ఇది విమానంలా కనిపిస్తున్నా.. విమానం కాదు. సిల్వర్-ఫాయిల్ తయారు చేసిన, హీలియం నింపిన ఓ పేద్ద బుడగ లాంటిది. గాల్లోకి ఎగిరి మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందిస్తుంది. పగలంతా సౌరశక్తిని వాడుకుని రాత్రిళ్లు కూడా పనిచేస్తుంది.
రిమోట్ ప్రాంతాలలోని వ్యక్తులకు ఎత్తులో ఎగిరే బ్లింప్ లాంటి విమానం నుంచి ఎందుకు అందించకూడదు? అన్న ఆలోచనతోనే న్యూ మెక్సికోకు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్కీయే (Sceye) సౌర శక్తిని ఉపయోగించుకుని స్ట్రాటోఆవరణలో సంచరించే హ్యాప్స్ (HAPS- హై-ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫారమ్ స్టేషన్)ను రూపొందించింది.
స్కీయే హ్యాప్స్ 65 మీటర్ల (213-అడుగులు) పొడవైన సిబ్బంది లేని హీలియం నిండిన విమానం. దీన్ని నిలువుగా నింగిలోకి ప్రయోగిస్తారు. 60,000 నుంచి 65,000 అడుగుల (18,288 నుండి 19,812 మీ) ఎత్తుకు ఇది వెళ్తుంది. సిల్వర్-ఫాయిల్ తయారైన దీని ఉపరితలంపై ఉండే గాలియం సెలీనైడ్, గాలియం ఆర్సెనైడ్ సౌర ఘటాల శక్తి ద్వారా జీపీఎస్ సాయంతో నిర్దేశిత ఎత్తులో దీన్ని సంచరించేలా చేస్తారు. ఇది మారుమూల ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ని ప్రసారం చేయడం, వాతావరణం, పర్యావరణాన్ని పర్యవేక్షించడం, అడవుల్లో మంటలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడం వంటి పనులను చేయగలదు.
ఈ విమానానికి సంబంధించిన సరికొత్త మైలురాయి గత వారమే వచ్చింది. దాని సౌర ఘటాల ద్వారా పగటిపూట దాని బ్యాటరీలను ఛార్జ్ చేసుకుని, ఆ బ్యాటరీ శక్తిని ఉపయోగించి రాత్రిపూట కూడా ఆ స్థానంలో నిలిచి ఉంటుంది. ఆగస్టు 15వ తేదీ ఉదయం 7:36 గంటలకు న్యూ మెక్సికోలోని స్కీయే స్థావరం నుంచి దీన్ని ప్రయోగించగా 61,000 అడుగుల (18,593 మీ) ఎత్తుకు చేరుకుని మరుసటి రోజు మధ్యాహ్నం 12:21 గంటల వరకూ నిర్దేశిత ఎత్తులోనే సేవలందించింది.
Comments
Please login to add a commentAdd a comment