ముంబై : ‘మేడమ్ దయచేసి మీ ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేయండి’ విమానం టేకాఫ్ అవ్వడానికి ముందు వినిపించే సర్వసాధారణ మాట ఇది. ఇక మీదట ఈ మాట వినిపించబోదు అంటున్నాయి విమానయాన సంస్థలు. అవును ఇక మీదట విమానంలోను ఎంచక్కా ఫోన్ మాట్లాడవచ్చు, ఇంటర్నెట్ వాడుకోవచ్చు. మరో మూడు, నాలుగు నెలల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని.. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను టెలికాం కమిషన్ ఆమోదించినట్లు సమాచారం.
టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తీసుకువచ్చిన నూతన నిబంధనల ప్రకారం విమానం 3 వేల మీటర్ల ఎత్తు చేరుకున్న తర్వాత ప్రయాణికులు తమ ఫోన్‌లను వినియోగించుకోవచ్చని తెలిపింది. అంటే విమానం టేకాఫ్ అయిన తర్వాత 3 వేల మీటర్ల ఎత్తు చేరడానికి సుమారు 4నిమిషాల సమయం పడుతుంది. అంటే మొదటి నాలుగు నిమిషాలు మినహాయించిన తర్వాత ప్రయాణికులు తమ ఫోన్లను వాడుకోవచ్చు. ట్రాయ్ సూచించిన ‘ఇన్ ఫ్లయిట్ కనెక్టివిటి’ వల్ల ఇక మీదట విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు ఫోన్ వినియోగించుకునే సదుపాయం కల్పించనున్నాయి.
కానీ విమానంలో ఇలా మొబైల్, ఇంటర్నెట్ సేవలు వినియోగించుకోవడానికి ప్రయాణికులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు అంతర్జాతీయ విమానయాన సంస్థల ప్రమాణాలను అనుసరించి విధించనున్నారు. ఇప్పటివరకైతే విమానంలో ఇంటర్నెట్‌ను వాడుకోవాలనుకుంటే 30నిమిషాలకుగాను రూ. 500, గంటకుగాను రూ. 1000 చెల్లించాల్సి వచ్చేది. ఇప్పటికే తక్కువ దూరం ప్రయాణించే డొమెస్టిక్ మార్గాల్లో ముందస్తు బుకింగ్ ప్రారంభ ఛార్జీలు 1200 రూపాయల నుంచి 2500 రూపాయల వరకూ ఉన్నాయి. త్వరలో అమల్లోకి రానున్న ‘ఇన్ ఫ్లయిట్ కనెక్టివిటి’ సౌకర్యం వల్ల విమాన ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంది. ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం 83 శాతం మంది ప్రయాణికులు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఎయిర్‌లైన్స్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment