ఏటీ అండ్ టీ కస్టమర్లకు ఫ్రీ టీవీలు
ప్రముఖ మీడియా సంస్థ టైమ్ వార్నర్‌ను అమెరికాకు చెందిన అతిపెద్ద టెలికాం దిగ్గజం ఏటీ అండ్ టీ కొనుగోలు చేసింది. 2016లో ప్రకటించిన ఈ డీల్ కోర్టు, ప్రభుత్వ అనుమతులతో సహా అన్ని లాంఛనాలను గురువారం నాటికి పూర్తి చేసినట్లు ఏటీ అండ్ టీ పేర్కొంది. ఈ డీల్ విలువ 8540 కోట్ల డాలర్లని వెల్లడించింది. ఈ విలీనంతో వార్నర్‌కు ఉన్న 10,800 కోట్ల డాలర్ల రుణాన్ని కూడా ఏటీ అండ్ టీ తీసేసుకుంది. అలాగే టైమ్ వార్నర్, హెచ్‌బీఓ, వార్నర్ బ్రదర్స్ ఫిలిమ్ స్టూడియో, టర్నర్ ఛానల్స్... ఏటీ అండ్ టీ చేతికి వచ్చాయి.
ఏటీ అండ్ టీ మొబైల్ వినియోగదారులకు ఊహించని ఆఫర్లను అందించనున్నామని సంస్థ ఛైర్మన్ అండ్ సీఈవో రాండాల్ స్టీఫెన్ సన్ చెప్పారు. ఏటీ అండ్ టీ వాచ్ టీవీ ద్వారా వైర్లెస్ కస్టమర్లకు ఉచిత టీవీలను అందించనున్నామని వెల్లడించారు. కస్టమర్లు నెలకు 15డాలర్లు చొప్పున ఏ ప్లాట్‌ఫాంలో నైనా తమ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. వినోద కేంద్రంగా తమ సేవలు ఉండనున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. ఒక ఏడాదిలోపునే రుణ భారం నుంచి బయటపడతామని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం తీసుకోబోయే చర్యపై తనకు భయం లేదని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఏటీ అండ్ టీ, టైమ్‌వార్నర్ విలీనానికి ఆమోదం తెలుపుతూ కొలంబియా కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. చారిత్రాత్మక తీర్పుగా పేర్కొంటున్న ఈ తీర్పుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. టెలికాం నిబంధనలను తుంగలో తొక్కినట్టు ఆరోపణలు రావడంతో ఈ డీల్‌పై అమెరికా డిపార్ట్ మెంట్ జస్టిస్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.