Flyers
-
వెండి విమానం! సూర్యుడే ఇంధనం!!
ఇది విమానంలా కనిపిస్తున్నా.. విమానం కాదు. సిల్వర్-ఫాయిల్ తయారు చేసిన, హీలియం నింపిన ఓ పేద్ద బుడగ లాంటిది. గాల్లోకి ఎగిరి మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందిస్తుంది. పగలంతా సౌరశక్తిని వాడుకుని రాత్రిళ్లు కూడా పనిచేస్తుంది.రిమోట్ ప్రాంతాలలోని వ్యక్తులకు ఎత్తులో ఎగిరే బ్లింప్ లాంటి విమానం నుంచి ఎందుకు అందించకూడదు? అన్న ఆలోచనతోనే న్యూ మెక్సికోకు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్కీయే (Sceye) సౌర శక్తిని ఉపయోగించుకుని స్ట్రాటోఆవరణలో సంచరించే హ్యాప్స్ (HAPS- హై-ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫారమ్ స్టేషన్)ను రూపొందించింది.స్కీయే హ్యాప్స్ 65 మీటర్ల (213-అడుగులు) పొడవైన సిబ్బంది లేని హీలియం నిండిన విమానం. దీన్ని నిలువుగా నింగిలోకి ప్రయోగిస్తారు. 60,000 నుంచి 65,000 అడుగుల (18,288 నుండి 19,812 మీ) ఎత్తుకు ఇది వెళ్తుంది. సిల్వర్-ఫాయిల్ తయారైన దీని ఉపరితలంపై ఉండే గాలియం సెలీనైడ్, గాలియం ఆర్సెనైడ్ సౌర ఘటాల శక్తి ద్వారా జీపీఎస్ సాయంతో నిర్దేశిత ఎత్తులో దీన్ని సంచరించేలా చేస్తారు. ఇది మారుమూల ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ని ప్రసారం చేయడం, వాతావరణం, పర్యావరణాన్ని పర్యవేక్షించడం, అడవుల్లో మంటలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడం వంటి పనులను చేయగలదు.ఈ విమానానికి సంబంధించిన సరికొత్త మైలురాయి గత వారమే వచ్చింది. దాని సౌర ఘటాల ద్వారా పగటిపూట దాని బ్యాటరీలను ఛార్జ్ చేసుకుని, ఆ బ్యాటరీ శక్తిని ఉపయోగించి రాత్రిపూట కూడా ఆ స్థానంలో నిలిచి ఉంటుంది. ఆగస్టు 15వ తేదీ ఉదయం 7:36 గంటలకు న్యూ మెక్సికోలోని స్కీయే స్థావరం నుంచి దీన్ని ప్రయోగించగా 61,000 అడుగుల (18,593 మీ) ఎత్తుకు చేరుకుని మరుసటి రోజు మధ్యాహ్నం 12:21 గంటల వరకూ నిర్దేశిత ఎత్తులోనే సేవలందించింది. -
ఎయిర్‌లైన్స్‌కు కలిసొచ్చిన వరల్డ్‌కప్ ఫైనల్ - కనీవినీ ఎరుగని సరికొత్త రికార్డ్..
పండుగ సీజన్లో వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరుగుతాయని అందరూ నమ్ముతారు. అయితే ఆ పండుగ సీజన్ కంటే వరల్డ్‌కప్ బాగా కలిసొచ్చిందని ఎయిర్‌లైన్స్ తాజాగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ రోజు దేశంలో సుమారు 4.6 లక్షలమంది విమాన ప్రయాణం చేశారని, దీపావళికి కూడా చేయలేని పనిని క్రికెట్ వరల్డ్ కప్ చేసిందని ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. గత దీపావళి కంటే కూడా ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువని తెలిపారు. దీపావళి సమయంలో విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది, కానీ అంత కంటే ఎక్కువ వరల్డ్‌కప్ ఫైనల్ రోజు ప్రయాణించారు. భారత్ ప్రపంచకప్ ఫైనల్ చేరడంతో అహ్మదాబాద్ చేరుకోవాలనే ఉత్సాహం అభిమానుల్లో కనిపించి సరికొత్త రికార్డు సృష్టించింది. పెరిగిన చార్జీలను కూడా లెక్క చేయకుండా ఒక్కసారిగా ప్రయాణికులు రావడంతో విమానయాన సంస్థల ఆదాయం భారీగా పెరిగింది. ప్రపంచకప్ ఫైనల్ రోజు కొందరు రూ. 20,000 నుంచి రూ. 40,000 వెచ్చించి కూడా టికెట్స్ కొనుగోలు చేశారు. ఫ్లైట్ చార్జీలు ఎక్కువని కొందరు ట్రైన్ ఏసీ క్లాసులు బుక్ చేసుకుని ప్రయాణించారు. అటు విమానయాన సంస్థలు, ఇటు రైల్వే సంస్థలు బాగా సంపాదించుకోగలిగాను. ఒకే రోజులో 4 లక్షల మంది విమాన ప్రయాణం చేయడం ఓ అరుదైన రికార్డ్. ఇది మాకు చారిత్రాత్మకమైన అవకాశం అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: టీమిండియా ఓటమి - పారిశ్రామిక వేత్తల ట్వీట్స్ వైరల్ అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే పండుగ సీజన్ సద్వినియోగం చేసుకోవడానికి విమానయాన సంస్థలు గత సెప్టెంబర్ చివరి వారంలో అడ్వాన్స్ బుకింగ్ చార్జీలను పెంచడం ప్రారంభించాయి. కొందరు పెరిగిన చార్జీలను దృష్టిలో ఉంచుకుని ట్రైన్ జర్నీ చేయడానికి సిద్ధమయ్యారు. మొత్తం మీద ఇండియా వరల్డ్‌కప్ కోల్పోయినప్పటికీ.. విమానయాన సంస్థలు మాత్రం లాభాలను గడించాయి. -
విమానంలో ప్యాసింజర్ వీరంగం.. కొట్టి, ఉమ్మి వేసి..
విమానంలో ప్రయాణికుల వికృత ప్రవర్తనలకు సంబంధించన పలు ఘటల గురించి విన్నాం. ఇటీవలే సహ ప్రయాణకురాలిపై మూత్ర విసర్జన ఘటన మరువుకే మునుపే అదే తరహ ఘటనలు వరసగా వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడొక ప్రయాణికురాలు అంతకు మించి అన్నట్టుగా.. చాలా ఘోరంగా ప్రవర్తించింది. ఆమె చేసిన హంగామా...ఆ విమానంలోని సిబ్బందిని హడలెత్తించేలా వికృతంగా ప్రవర్తించింది. తనది కాని సీటులో కూర్చొన్నదే గాక సిబ్బందిని దుర్భాషలాడుతూ..వారిపైనే దాడికి దిగింది. ఈ ఘటన ముంబై ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...విస్తారా అబుదాబి అనే ముంబై విమానంలో 45 ఏళ్ల ఇటాలియన్ ప్రయాణికురాలు నానా బీభత్సం సృష్టిచింది. ఆమె ఎకనామీ టిక్కెట్టు కొనుక్కుని బిజినెస్ సీటులో కూర్చొంటానని పట్టుబట్టింది. ఆ సీటు తనది కాదని విమాన సిబ్బంది చెప్పేందుకు యత్నించగా.. వారిని దుర్భాషలాడుతూ దాడికి దిగింది. ఆ సిబ్బందిలో ఒకర్నీ కొట్టి, మరొకరిపై ఉమ్మి వేసి భయానకంగా ప్రవర్తించింది. అక్కడితో ఆగక అర్థనగ్నంగా నడిచి ప్రయాణికులను, సిబ్బందిని భయబ్రాంతులకు లోను చేసింది. దీంతో కెప్టెన్ ఆమె అనుచిత ప్రవర్తన దృష్ట్యా హెచ్చరిక కార్డ్‌ను జారీ చేసి ప్రయాణికురాలిని నిరోధించాలని నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగానే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి..సదరు ప్రయాణకురాలిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రౌండ్ సెక్యూరిటీ ఏజెన్సీలను అలర్ట్ చేశాడు. ఈ మేరకు భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: 13 గంటలు గగన ప్రయాణం.. చివరికి ఊహించని ల్యాండింగ్.. ప్రయాణికుల షాక్) -
తొలి గగన విహారి ‘శ్రీమతి ఎన్సీ సేన్’
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో తొలి విమానం గాల్లోకి ఎప్పుడు ఎగిరింది? దాన్ని ఎవరు నడిపారు? అన్న ప్రశ్నలకు టక్కున సమాధానం చెప్పడానికి ఎన్నో రికార్డులు అందుబాటులో ఉన్నాయి. అయితే అవన్నీ కూడా భారత్‌లో తొలి విమానాలు ‘ఎగ్జిబిషన్’లో భాగంగా 1910లో ఎగిరాయి అని చెబుతున్నాయి తప్పించి. వాటిలో ఫలానా విమానం ముందు ఎగిరింది, ఫలానాది తర్వాత ఎగిరింది అని కచ్చితంగా చెప్పడం లేదు. బ్రిటీష్ వైమానికుడు వాల్టర్ విండమ్ 1910, డిసెంబర్ పదవ తేదీన అలహాబాద్‌లో ఎగ్జిబిషన్ నిర్వహించారని, అందులో భాగంగా కొంత మంది ప్రయాణికులను తన విమానంలో ఎక్కించుకొని ఆయన గగన విహారం చేశారని కొన్ని రికార్డులు తెలియజేస్తున్నాయి. కాదు, కాదు, అంతకుముందే, అంటే 1910 మార్చి నెలలోనే ఇటలీ హోటల్ యజమాని, వైమానికుడు గియాకోమో డీ ఏంజెలిస్ 1910, మార్చి నెలలో మద్రాస్‌లో తన విమానాన్ని ప్రదర్శించారని, అందులో ప్రయాణికులను ఎక్కించుకొని గగన విహారం చేశారని మరికొన్ని రికార్డులు చెబుతున్నాయి. కచ్చితంగా ఇది ముందు, అది వెనక అని రుజువు చేయడానికి భారత వైమానికి సంస్థ వద్ద కూడా ఎలాంటి చారిత్రక రికార్డులు లేవు. కానీ సరిగ్గా ఈ రోజుకు 108 ఏళ్ల క్రితం, అంటే 1910, డిసెంబర్ 19వ తేదీన తొలి మహిళా ప్రయాణికురాలు కోల్‌కతా నుంచి గగన విహారం చేసినట్లు రుజువులు దొరికాయి. కోల్‌కతాలోని టోలిగంజ్ క్లబ్లో నిర్వహించిన వైమానిక ఎగ్జిబిషన్లో భాగంగా శ్రీమతి ఎన్సీ సేన్ తొలి వైమానిక ప్రయాణికురాలిగా 1910, డిసెంబర్ 19వ తేదీన గగన విహారం చేసినట్లు ముంబైకి చెందిన ఔత్సాహిక వైమానిక అధ్యయన వేత్త దేబాశిష్ చక్రవర్తి కనుగొన్నారు. ఆయన ఏడాది కాలంగా అధ్యయనం చేస్తుండగా ఈ విషయం తేలింది. అది సరే, శ్రీమతి ఎన్సీ సేన్ ఎవరు? ఆమె ఫొటోను ప్రచురించిన నాటి ఏవియేషన్ మాగజైన్లో కూడా ఆమె పేరును ఎన్‌షీ సేన్‌గా పేర్కొన్నారు తప్ప, ఆమె గురించి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ఆ నాటికి చెందిన రక రకాల మేగజైన్లను మన చక్రవర్తి తిరిగేయగా, ఆమె బెంగాల్‌కు చెందిన ప్రముఖ తత్వవేత్త, సంఘ సంస్కర్త కేశబ్ చంద్రసేన్ కోడలని తేలింది. కేశబ్ చంద్రసేన్‌కు ఐదుగురు కొడుకులు ఉన్నారు? వారిలో ఏ కోడలు అన్న సమస్య వచ్చింది. వారిలో ముగ్గురు కొడుకులు విదేశీయులను పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఆ కోడళ్లకు బెంగాల్ సంప్రదాయం ప్రకారం మామ ఇంటి పేరు రాలేదు. కానీ ఇద్దరికి వచ్చింది. దేబాశిష్ చక్రవర్తి వారిలో నిర్మలా సేన్ ఒక కోడలుకాగా, మృణాలిని దేవీ సేన్ మరొకరు. మృణాలిని దేవీ సేన్‌ను కూడా నీ లుద్దీ అని పిలుస్తారు. కనుక వీరిలో ఎవరైనా ఒకరు కావచ్చని, నిర్మలా సేన్‌నే కావచ్చని అధ్యయనవేత్త చక్రవర్తి భావిస్తున్నారు. 1910, డిసెంబర్ 28వ తేదీన టోలిగంజ్ క్లబ్లో ఏవియేషన్ మీటింగ్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రం ‘ఈబే’లో వేలం వేసిన విషయం చక్రవర్తికి అధ్యయనంలో తేలడంతో ఆరోజే గగన విహారం జరిగినట్లు ముందుగా ఆయన పొరపొటు పడ్డారు. అదే వేలం పాటలో ఆ నాటి ప్రయాణికులకు టిక్కెట్లు విక్రయించి, వారి పేర్లను నోటు చేసుకొన్న నాటి ఎయిర్ హోస్టెస్ మాబెల్ బేట్స్ రాసుకున్న కాగితాన్ని కూడా విక్రయించారు. దాని ప్రతిని సాధించడంతో డిసెంబర్ 19వ తేదీన తొలి మహిళా ప్రయాణికురాలు గగన విహారం చేసినట్లు రూఢీ అయింది. ఈ విషయాన్ని ఫ్రెంచ్ వార్తా పత్రికలు ‘ఫిగారో’ డిసెంబర్ 22, 1920 నాటి సంచిక, ‘లీ టెంప్స్’ డిసెంబర్ 23, 1910, ‘గిల్ బ్లాస్’ డిసెంబర్ 26, 1910 నాటి సంచికలు రుజువు చేస్తున్నాయి. నాడు టోలిగంజ్ క్లబ్లో బెల్జియంకు చెందిన వైమానికులు బారన్ పిర్రే డీ కేటర్స్, జూలెస్ టైక్లు ఇద్దరూ తమ బైప్లేన్స్ (అంటే రెక్క మీద రెక్క నాలుగు రెక్కలు ఉంటాయి) నడిపారు. వారిలో ఎవరి విమానాన్ని శ్రీమతి ఎన్సీ సేన్ ఎక్కారో ఈ నాటికి ప్రశ్నే. -
ఇక ఆకాశంలోనూ ఎంచక్కా మాట్లాడవచ్చు..
ముంబై : ‘మేడమ్ దయచేసి మీ ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేయండి’ విమానం టేకాఫ్ అవ్వడానికి ముందు వినిపించే సర్వసాధారణ మాట ఇది. ఇక మీదట ఈ మాట వినిపించబోదు అంటున్నాయి విమానయాన సంస్థలు. అవును ఇక మీదట విమానంలోను ఎంచక్కా ఫోన్ మాట్లాడవచ్చు, ఇంటర్నెట్ వాడుకోవచ్చు. మరో మూడు, నాలుగు నెలల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని.. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను టెలికాం కమిషన్ ఆమోదించినట్లు సమాచారం. టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తీసుకువచ్చిన నూతన నిబంధనల ప్రకారం విమానం 3 వేల మీటర్ల ఎత్తు చేరుకున్న తర్వాత ప్రయాణికులు తమ ఫోన్లను వినియోగించుకోవచ్చని తెలిపింది. అంటే విమానం టేకాఫ్ అయిన తర్వాత 3 వేల మీటర్ల ఎత్తు చేరడానికి సుమారు 4నిమిషాల సమయం పడుతుంది. అంటే మొదటి నాలుగు నిమిషాలు మినహాయించిన తర్వాత ప్రయాణికులు తమ ఫోన్లను వాడుకోవచ్చు. ట్రాయ్ సూచించిన ‘ఇన్ ఫ్లయిట్ కనెక్టివిటి’ వల్ల ఇక మీదట విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు ఫోన్ వినియోగించుకునే సదుపాయం కల్పించనున్నాయి. కానీ విమానంలో ఇలా మొబైల్, ఇంటర్నెట్ సేవలు వినియోగించుకోవడానికి ప్రయాణికులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు అంతర్జాతీయ విమానయాన సంస్థల ప్రమాణాలను అనుసరించి విధించనున్నారు. ఇప్పటివరకైతే విమానంలో ఇంటర్నెట్ను వాడుకోవాలనుకుంటే 30నిమిషాలకుగాను రూ. 500, గంటకుగాను రూ. 1000 చెల్లించాల్సి వచ్చేది. ఇప్పటికే తక్కువ దూరం ప్రయాణించే డొమెస్టిక్ మార్గాల్లో ముందస్తు బుకింగ్ ప్రారంభ ఛార్జీలు 1200 రూపాయల నుంచి 2500 రూపాయల వరకూ ఉన్నాయి. త్వరలో అమల్లోకి రానున్న ‘ఇన్ ఫ్లయిట్ కనెక్టివిటి’ సౌకర్యం వల్ల విమాన ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంది. ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం 83 శాతం మంది ప్రయాణికులు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఎయిర్‌లైన్స్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. -
విమాన ప్రయాణీకులకు శుభవార్త
సాక్షి,న్యూఢిల్లీ: విమానయాన మంత్రిత్వ శాఖ విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వైమానిక ప్రమాదాలు, కాన్సిలేషన్ చార్జీపై కఠినమైన నిబంధనలు అమలు చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. తాజా ప్రతిపాదనల ప్రకారం ఇకపై విమానాల్లో లగేజీ పోయినా, విమానాలు ఆలస్యం అయినా లేదా రద్దయినా విమానయాన సంస్థలు సదరు ప్రయాణికులకు భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు టికెట్ రద్దు చేసుకున్నసందర్భంలో ఎయిర్‌లైన్స్ బాదుడుకు చెక్ పెట్టేలా చర్యలు చేపట్టనుంది. తద్వారా విమాన ప్రయాణీకులకు భారీ ఉపశమనం కల్గించనుంది. పాసెంజర్ చార్టర్లో మార్పులపై విమానయాన సంస్థలు, ఇతర పరిశ్రమ వర్గాలతో రెండు దఫాలుగా ప్రాథమిక చర్చలు జరిపామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా బుధవారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రూపొందించిన తొలి డ్రాఫ్ట్‌ను రాబోయే పదిహేను రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టనున్నామని బుధవారం ట్వీట్ చేశారు.విమానాలు ఆలస్యమైన లేదా రద్దయిన సమయంలో ప్రయాణికులకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని విమానయాన శాఖ ప్రతిపాదించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సీనియర్ అధికారి తెలిపారు. దీంతో పాటు విమానాల్లో పోయిన లగేజీకి కూడా ఎయిర్లైన్లు ప్రయాణికులకు ఎక్కువ మొత్తంలో చెల్లించాలని ప్రతిపాదించిందన్నారు. ప్రస్తుతం దేశీయ విమానాల్లో లగేజీ పోయినా లేదా దెబ్బతిన్నా గరిష్ఠంగా రూ. 20వేల వరకు చెల్లిస్తున్నారు. అంతర్జాతీయ విమానాల్లో అయితే రూ. లక్ష వరకు పరిహారం కింద ఇస్తున్నారు. తాజాగా దీన్ని మరింత పెంచాలని విమానయాన శాఖ భావిస్తోంది. తాజా ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే ఈ పరిహారం భారీగా పెరగనుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో పోయిన లగేజీకి కేజీకి రూ. 3000 వరకు చెల్లించేలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీంతోపాటు ప్రస్తుతం కొన్ని నిర్దేశిత కారణాల వల్ల విమానాలు రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికులకు ఆ ఎయిర్లైన్లు పరిహారం చెల్లిస్తున్నాయి. ఈ మొత్తాన్ని కూడా పెంచాలని విమానయాన శాఖ భావిస్తోంది. కాగా మంత్రిత్వశాఖ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను ఇచ్చినట్లు ఎయిర్ఏషియా ఇండియా తెలిపింది. మరోఎయిర్‌లైన్స్ విస్తారా వ్యాఖ్యానించడానికితిరస్కరించగా ఇతర విమానయాన సంస్థలు ఇంకా స్పందించాల్సి ఉంది. Held discussions with aviation stakeholders to review a draft of the Passenger Charter. Public consultations on draft charter expected to begin in next fortnight. @MoCA_GoI @sureshpprabhu pic.twitter.com/jhjHmNsHCQ — Jayant Sinha (@jayantsinha) April 4, 2018 -
బ్రస్సెల్స్ దాడి భయంతో బూట్లు, బెల్టులు విప్పించి..
న్యూఢిల్లీ: అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సాధారణ విమాన ప్రయాణికులతో పాటు వీఐపీలను సైతం క్షుణ్నంగా తనిఖీ చేస్తుంటారు. వీఐపీలకు దుస్తులు విప్పించి తనిఖీలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనిపై వీఐపీలు ఆగ్రహం వ్యక్తం చేయడం, వివాదాస్పదమైన ఘటనలు కూడా ఉన్నాయి. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ఉగ్రవాదదాడి నేపథ్యంలో భారత్‌లోని ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు గతంలో కంటే తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రయాణికుల బూట్లు, బెల్టులు విప్పించి క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను పెంచారు. ప్రయాణికులు విమానంలోకి ప్రవేశించే ముందు పలు దశల్లో సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు వారిని క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచిఉందున్న కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు భారీ భద్రత చర్యలు తీసుకున్నట్టు ఓ అధికారి చెప్పారు. బ్రస్సెల్స్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడుల్లో రెండు పేలుళ్లు సంభవించగా, పేలని బెల్టు బాంబును భద్రత బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రయాణికుల కదలికలపై నిఘా పెంచడంతో పాటు తనిఖీలను ముమ్మరం చేశారు.