వాట్సాప్‌లో వచ్చే ఆ మెసేజ్‌తో జాగ్రత్త!
ఈ లింకు క్లిక్ చేస్తే మీ మొబైల్‌కు ఉచితంగా రూ.500 రీఛార్జ్ అయిపోతుంది. వెంటనే రీఛార్జ్ చేసుకుని, మరో 15 మంది ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయడంటూ ప్రధాని నరేంద్రమోదీ పేరుమీదనే ఓ లింకు వైరల్ అవుతున్న విషయం విదితమే. ప్రధాని ఇటీవల పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన అనంతరం ఈ లింకు ఎక్కువగా సర్క్యూలేట్ అవుతోంది. నగదు కొరతతో నిజంగానే మోదీ మనకు ఉచితంగా రీఛార్జ్ చేస్తున్నాడమోనని భావించి, చాలామంది ఆ లింకును ఓపెన్ చేస్తున్నారు. దానిలో ఎంతమందికి రూ.500 రీఛార్జ్గా వస్తుందో తెలియదు కాని, మన వ్యక్తిగత సమాచారమైతే లీకైపోయి, హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుందట. ఈ లింకు ఓపెన్ చేసినా, క్లిక్ చేసినా ప్రజలకు హానికరమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధాని పేరు మీద సర్క్యూలేట్ అయ్యే http://balance.modi-gov.in/ లింకు ఫేకని వెల్లడైంది.
ఆ లింకును క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్, ఆపరేటర్, రాష్ట్రం వంటి వివరాలు అందించాలి. అన్ని వివరాలు నింపిన తర్వాత రీఛార్జ్ బటన్ నొక్కగానే, మరో కొత్త పేజీ ఓపెన్ అవుతోంది. ఈ పేజీలో లింకును మరో 15 మంది స్నేహితులకు షేర్ చేయాలని అడుగుతోంది. అయితే ఈ వెబ్సైట్లో నింపే సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్తుందని, యూజర్ల సమాచారాన్ని వారు తప్పుడు కార్యకలాపాలకు వాడుతున్నారని వెల్లడైంది. అదేవిధంగా ఈ హోమ్ పేజీలోనే తాము ఏ టెలికాం కంపెనీకి చెందిన వాళ్లం కాదని నిబంధనలు, షరతుల్లోనే ఉంటుంది. మొదటిసారి వాట్సాప్ వీడియో కాలింగ్‌ను యూజర్లకు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇదే మాదిరి ఓ ఫేక్ మెసేజ్ విపరీతంగా సర్క్యూలేట్ అయింది. ఈ లింకులు చాలా ప్రమాదకరమని, ఎట్టిపరిస్థితుల్లో వాటిని ఓపెన్ చేయొద్దని హెచ్చరికలు జారీఅవుతున్నాయి. వ్యక్తిగత సమాచారాన్ని పన్నగం పెట్టి ఉచిత రీఛార్జ్‌ల కోసం పాకులాడవద్దని హెచ్చరిస్తున్నారు.