
న్యూఢిల్లీ: భారత స్టార్ డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ వరుసగా రెండో ఏడాది కూడా అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. అతను నిలకడైన ఆటతీరుతో ఇంటాబయటా జట్టు విజయాల్లో కీలకభూమిక పోషిస్తున్నాడు. ఈ భారత వైస్‌కెప్టెన్ 2021–22 ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రో లీగ్‌లో విశేషంగా రాణించాడు. 16 మ్యాచ్‌లాడిన హర్మన్‌ప్రీత్ 18 గోల్స్ చేశాడు. దీంతో ఒక సీజన్‌లో అత్యధిక గోల్స్ చేసిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
గతేడాది ఢాకాలో జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో అతని (6 మ్యాచ్‌ల్లో 8 గోల్స్) ప్రదర్శన వల్లే భారత జట్టు కాంస్యం గెలిచింది. ప్రతీ మ్యాచ్ లోనూ గోల్ చేయడం విశేషం. ఈ ఏడాది బర్మింగ్‌హామ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘కామన్వెల్త్ గేమ్స్’లో భారత్ రన్నరప్‌గా నిలువడంలోనూ అతని పాత్ర ఉంది. ‘హర్మన్‌ప్రీత్ ఆధునిక హాకీ క్రీడలో సూపర్‌స్టార్. అతని డిఫెన్స్ అద్భుతం. ప్రత్యర్థుల రక్షణపంక్తిని బోల్తా కొట్టించడంలో అతను ఘనాపాటి. తన స్టిక్‌కు అందిన బంతిని చకచకా ఆడిస్తూ తీసుకెళ్లే సామర్థ్యం అతని సొంతం.
అదే వేగంతో గోల్‌పోస్ట్‌లోకి పంపడంలోనూ హర్మన్ దిట్ట. అందుకే వరుసగా ఈ ఏడాది కూడా అతన్నే అవార్డు వరించింది’ అని ఎఫ్‌ఐహెచ్ ఒక ప్రకటనలో కొనియాడింది. పురుషుల హాకీలో వరుసగా ఇలా అవా ర్డులు పొందిన నాలుగో ఆటగాడిగా హర్మన్ ఘనత వహించాడు. గతంలో డి నూయిజెర్ (నెదర్లాండ్స్), జేమీ డ్వెయర్ (ఆస్ట్రేలియా), ఆర్థర్ వాన్ డొరెన్ (బెల్జియం)లు రెండేళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచారు. తాజా అవార్డు బరిలో ప్యానెల్... హర్మన్ ప్రీత్ సింగ్‌కు 29.4 పాయింట్లు ఇవ్వగా, రేసులో ఉన్న బ్రింక్ మన్ (నెదర్లాండ్స్; 23.6), టామ్ బూన్ (బెల్జియం; 23.4) వెనుకబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment