శాతం తక్కువ. అలాగే పెట్రోలియం ఉత్పత్తులపై ఇచ్చే సబ్సిడీ కోసం గతేడాది కేటాయించిన రూ. 12,240 కోట్ల కంటే 2.6 శాతం తక్కువగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.11,925 కోట్లు కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment