General Election Management
-
‘ఎన్నికల’ డాక్యుమెంటేషన్ చేయండి
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నిర్వహణ విధానాలపై డాక్యుమెంటేషన్ చేయాలని రాష్ర్ట అదనపు ముఖ్య ఎన్నికల అధికారి వి.వెంకటేశ్వరరావు జాయింట్ కలెక్టర్లకు సూచించారు. విజయవాడ నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఏఎస్పీలతో మంగళవారం ప్రాంతీయ సమీక్ష సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, మద్యం, నగదు పట్టివేత సంబంధిత కేసుల నమోదు, పరిష్కార చర్యలు, ఎన్నికల నివేదిక తదితర విషయాలపై సమీక్షించారు. తొలుత కృష్ణా జాయింట్ కలెక్టర్ జె.మురళి మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి జిల్లాలో 340 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నగదు పట్టివేతకు సంబంధించి రూ.9.71 కోట్ల నగదు సీజ్ చేశామని, దీనికి సంబంధించి 305 కేసులు నమోదు చేయగా 252 కేసుల్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని చెప్పారు. రూ.30.90 లక్షల విలువైన 61,791 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని, 367 కేసులు నమోదు చేశామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావు నాయుడు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై 330 కేసులు నమోదయ్యాయని, రూ.5.62 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 8,900 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని 93 కేసులు నమోదు చేశామని వివరించారు. గుంటూరు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి 395 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి గుంటూరు రూరల్‌లో 851 లిక్కర్ కేసులు, అర్బన్‌లో 127 కేసులు నమోదైనట్లు పోలీస్ అధికారులు వివరించారు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ వై.యాకూబ్‌నాయక్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రూ.7.32 కోట్ల నగదు సీజ్‌చేసి బాధ్యులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. సమీక్ష అనంతరం అదనపు సీఈవో మాట్లాడుతూ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు అందరికీ అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, నగదు, మద్యం సీజ్‌కు సంబంధించి నమోదైన కేసులపై సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సంఘం అడిగిన ఎన్నికల తుది నివేదికలను సత్వరమే పంపాలని చెప్పారు. ఈ ఎన్నికలలో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణ, ముఖ్య సంఘటనలపై అన్ని జిల్లాల్లో డాక్యుమెంటేషన్ చేయాలని సూచించారు. పోలింగ్‌కు ఉపయోగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరచిన విధంగానే ఉపయోగించని ఈవీఎంలకు కూడా తగిన భద్రత కల్పించాలన్నారు. పెయిడ్ న్యూస్‌గా గుర్తించిన వాటిపై సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జె.ప్రభాకరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు, ప్రకాశం జిల్లా ఏఎస్పీ బి.రామనాయక్, గుంటూరు అర్బన్ ఏఎస్పీ శ్రీనివాసులు, పశ్చిమ గోదావరి జిల్లా ఏఎస్పీ పి.చంద్రశేఖర్, విజయవాడ నగర డీసీపీలు వి.గీతాదేవి, ఎ.ఎస్.ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బంది..ఇబ్బంది
సార్వత్రిక ఎన్నికలకు ఉద్యోగుల కొరత విధుల్లో పాల్గొనలేమని అనేకమంది విజ్ఞప్తులు శారీరక సమస్యలతో మొరపెట్టుకుంటున్న ఉద్యోగులు కాదు..కూడదంటున్న జిల్లా యంత్రాంగం నిబంధనల మార్పుతో అధికారుల తర్జనభర్జన నల్లగొండ, న్యూస్‌లైన్, సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కు సిబ్బంది కొరత ఓ వైపు వేధిస్తుంటే...మరోవైపు వివిధ కారణాల వల్ల తాము ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని అనేకమంది ఉద్యోగులు జిల్లా యంత్రాంగానికి మొరపెట్టుకుంటున్నారు. ఎన్నికల విధులు కేటాయించడంలో ఈ సారి ఎన్నికల కమిషన్ నిబంధనలు మార్చడంతో అధికారులకు ఎటూ పాలుపోవడం లేదు. ఈ నెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికలకు అన్ని కేటగిరీల్లో కలిపి సుమారు 20వేల మంది సిబ్బంది అవసరం ఉంది. దీంట్లో ప్రిసైడింగ్ అధికారులు (పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓ), పోలింగ్ క్లర్క్‌లు ఎక్కువ సంఖ్యలో అవసరం ఉంటారు. ప్రస్తుతం పీఓ, ఏపీఓల నియామకం పూర్తికాగా, పోలింగ్ క్లర్క్‌ల నియామకం ఇంకా పూర్తికాలేదు. గెజిటెడ్ హోదా కలిగిన అధికారులను పీఓ, ఏపీఓలుగా నియమిస్తుండగా, వివిధ శాఖల సిబ్బందిని పీసీలుగా నియమిస్తున్నారు. నిబంధనలు కఠినం.. గతంలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి పీఓ, ఏపీఓ, ముగ్గురు పీసీలతోనే ఎన్నికలు నిర్వహించారు. ఈసారి పోలింగ్ కేంద్రానికి పీఓ, ఏపీఓలతో పాటు ఆరుగురు పీసీలను నియమించాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలని, ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు, ప్రైవేటు టీచర్లను నియమించడానికి వీల్లేదన్న ఆదేశాలున్నాయి. గతంలో వారందరినీ విధులకు వాడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో ఎన్నికల నిర్వహణకు సరిపడా సిబ్బంది లభించక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు కొందరు ఉద్యోగులు సుముఖంగా లేరు. పీసీలుగా ఏఈ, డీఈలను కూడా నియమించాల్సి వస్తోంది. దీంతో గెజిటెడ్ హోదా కలిగిన వారిని పీసీలుగా బాధ్యతలు అప్పగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తప్పని తిప్పలు... ఎన్నికల విధుల్లో పాల్గొనడం ఇష్టంలేని ఉద్యోగులు నేరుగా ఏజేసీకి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. గతంలో ఈ ఆక్షేపణలు ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కారం చేశారు. కనీసం తమ స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించే వెసులుబాటు కూడా ఉద్యోగులకు కల్పిం చడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న వారినీ కనికరించడం లేదు. ఆధారాలతో సహా బాధితులు విజ్ఞప్తులు చేస్తున్నా కఠినంగానే వ్యవహరిస్తున్నారు. -
ఇక ప్రచార సవ్వడి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శనివారం నామినేషన్లకు ఉపసంహరణకు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా తయారు చేసేందుకు జిల్లా యంత్రాంగం అర్ధరాత్రి వరకు జాబితా తయారీలో నిమగ్నమైంది.నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినందున ఆదివారం నుంచి సార్వత్రిక ఎన్నికలతో ప్రచార పర్వానికి తెర లేవనుంది. అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలు పాల్గొననున్నారు. అయితే ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కలెక్టర్, ఎన్నికల పరిశీలకులకు సూచిస్తున్నారు. మొన్నటి వరకు ‘స్థానిక’ శబ్దంతో హోరెత్తిన గ్రామాల్లో ఇక సార్వత్రిక ప్రచార సవ్వడి కన్పించనుంది. ఇందుకోసం ప్రధాన పార్టీలు ప్రచార షెడ్యూల్లు రూపొందిస్తున్నాయి. బహిరంగ సభలు, ప్రచారాలు, పార్టీల అగ్రనేతల సభలు, సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలో షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంటున్నాయి. ముగిసిన ఉపసంహరణ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల పరిశీలన అనంతరం తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో రాథోడ్ శ్యాంరావు ఉపసంహరించుకున్నారు. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి గోడం నగేష్, నరేష్ జాదవ్, రాథోడ్ రమేష్,రాథోడ్ సదాశివ్, నేతావత్ రాందాస్, పవార్ కృష్ణ, బంక సహదేవ్, మొసలి చిన్నయ్యతో కలిపి ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల పరిశీలన అనంతరం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఇద్దరు అభ్యర్థులు గోమాస శ్రీనివాస్, మతాంగి సురేష్‌లు ఉపసంహరించుకున్నారు. మిగతా 17 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ఎనిమిది మంది, పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి 17 మంది మొత్తం రెండు లోక్‌సభ స్థానాలకు 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అసెంబ్లీ స్థానాల్లో ఉపసంహరణ జిల్లాలో పది నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాలకు 238 నామినేషన్లు దాఖలు కాగా, ఈ నెల 10న పరిశీలించారు. పరిశీలనలో 101 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం 137 నామినేషన్లు ఆమోదించారు. కాగా, శనివారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో 30 మంది అభ్యర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సిర్పూర్ నియోజకవర్గానికి 17 నామినేషన్లు ఆమోదం పొందగా, ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మిగతా 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇలాగే చెన్నూర్‌లో 17కు ఇద్దరు ఉపసంహరించుకోగా 15 మంది, బెల్లంపల్లిలో 24కు ముగ్గురు ఉపసంహరించుకోగా 21 మంది, మంచిర్యాలలో 18కి ఐదుగురు ఉపసంహరించుకోగా 15 మంది, ఆసిఫాబాద్‌లో 10కి ఇద్దరు ఉపసంహరించుకోగా 8 మంది, ఖానాపూర్‌లో 8 మందికి ఇద్దరు ఉపసంహరించుకోగా ఆరుగురు, ఆదిలాబాద్‌లో 23 మందికి ఎనిమిది మంది ఉపసంహరించుకోగా 15 మంది, బోథోలో ఆరుగురికిగాను ఒకరు ఉపసంహరించుకోగా, ఐదుగురు.. నిర్మల్‌లో 8 మందికి ఒకరు ఉపసంహరించుకోగా ఏడుగురు, ముథోల్‌లో ఆరుగురు అభ్యర్థులకు ఆరుగురు బరిలో నిలిచారు. ముథోల్ నియోజకవర్గంలో నామినేషన్లు ఉపసంహారించుకోలేదు. పది నియోజకవర్గాల్లో 137 నామినేషన్లు పరిశీలన అనంతరం ఆమోదించగా, 30 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మిగతా 107 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.