FIH Hockey World League
-
రన్నరప్‌గా నిలిచిన భారత్
మస్కట్: మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరపు రజని కెపె్టన్సీలోని భారత జట్టు 2–7 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. భారత్ తరఫున జ్యోతి ఛత్రి (20వ ని.లో), రుతుజా (23వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించింది. -
భారత్ ‘షూటౌట్’ విజయం
లండన్: ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4–2 (షూటౌట్)లో ఇంగ్లండ్‌ను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 4–4 గోల్స్‌తో సమంగా నిలవగా...ఆ తర్వాత భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (6వ నిమిషం), మన్దీప్ సింగ్ (18వ, సుఖ్జీత్ సింగ్ (27వ), అభిషేక్ (49వ) ఒక్కో గోల్ సాధించగా, ఇంగ్లండ్ తరఫున వార్డ్ స్యామ్ ఒక్కడే 4 గోల్స్ (7వ, 39వ, 46వ, 52వ నిమిషాల్లో) చేయడం విశేషం. అనంతరం షూటౌట్లో భారత్‌నుంచి మన్‌ప్రీత్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, అభిషేక్ సఫలం కాగా, ఇంగ్లండ్‌నుంచి కాల్నాన్ విల్, వాలన్ జాచరీ మాత్రమే గోల్ చేయగలిగారు. సొంతగడ్డపై ఆరంభంలో ఇంగ్లండ్ వరుసగా దాడులు చేయగా, భారత గోల్ కీపర్ కృష్ణన్ పాఠక్ వాటిని సమర్థంగా అడ్డుకోగా, భారత్‌కు లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలచగలిగాడు. 25 సెకన్ల లోపే వార్డ్ గోల్‌తో ఇంగ్లండ్ స్కోరు సమం చేయగా...మన్దీప్, సుఖ్‌జీత్‌లో ఫీల్డ్ గోల్స్‌తో తొలి అర్ధ భాగం ముగిసే సరికి భారత్ ఆధిక్యంలో నిలిచింది. మూడో క్వార్టర్లో, ఆపై నాలుగో క్వార్టర్ ఆరంభంలో కూడా ఒక్కో గోల్ సాధించి వార్డ్ ‘హ్యాట్రిక్’ పూర్తి చేయడంతో స్కోరు 3–3తో సమమైంది. ఐదు నిమిషాల తర్వాత మరో గోల్‌తో భారత్ ముందంజలో నిలిచినా, వార్డ్ తన నాలుగో గోల్‌తో మళ్లీ ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. అయితే షూటౌట్లో చివరకు భారత్‌దే పైచేయి అయింది. -
చివరి నిమిషంలో భారత్ ఓటమి
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో భాగంగా ఒలింపిక్ చాంపియన్ బెల్జియంతో లండన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. చివరి నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను నెల్సన్ ఒనానా గోల్‌గా మలిచి బెల్జియం జట్టును గెలిపించాడు. అంతకుముందు థిబె స్టాక్‌బ్రోక్స్ (18వ ని.లో) గోల్‌తో బెల్జియం 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 25వ నిమిషంలో మన్దీప్ సింగ్ గోల్‌తో భారత్ 1–1తో స్కోరును సమం చేసింది. ఇక మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం ఖాయమనుకున్న దశలో భారత జట్టు గోల్ సమరి్పంచుకొని మూల్యం చెల్లించుకుంది. నేడు జరిగే రెండో మ్యాచ్‌లో బ్రిటన్‌తో భారత్ తలపడుతుంది. -
FIH Pro League: జర్మనీపై భారత్ విజయం
ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ హాకీ టోర్నీలో భారత్ ఖాతాలో కీలక గెలుపు చేరింది. రూర్కెలాలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–2 గోల్స్ తేడాతో ప్రపంచ చాంపియన్ జర్మనీపై సంచలన విజయం సాధించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (30వ నిమిషం) పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించగా... సుఖ్జీత్ సింగ్ రెండు ఫీల్డ్ గోల్స్ (31వ ని., 42వ ని.) నమోదు చేశాడు. జర్మనీ నుంచి రెండూ ఫీల్డ్ గోల్స్ వచ్చాయి. 44వ నిమిషంలో కాఫ్మన్ పాల్ ఫిలిప్, 57వ నిమిషంలో స్ట్రత్ఆఫ్ మైకేల్ గోల్స్ కొట్టారు. మూడో క్వార్టర్ ముగిసే సరికి భారత్ 3–1తో ఆధిక్యంలో నిలిచినా...చివరి క్వార్టర్లో జర్మనీ గోల్ చేసి ఆధిక్యాన్ని తగ్గించగలిగింది. తమకు లభించిన ఏకైక పెనాల్టీని భారత్ సద్వినియోగం చేసుకోగలిగింది. భారత్ తమ తర్వాతి పోరులో ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడుతుంది. -
FIH Nations Cup final: ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు
వాలెన్సియా: ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల ‘నేషన్స్ కప్’ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. కెప్టెన్ సవిత పూనియా గోల్‌పోస్ట్ ముందు అడ్డుగోడలా నిలువడంతో భారత్ షూటౌట్లో 2–1తో ఐర్లాండ్‌పై గెలుపొందింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. తొలిక్వార్టర్లో ఐర్లాండ్ స్ట్రయికర్ నవొమి క్యారొల్ (13వ ని.) గోల్ చేయడంతో ఐర్లాండ్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్లోనూ ఈ ఆధిక్యాన్ని కొనసాగించింది. అయితే మూడో క్వార్టర్ ముగిసే దశలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఉదిత (45వ ని.) గోల్‌గా మలచి స్కోరును సమం చేసింది. షూటౌట్లో భారత బృందంలో లాల్రేమ్సియామి, సోనిక గోల్స్ సాధించగా, ఐర్లాండ్ జట్టులో హన్నా మెక్‌లాలిన్ గోల్ చేసింది. ఎలెన్ కరన్ షాట్‌ను సవిత సమర్థంగా ఆడ్డుకుంది. అప్పటికి భారత్ 5 ప్రయత్నాలు ముగియగా... ఐర్లాండ్‌కు ఆఖరి షాట్ మిగిలుంది. కత్రిన్ ములన్ షాట్‌ను వైడ్‌గా కొట్టడంతో భారత్ 2–1తో విజయం సాధించింది. ఫైనల్ చేరిన భారత్... స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
FIH Player of the Year: హర్మన్‌ప్రీత్‌కు ‘ఎఫ్ఐహెచ్’ అవార్డు
న్యూఢిల్లీ: భారత స్టార్ డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ వరుసగా రెండో ఏడాది కూడా అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అతను నిలకడైన ఆటతీరుతో ఇంటాబయటా జట్టు విజయాల్లో కీలకభూమిక పోషిస్తున్నాడు. ఈ భారత వైస్‌కెప్టెన్ 2021–22 ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్‌లో విశేషంగా రాణించాడు. 16 మ్యాచ్‌లాడిన హర్మన్‌ప్రీత్ 18 గోల్స్ చేశాడు. దీంతో ఒక సీజన్లో అత్యధిక గోల్స్ చేసిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతేడాది ఢాకాలో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అతని (6 మ్యాచ్‌ల్లో 8 గోల్స్) ప్రదర్శన వల్లే భారత జట్టు కాంస్యం గెలిచింది. ప్రతీ మ్యాచ్ లోనూ గోల్ చేయడం విశేషం. ఈ ఏడాది బర్మింగ్‌హామ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘కామన్వెల్త్ గేమ్స్’లో భారత్ రన్నరప్‌గా నిలువడంలోనూ అతని పాత్ర ఉంది. ‘హర్మన్‌ప్రీత్ ఆధునిక హాకీ క్రీడలో సూపర్‌స్టార్. అతని డిఫెన్స్ అద్భుతం. ప్రత్యర్థుల రక్షణపంక్తిని బోల్తా కొట్టించడంలో అతను ఘనాపాటి. తన స్టిక్కు అందిన బంతిని చకచకా ఆడిస్తూ తీసుకెళ్లే సామర్థ్యం అతని సొంతం. అదే వేగంతో గోల్‌పోస్ట్‌లోకి పంపడంలోనూ హర్మన్ దిట్ట. అందుకే వరుసగా ఈ ఏడాది కూడా అతన్నే అవార్డు వరించింది’ అని ఎఫ్ఐహెచ్ ఒక ప్రకటనలో కొనియాడింది. పురుషుల హాకీలో వరుసగా ఇలా అవా ర్డులు పొందిన నాలుగో ఆటగాడిగా హర్మన్ ఘనత వహించాడు. గతంలో డి నూయిజెర్ (నెదర్లాండ్స్), జేమీ డ్వెయర్ (ఆస్ట్రేలియా), ఆర్థర్ వాన్ డొరెన్ (బెల్జియం)లు రెండేళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచారు. తాజా అవార్డు బరిలో ప్యానెల్... హర్మన్ ప్రీత్ సింగ్‌కు 29.4 పాయింట్లు ఇవ్వగా, రేసులో ఉన్న బ్రింక్ మన్ (నెదర్లాండ్స్; 23.6), టామ్ బూన్ (బెల్జియం; 23.4) వెనుకబడ్డారు. -
Womens FIH Pro League: అమెరికాపై భారత్ పైచేయి
రోటర్‌డామ్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) మహిళల ప్రొ లీగ్‌లో భారత జట్టు ఖాతాలో ఐదో విజయం చేరింది. అమెరికా జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4–2 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున దీప్ గ్రేస్ ఎక్కా (31వ ని.లో), నవనీత్ కౌర్ (32వ ని.లో), సోనిక (40వ ని.లో), వందన కటారియా (50వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. అమెరికా జట్టు డానియెలా గ్రెగా (28వ ని.లో) గోల్‌తో ఖాతా తెరువగా... నటాలీ కొనెర్త్ (45వ ని.లో) రెండో గోల్ అందించింది. ఈ విజయంతో భారత జట్టు ప్రొ హాకీ లీగ్‌లో 13 మ్యాచ్‌లు పూర్తి చేసుకొని 27 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నేడు అమెరికా జట్టుతోనే భారత్ రెండో అంచె లీగ్ మ్యాచ్‌లో తలపడుతుంది. ఈ మ్యాచ్‌తో ప్రొ హాకీ లీగ్‌ను భారత్ ముగిస్తుంది. -
జర్మనీ జట్టులో కోవిడ్ కలకలం.. భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌లు వాయిదా
భువనేశ్వర్: పురుషుల ప్రో హాకీ లీగ్ 2022లో భాగంగా భారత్, జర్మనీ జట్ల మధ్య ఈ వారాంతం జరగాల్సిన డబుల్ హెడర్ మ్యాచ్‌లు కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. విజిటర్స్ క్యాంప్‌లో కరోనా కేసులు నమోదు కావడంతో మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) గవర్నింగ్ బాడీ మంగళవారం వెల్లడించింది. భువనేశ్వర్ వేదికగా ఈ మ్యాచ్‌లు మార్చి 12, 13 తేదీల్లో జరగాల్సి ఉండింది. వాయిదాపడ్డ మ్యాచ్‌లను నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎఫ్ఐహెచ్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ప్రో హాకీ లీగ్ 2022లో భారత పురుషుల జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియానే విజయం సాధించింది. మరోవైపు ఇదే టోర్నీలో భారత మహిళల జట్టు ఈ వారాంతంలోనే జర్మనీతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందు కోసం ఇరు జట్లు ఇదివరకే భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంకు చేరుకున్నాయి. చదవండి: PAK Vs AUS: రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన పాక్ ఓపెనర్ -
న్యూజిలాండ్‌తో హాకీ టెస్టు సిరీస్
ఆరు మ్యాచ్‌లు ఆడనున్న భారత్ న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న రియో ఒలింపిక్స్ సన్నాహకాల్లో భాగంగా భారత హాకీ జట్టు... న్యూజి లాండ్‌తో ఆరు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. అక్టోబర్ 2 నుంచి 11 వరకు ఆక్లాండ్, నెల్సన్, క్రైస్ట్‌చర్చ్‌లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌లు కివీస్ ‘ఎ’ జట్టుతో మిగతా నాలుగు సీనియర్ టీమ్‌తో జరుగుతాయని హాకీ ఇండియా (హెచ్ఐ) వెల్లడించింది. ఈ ఏడాది చివర్లో రాయ్‌పూర్‌లో జరగనున్న ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్‌కు సిద్ధమయ్యేందు కూడా ఈ టోర్నీని ఉపయోగించుకోనున్నారు. 2009 తర్వాత భారత పురుషుల జట్టు కివీస్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.