ఇక ప్రచార సవ్వడి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శనివారం నామినేషన్లకు ఉపసంహరణకు చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్ల ఉపసంహరణ జరిగింది.
అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా తయారు చేసేందుకు జిల్లా యంత్రాంగం అర్ధరాత్రి వరకు జాబితా తయారీలో నిమగ్నమైంది.నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినందున ఆదివారం నుంచి సార్వత్రిక ఎన్నికలతో ప్రచార పర్వానికి తెర లేవనుంది. అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలు పాల్గొననున్నారు.
అయితే ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కలెక్టర్, ఎన్నికల పరిశీలకులకు సూచిస్తున్నారు. మొన్నటి వరకు ‘స్థానిక’ శబ్దంతో హోరెత్తిన గ్రామాల్లో ఇక సార్వత్రిక ప్రచార సవ్వడి కన్పించనుంది. ఇందుకోసం ప్రధాన పార్టీలు ప్రచార షెడ్యూల్‌లు రూపొందిస్తున్నాయి. బహిరంగ సభలు, ప్రచారాలు, పార్టీల అగ్రనేతల సభలు, సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలో షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంటున్నాయి.
ముగిసిన ఉపసంహరణ
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల పరిశీలన అనంతరం తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో రాథోడ్ శ్యాంరావు ఉపసంహరించుకున్నారు. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి గోడం నగేష్, నరేష్ జాదవ్, రాథోడ్ రమేష్,రాథోడ్ సదాశివ్, నేతావత్ రాందాస్, పవార్ కృష్ణ, బంక సహదేవ్, మొసలి చిన్నయ్యతో కలిపి ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల పరిశీలన అనంతరం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఇద్దరు అభ్యర్థులు గోమాస శ్రీనివాస్, మతాంగి సురేష్‌లు ఉపసంహరించుకున్నారు. మిగతా 17 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ఎనిమిది మంది, పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి 17 మంది మొత్తం రెండు లోక్‌సభ స్థానాలకు 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
అసెంబ్లీ స్థానాల్లో ఉపసంహరణ
జిల్లాలో పది నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాలకు 238 నామినేషన్లు దాఖలు కాగా, ఈ నెల 10న పరిశీలించారు. పరిశీలనలో 101 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం 137 నామినేషన్లు ఆమోదించారు. కాగా, శనివారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో 30 మంది అభ్యర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సిర్పూర్ నియోజకవర్గానికి 17 నామినేషన్లు ఆమోదం పొందగా, ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
మిగతా 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇలాగే చెన్నూర్‌లో 17కు ఇద్దరు ఉపసంహరించుకోగా 15 మంది, బెల్లంపల్లిలో 24కు ముగ్గురు ఉపసంహరించుకోగా 21 మంది, మంచిర్యాలలో 18కి ఐదుగురు ఉపసంహరించుకోగా 15 మంది, ఆసిఫాబాద్‌లో 10కి ఇద్దరు ఉపసంహరించుకోగా 8 మంది, ఖానాపూర్‌లో 8 మందికి ఇద్దరు ఉపసంహరించుకోగా ఆరుగురు, ఆదిలాబాద్‌లో 23 మందికి ఎనిమిది మంది ఉపసంహరించుకోగా 15 మంది, బోథోలో ఆరుగురికిగాను ఒకరు ఉపసంహరించుకోగా, ఐదుగురు.. నిర్మల్‌లో 8 మందికి ఒకరు ఉపసంహరించుకోగా ఏడుగురు, ముథోల్‌లో ఆరుగురు అభ్యర్థులకు ఆరుగురు బరిలో నిలిచారు. ముథోల్ నియోజకవర్గంలో నామినేషన్లు ఉపసంహారించుకోలేదు. పది నియోజకవర్గాల్లో 137 నామినేషన్లు పరిశీలన అనంతరం ఆమోదించగా, 30 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మిగతా 107 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.