తొలి గగన విహారి ‘శ్రీమతి ఎన్‌సీ సేన్‌’ | The Search For The First Woman To Fly In India | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 19 2018 3:50 PM | Last Updated on Wed, Dec 19 2018 4:02 PM

The Search For The First Woman To Fly In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో తొలి విమానం గాల్లోకి ఎప్పుడు ఎగిరింది? దాన్ని ఎవరు నడిపారు? అన్న ప్రశ్నలకు టక్కున సమాధానం చెప్పడానికి ఎన్నో రికార్డులు అందుబాటులో ఉన్నాయి. అయితే అవన్నీ కూడా భారత్‌లో తొలి విమానాలు ‘ఎగ్జిబిషన్‌’లో భాగంగా 1910లో ఎగిరాయి అని చెబుతున్నాయి తప్పించి. వాటిలో ఫలానా విమానం ముందు ఎగిరింది, ఫలానాది తర్వాత ఎగిరింది అని కచ్చితంగా చెప్పడం లేదు. బ్రిటీష్‌ వైమానికుడు వాల్టర్‌ విండమ్‌ 1910, డిసెంబర్‌ పదవ తేదీన అలహాబాద్‌లో ఎగ్జిబిషన్‌ నిర్వహించారని, అందులో భాగంగా కొంత మంది ప్రయాణికులను తన విమానంలో ఎక్కించుకొని ఆయన గగన విహారం చేశారని కొన్ని రికార్డులు తెలియజేస్తున్నాయి.

కాదు, కాదు, అంతకుముందే, అంటే 1910 మార్చి నెలలోనే ఇటలీ హోటల్‌ యజమాని, వైమానికుడు గియాకోమో డీ ఏంజెలిస్‌ 1910, మార్చి నెలలో మద్రాస్‌లో తన విమానాన్ని ప్రదర్శించారని, అందులో ప్రయాణికులను ఎక్కించుకొని గగన విహారం చేశారని  మరికొన్ని  రికార్డులు చెబుతున్నాయి. కచ్చితంగా ఇది ముందు, అది వెనక అని రుజువు చేయడానికి భారత వైమానికి సంస్థ వద్ద కూడా ఎలాంటి చారిత్రక రికార్డులు లేవు. కానీ సరిగ్గా ఈ రోజుకు 108 ఏళ్ల క్రితం, అంటే 1910, డిసెంబర్‌ 19వ తేదీన తొలి మహిళా ప్రయాణికురాలు కోల్‌కతా నుంచి గగన విహారం చేసినట్లు రుజువులు దొరికాయి.

కోల్‌కతాలోని టోలిగంజ్‌ క్లబ్‌లో నిర్వహించిన వైమానిక ఎగ్జిబిషన్‌లో భాగంగా శ్రీమతి ఎన్‌సీ సేన్‌ తొలి వైమానిక ప్రయాణికురాలిగా 1910, డిసెంబర్‌ 19వ తేదీన గగన విహారం చేసినట్లు ముంబైకి చెందిన ఔత్సాహిక వైమానిక అధ్యయన వేత్త దేబాశిష్‌ చక్రవర్తి కనుగొన్నారు. ఆయన ఏడాది కాలంగా అధ్యయనం చేస్తుండగా ఈ విషయం తేలింది. అది సరే, శ్రీమతి ఎన్‌సీ సేన్‌ ఎవరు? ఆమె ఫొటోను ప్రచురించిన నాటి ఏవియేషన్‌ మాగజైన్‌లో కూడా ఆమె పేరును ఎన్‌షీ సేన్‌గా పేర్కొన్నారు తప్ప, ఆమె గురించి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ఆ నాటికి చెందిన రక రకాల మేగజైన్లను మన చక్రవర్తి తిరిగేయగా, ఆమె బెంగాల్‌కు చెందిన ప్రముఖ తత్వవేత్త, సంఘ సంస్కర్త కేశబ్‌ చంద్రసేన్‌ కోడలని తేలింది. కేశబ్‌ చంద్రసేన్‌కు ఐదుగురు కొడుకులు ఉన్నారు? వారిలో ఏ కోడలు అన్న సమస్య వచ్చింది. వారిలో ముగ్గురు కొడుకులు విదేశీయులను పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్‌ అయ్యారు. ఆ కోడళ్లకు బెంగాల్‌ సంప్రదాయం ప్రకారం మామ ఇంటి పేరు రాలేదు. కానీ ఇద్దరికి వచ్చింది.


దేబాశిష్‌ చక్రవర్తి
 
వారిలో నిర్మలా సేన్‌ ఒక కోడలుకాగా, మృణాలిని దేవీ సేన్‌ మరొకరు. మృణాలిని దేవీ సేన్‌ను కూడా నీ లుద్దీ అని పిలుస్తారు. కనుక వీరిలో ఎవరైనా ఒకరు కావచ్చని, నిర్మలా సేన్‌నే కావచ్చని అధ్యయనవేత్త చక్రవర్తి భావిస్తున్నారు. 1910, డిసెంబర్‌ 28వ తేదీన టోలిగంజ్‌ క్లబ్‌లో ఏవియేషన్‌ మీటింగ్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రం ‘ఈబే’లో వేలం వేసిన విషయం చక్రవర్తికి అధ్యయనంలో తేలడంతో ఆరోజే గగన విహారం జరిగినట్లు ముందుగా ఆయన పొరపొటు పడ్డారు. అదే వేలం పాటలో ఆ నాటి ప్రయాణికులకు టిక్కెట్లు విక్రయించి, వారి పేర్లను నోటు చేసుకొన్న నాటి ఎయిర్‌ హోస్టెస్‌ మాబెల్‌ బేట్స్‌ రాసుకున్న కాగితాన్ని కూడా విక్రయించారు. దాని ప్రతిని సాధించడంతో డిసెంబర్‌ 19వ తేదీన తొలి మహిళా ప్రయాణికురాలు గగన విహారం చేసినట్లు రూఢీ అయింది. ఈ విషయాన్ని ఫ్రెంచ్‌ వార్తా పత్రికలు ‘ఫిగారో’ డిసెంబర్‌ 22, 1920 నాటి సంచిక, ‘లీ టెంప్స్‌’ డిసెంబర్‌ 23, 1910, ‘గిల్‌ బ్లాస్‌’ డిసెంబర్‌ 26, 1910 నాటి సంచికలు రుజువు చేస్తున్నాయి. నాడు టోలిగంజ్‌ క్లబ్‌లో బెల్జియంకు  చెందిన వైమానికులు బారన్‌ పిర్రే డీ కేటర్స్, జూలెస్‌ టైక్‌లు ఇద్దరూ తమ బైప్లేన్స్‌ (అంటే రెక్క మీద రెక్క నాలుగు రెక్కలు ఉంటాయి) నడిపారు. వారిలో ఎవరి విమానాన్ని శ్రీమతి ఎన్‌సీ సేన్‌ ఎక్కారో ఈ నాటికి ప్రశ్నే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement