FITE
-
ఇన్ఫోసిస్ పై మండిపడుతున్న ఉద్యోగులు
బెంగళూరు : దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ అవలంభిస్తున్న విధానాలపై ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ లకు భారీగా పరిహారాలు పెంచుతూ ఉద్యోగులపై వేటు వేస్తుందని ఐటీ ఉద్యోగ గ్రూప్ లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఉద్యోగాల కోతతో తీవ్ర సతమతమవుతున్న ఉద్యోగులకు ఈ పరిహారాల పెంపు మరింత ఆందోళనకరంగా మారిందని పేర్కొంటున్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ తన వెబ్ సైట్ లో పొందుపరిచిన 2017 వార్షిక రిపోర్టులో గత ఆర్థిక సంవత్సరం నలుగురు టాప్ ఎగ్జిక్యూటివ్ లకు 50 శాతానికి పైగా పరిహారాలు పెంచినట్టు తెలిసింది. ప్రతేడాది ఐటీ కంపెనీలు నిపుణులపై వేటు వేస్తూ.. అదేసమయంలో టాప్ ఎగ్జిక్యూటివ్ లకు వేరియబుల్ పే, స్టాక్ ప్రత్సహకాలు పేరుతో భారీగా వేతనాలను పెంచుతున్నాయని ఎఫ్ఐటీఈ జనరల్ మేనేజర్ ఏజే వినోద్ మండిపడ్డారు. వారు అచ్చం రాజకీయ నాయకుల ప్రవర్తిస్తున్నారని, ప్రజల సమస్యలన్నీ పక్కన పెట్టి, వారు వేతనాలను మాత్రం పెంచుకుంటున్నారని ఆరోపించారు. ఇది చాలా బాధకరమని ఆవేదన వ్యక్తంచేశారు. చెన్నై, పుణే, బెంగళూరులతో పాటు తొమ్మిది ఐటీ హబ్స్ లో ఐటీ ఉద్యోగుల కోసం ఎఫ్ఐటీఈ ఫోరమ్ గా ఏర్పడింది. ఇన్ఫోసిస్ వార్షిక రిపోర్టు ప్రకారం అధ్యక్షులు రాజేష్ మూర్తి, సందీప్ డాడ్లాని, మోహిత్ జోషి, డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవి కుమార్ లు మొత్తం పరిహారాల కింద 14 కోట్లకు పైగా అందుకున్నారు. పనితీరు ఆధారంగా స్టాక్ ప్రోత్సహాకాల కింద ఈ పెంపును చేపట్టినట్టు కంపెనీ పేర్కొంది. టాప్ ఎగ్జిక్యూటివ్ లకు 10 లేదా 20 శాతం పరిహారాలు పెంచితే, కంపెనీ అకౌంట్ లో నుంచి భారీ ఎత్తున్న నగదు తరలివెళ్తుందని, ఈ ప్రభావంతో వెంటనే ప్రొఫిషనల్స్ పై కంపెనీ వేటువేస్తుందని ఎఫ్ఐటీఈ చెప్పింది. -
ఈ దెబ్బకు యూనియన్ గా ఐటీ ఉద్యోగులు
బెంగళూరు : దేశంలో అతిపెద్ద ఇండస్ట్రి ఐటీ ఉద్యోగులకు ఇప్పటివరకు యూనియన్లు లేవు. కానీ ఇటీవల భారీ ఎత్తున్న కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుండటంతో ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం కచ్చితంగా యూనియన్లను ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయించారు. ఐటీ వర్కర్ల ఫోరమ్ దేశంలో టెకీల కోసం తొలి యూనియన్ గా రిజిస్ట్రర్ అయ్యేందుకు సిద్ధమైంది. భారతదేశంలో ఐటీ ఉద్యోగుల తొలి యూనియన్ గా అధికారికంగా ఫోరమ్ ఫర్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్(ఎఫ్ఐటీఈ)ని నమోదుచేసుకుంటుందని ఫోరమ్ వైస్ ప్రెసిడెంట్ వసుమతి చెప్పారు. వచ్చే ఐదు నెలల్లోనే తొలి యూనియన్ ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. మేజర్ ఐటీ కంపెనీలు ఏకపక్షంగా ఉద్యోగులను భారీ ఎత్తున్న తీసేస్తుండటంతో ఈ యూనియన్ ను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిసింది. ఎఫ్ఐటీఈలో 1000 పైగా ఆన్ లైన్ మెంబర్లు, 100కి పైగా క్రియాశీలక సభ్యులున్నారు. తొమ్మిది నగరాలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే, ముంబై, కొచ్చి, ఢిల్లీలో ఇది చాప్టర్స్ ను ప్రారంబించింది. గతంలో కూడా ఈ ఫోరమ్ ఐటీ ఉద్యోగులను అన్యాయపూర్వకంగా తొలగిస్తున్న సందర్భంగా పోరాటాలు చేసింది. వచ్చే మూడేళ్లలో 1.75 లక్షల నుంచి 2 లక్షల మేర ఉద్యోగాల కోత ఉంటుందని ఇప్పటికే పలు సర్వేలో అంచనాలు విడుదల చేస్తున్నాయి. కంపెనీలు కూడా ఏకపక్షంగా, లాభాపేక్షతో ఉద్యోగులను బయటికి పంపేస్తున్నాయని వసుమతి ఆరోపించారు. ఉద్యోగాల కోత తాత్కాలికంగా లాభాల మార్జిన్లను పెంచినా.. పరిశ్రమకు దీర్ఘకాలంగా మాత్రం భారీ దెబ్బనే తగలనుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం కంపెనీలు లాభాలార్జించడానికి ఉద్యోగులపై వేటు వేసే హక్కు లేదని ఎఫ్ఐటీఈ సభ్యుడు జయప్రకాశ్ తెలిపారు. నష్టాలు వచ్చేటప్పుడే కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తుంటాయని పేర్కొన్నారు.