గ్లామర్ గాళ్.. ఆర్మీ బాయ్
ఆ ఒడ్డున అబ్బాయి, ఈ ఒడ్డున అమ్మాయి...
మధ్యలో చిన్ననాటి సరస్సు.
సరస్సు మధ్యలో... ‘స్నేహం’ అనే పడవ.
పడవ మధ్యలో... పెళ్లిపీటలు.
ఆ పీటలపై... ఇటు నుంచి గ్లామర్ గాళ్
అటు నుంచి ఆర్మీ బాయ్.
పొసుగుతుందా?! పొసిగింది,
లాహిరి లాహిరి అంటూ సాగుతోంది కూడా!
యాంకర్ గాయత్రి, లెఫ్ట్‌నెంట్ కల్నల్ విక్రమ్‌ల
ఉల్లాస విహారమే... ఈవారం ‘మనసే జతగా...’
తెలుగు బుల్లితెర వీక్షకులకు గాయత్రీ భార్గవి సుపరిచితురాలు. పదేళ్లుగా ఫ్రీ లాన్స్ యాంకర్‌గా చేస్తున్న ఆమె బాపుగారి మనవరాలు. ఎం.ఎ, ఎంఫిల్ చేసిన గాయత్రీ భార్గవి తన బాల్యమిత్రుడు అయిన విక్రమ్ సుబ్రహ్మణ్యంని పెద్దల అంగీకారంతో పదేళ్ల క్రితం (అక్టోబర్ 12, 2003) పెళ్లి చేసుకున్నారు. విక్రమ్ ఇండియన్ ఆర్మీలో రాడార్ ఇంజినీర్!
అర్థవంతంగా మలుపు...
విక్రమ్ పుట్టింది చిత్తూరులోనే అయినా చదువు, ఉద్యోగరీత్యా స్వస్థలానికి దూరంగా ఉన్నారు. గాయత్రీభార్గవిది గ్లామర్ ఫీల్డ్! ఇద్దరూ తాము ఎంచుకున్న రంగాలలో చురుగ్గా పనులు చేసుకుంటూనే ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఎలా ఉంటున్నారు అని అడిగితే ఈ దంపతులు హాయిగా నవ్వేశారు.‘‘ పదేళ్లక్రితం మా పెళ్లి గురించి విక్రమ్ పెద్దవాళ్లతో మాట్లాడటం, వాళ్లు సరే అనడంతో వెంటనే మా పెళ్ళి అయిపోయింది. అప్పటికి ఇంకా చదువుకుంటున్నాను.
విక్రమ్ జాబ్‌లో ప్రతి రెండేళ్లకూ ట్రాన్స్ఫర్లు ఉంటాయి. అలా దేశం మొత్తం తిరగాల్సి ఉంటుంది. మా పెళ్లయిన మొదటి రెండేళ్లు విక్రమ్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. అప్పటినుంచి ఇప్పటి వరకు మేము పటియాలా, ఆగ్రా, భూపాల్... అని తిరుగుతూనే ఉన్నాం. తను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి, అదే టైమ్‌లో నా షూటింగ్స్‌కి ఎక్కడా ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదీ నా ప్లాన్. అయితే కొన్నాళ్లపాటు కుటుంబం, కెరియర్ను బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇబ్బందులు పడ్డాను. అలాంటి టైమ్‌లోనే విక్రమ్ నాకు చాలా సపోర్ట్‌గా నిలిచారు. షూటింగ్ ఎక్కడ, ఎప్పుడున్నా వెళ్లడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నా వర్క్‌లో నేనుంటే ఇంటి బాధ్యతలను తను చూసుకుంటారు. మా ఇద్దరికీ బాబు. పేరు భావిక్అక్షజ్! నేను షూటింగ్ హడావిడిలో ఉన్నప్పుడు విక్రమ్ బాబును స్కూల్లో దించి రావడం, కావల్సినవి దగ్గరుండి చూసుకోవడం చేస్తారు’’ అంటూ తెలిపారు గాయత్రీ భార్గవి.
ఇంటిపనుల్లోనే కాదు...
ఆర్మీలో పనిచేసే వ్యక్తికి ఇంటి నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. అదే విషయాన్ని విక్రమ్ ప్రస్తావిస్తూ -‘‘నేను నా విధులను అంకితభావంతో చేయగలుగుతున్నానంటే అది భార్గవి వల్లే! నాకు సంబంధించిన ఏ పని అయినా అత్యంత జాగ్రత్తగా చేస్తుంది. ఇంటిపనుల్లోనే కాదు ఆర్మీ వెల్ఫేర్ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. మా జవాన్ల భార్యలకు అక్షరాస్యత గురించి చెప్పడం, ఆరోగ్య సలహాలు ఇవ్వడంలో ముందుంటుంది. వారి పిల్లల చదువులు కొనసాగించేలా ప్రోత్సాహిస్తుంది’’ అని చెప్పారు.
కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటేనే..!
భర్తకోసం తనను తాను మార్చుకున్న విధానం గురించి భార్గవి వివరిస్తూ - ‘‘మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. పూర్తి శాకాహార కుటుంబం నుంచి వచ్చాను. కాని పెళ్లి తర్వాత కుటుంబసభ్యుల కోసం మాంసాహారం వండటం నేర్చుకున్నాను. కుటుంబసభ్యులను సంతోషంగా ఉంచితే మనమూ సంతోషంగా ఉంటాం. అదే ఇప్పటికీ నేను పాటించే సూత్రం’’ అన్నారు ఆమె.
హోమ్ ఆర్కెస్ట్రా!
‘మా ఇద్దరికీ కొత్త కొత్త ప్లేస్‌లు చూడటమంటే చాలా ఇష్టం. వీలు చిక్కితే చాలు ట్రెక్కింగ్‌కి బ్యాగ్ సర్దేస్తాం. స్విమ్మింగ్ అంటూ వెళ్లిపోతాం. విక్రమ్ గిటార్ చాలా బాగా ప్లే చేస్తారు. ఆ సమయంలో నేనూ పాటలు పాడుతుంటాను. మా అబ్బాయి కాసియో నేర్చుకుంటున్నాడు. మా ముగ్గురి అల్లరితో హోమ్ ఆర్కెస్ట్రా అయిపోతుంది’’ అని ఆనందంగా చెప్పిన భార్గవి భయాన్ని అరచేతుల్లో పెట్టుకొని, దేవుడిని తలుచుకున్న రోజులనూ గుర్తుచేసుకున్నారు. ‘‘విక్రమ్ బార్డర్లో రెండేళ్లు ఒక్కడే ఉండాల్సి వచ్చింది. 6నెలల వరకు ఫోన్లో మాట్లాడటమే కుదరలేదు. కమ్యూనికేషన్ పూర్తిగా బంద్. అలాంటి టైమ్‌లో ‘వస్తున్నాను’ అని ఒక్కమాట కూడా చెప్పకుండా సరాసరి హైదరాబాద్ వచ్చేశారు. చాలా సర్ప్రైజ్ అయ్యాను. విక్రమ్ దగ్గర లేని అన్నిరోజులూ కుటుంబసభ్యుల నుంచి, బంధుమిత్రుల నుంచి నాకు ఎంతో సపోర్ట్ లభించింది. కుటుంబం అంటే మన చుట్టూ ఉండేవారు కూడా! అని అప్పుడే తెలిసింది’’ అన్నారామె!
‘‘మా మధ్యా చిన్న చిన్న వాదనలు వస్తూనే ఉంటాయి. కాని ఒక చిన్న ‘సారీ’ తో వాటిని తుడిచిపెట్టేస్తాం. ఏ సమస్యనూ భూతద్దంలో చూడం. ఎక్కువ రోజులు కాదు కదా, గంటలు కూడా సాగదీయం. సర్దుబాట్లు చేసుకుంటూ ఆనందంగా ఉండటానికి ఎక్కువ ప్రయత్నిస్తాం’’ అని చెప్పింది ఈ జంట. వీరి పద్ధతులను పాటిస్తే ఏ కుటుంబమైనా ఆనందమయమే! అనిపించింది.
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
పనులు ఉన్నాయంటే చాలు కంగారుపడేదాన్ని. ఆ ఆందోళనలోనే నిర్ణయాలు తీసుకునేదాన్ని. వాటి వల్ల ఇబ్బందులు ఎదురయ్యేవి. విక్రమ్‌కి సహనం ఎక్కువ. తన ద్వారానే సహనాన్ని అలవర్చుకున్నాను. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకున్నాను.
- గాయత్రి భార్గవి
నాకు పెళ్లికి ముందు తెలుగు అస్సలు రాదు. భార్గవి ద్వారా తెలుగు నేర్చుకున్నాను. నేను నలుగురిలో పెద్దగా కలవలేను. భార్గవి అందరితోనూ చాలా కలుపుగోలుగా ఉంటుంది. తనను చూసే బంధువులు, ఇతర కుటుంబసభ్యులతో కలివిడిగా ఉండటం నేర్చుకున్నాను.
- విక్రమ్