నల్లగొండ : ఎలక్షన్ డ్యూటీ ఫామ్స్ నింపుతున్న ఉద్యోగులు
సార్వత్రిక ఎన్నికలకు ఉద్యోగుల కొరత
విధుల్లో పాల్గొనలేమని అనేకమంది విజ్ఞప్తులు
శారీరక సమస్యలతో మొరపెట్టుకుంటున్న ఉద్యోగులు
కాదు..కూడదంటున్న జిల్లా యంత్రాంగం
నిబంధనల మార్పుతో అధికారుల తర్జనభర్జన
నల్లగొండ, న్యూస్‌లైన్, సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కు సిబ్బంది కొరత ఓ వైపు వేధిస్తుంటే...మరోవైపు వివిధ కారణాల వల్ల తాము ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని అనేకమంది ఉద్యోగులు జిల్లా యంత్రాంగానికి మొరపెట్టుకుంటున్నారు. ఎన్నికల విధులు కేటాయించడంలో ఈ సారి ఎన్నికల కమిషన్ నిబంధనలు మార్చడంతో అధికారులకు ఎటూ పాలుపోవడం లేదు. ఈ నెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికలకు అన్ని కేటగిరీల్లో కలిపి సుమారు 20వేల మంది సిబ్బంది అవసరం ఉంది.
దీంట్లో ప్రిసైడింగ్ అధికారులు (పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓ), పోలింగ్ క్లర్క్‌లు ఎక్కువ సంఖ్యలో అవసరం ఉంటారు. ప్రస్తుతం పీఓ, ఏపీఓల నియామకం పూర్తికాగా, పోలింగ్ క్లర్క్‌ల నియామకం ఇంకా పూర్తికాలేదు. గెజిటెడ్ హోదా కలిగిన అధికారులను పీఓ, ఏపీఓలుగా నియమిస్తుండగా, వివిధ శాఖల సిబ్బందిని పీసీలుగా నియమిస్తున్నారు.
నిబంధనలు కఠినం..
గతంలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి పీఓ, ఏపీఓ, ముగ్గురు పీసీలతోనే ఎన్నికలు నిర్వహించారు. ఈసారి పోలింగ్ కేంద్రానికి పీఓ, ఏపీఓలతో పాటు ఆరుగురు పీసీలను నియమించాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలని, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ ఉద్యోగులు, ప్రైవేటు టీచర్లను నియమించడానికి వీల్లేదన్న ఆదేశాలున్నాయి.
గతంలో వారందరినీ విధులకు వాడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో ఎన్నికల నిర్వహణకు సరిపడా సిబ్బంది లభించక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు కొందరు ఉద్యోగులు సుముఖంగా లేరు. పీసీలుగా ఏఈ, డీఈలను కూడా నియమించాల్సి వస్తోంది. దీంతో గెజిటెడ్ హోదా కలిగిన వారిని పీసీలుగా బాధ్యతలు అప్పగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
తప్పని తిప్పలు...
ఎన్నికల విధుల్లో పాల్గొనడం ఇష్టంలేని ఉద్యోగులు నేరుగా ఏజేసీకి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. గతంలో ఈ ఆక్షేపణలు ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కారం చేశారు. కనీసం తమ స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించే వెసులుబాటు కూడా ఉద్యోగులకు కల్పిం చడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న వారినీ కనికరించడం లేదు. ఆధారాలతో సహా బాధితులు విజ్ఞప్తులు చేస్తున్నా కఠినంగానే వ్యవహరిస్తున్నారు.