విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల నిర్వహణ విధానాలపై డాక్యుమెంటేషన్ చేయాలని రాష్ర్ట అదనపు ముఖ్య ఎన్నికల అధికారి వి.వెంకటేశ్వరరావు జాయింట్ కలెక్టర్లకు సూచించారు. విజయవాడ నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఏఎస్పీలతో మంగళవారం ప్రాంతీయ సమీక్ష సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, మద్యం, నగదు పట్టివేత సంబంధిత కేసుల నమోదు, పరిష్కార చర్యలు, ఎన్నికల నివేదిక తదితర విషయాలపై సమీక్షించారు.
తొలుత కృష్ణా జాయింట్ కలెక్టర్ జె.మురళి మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి జిల్లాలో 340 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నగదు పట్టివేతకు సంబంధించి రూ.9.71 కోట్ల నగదు సీజ్ చేశామని, దీనికి సంబంధించి 305 కేసులు నమోదు చేయగా 252 కేసుల్లో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశామని చెప్పారు. రూ.30.90 లక్షల విలువైన 61,791 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని, 367 కేసులు నమోదు చేశామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావు నాయుడు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై 330 కేసులు నమోదయ్యాయని, రూ.5.62 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
8,900 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని 93 కేసులు నమోదు చేశామని వివరించారు. గుంటూరు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి 395 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి గుంటూరు రూరల్‌లో 851 లిక్కర్ కేసులు, అర్బన్‌లో 127 కేసులు నమోదైనట్లు పోలీస్ అధికారులు వివరించారు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ వై.యాకూబ్‌నాయక్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రూ.7.32 కోట్ల నగదు సీజ్‌చేసి బాధ్యులపై కేసులు నమోదు చేశామని చెప్పారు.
సమీక్ష అనంతరం అదనపు సీఈవో మాట్లాడుతూ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు అందరికీ అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, నగదు, మద్యం సీజ్‌కు సంబంధించి నమోదైన కేసులపై సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సంఘం అడిగిన ఎన్నికల తుది నివేదికలను సత్వరమే పంపాలని చెప్పారు. ఈ ఎన్నికలలో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల నిర్వహణ, ముఖ్య సంఘటనలపై అన్ని జిల్లాల్లో డాక్యుమెంటేషన్ చేయాలని సూచించారు. పోలింగ్‌కు ఉపయోగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరచిన విధంగానే ఉపయోగించని ఈవీఎంలకు కూడా తగిన భద్రత కల్పించాలన్నారు.
పెయిడ్ న్యూస్‌గా గుర్తించిన వాటిపై సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ జె.ప్రభాకరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు, ప్రకాశం జిల్లా ఏఎస్పీ బి.రామనాయక్, గుంటూరు అర్బన్ ఏఎస్పీ శ్రీనివాసులు, పశ్చిమ గోదావరి జిల్లా ఏఎస్పీ పి.చంద్రశేఖర్, విజయవాడ నగర డీసీపీలు వి.గీతాదేవి, ఎ.ఎస్.ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
‘ఎన్నికల’ డాక్యుమెంటేషన్ చేయండి
Published Wed, May 28 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM
Advertisement
Advertisement