నగర పోలీస్ కమిషనరేట్‌లో నేర పరిశోధక విభాగం పటిష్టతకు చర్యలు ప్రారంభమయ్యాయి.
విజయవాడ సిటీ : నగర పోలీస్ కమిషనరేట్‌లో నేర పరిశోధక విభాగం పటిష్టతకు చర్యలు ప్రారంభమయ్యాయి. నేరాల నియంత్రణకు సీసీఎస్, క్రైం విభాగాలున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. సోమవారం జరిగిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఇదే విషయంపై అధికారుల అభిప్రా యాలను కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు స్వీకరించారు. ఈ మేరకు సీసీఎస్ (సెంట్రల్ క్రైం స్టేషన్)ను పునర్వవ్యవస్థీకరించారు.
క్రైం విభాగంలో సమూల మార్పులు తీసుకొచ్చి కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటుచేస్తే నేరాల కట్టడి సాధ్యమవుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ కేంద్రీకృత వ్యవస్థ పరిధిలోకి పోలీసుస్టేషన్లలో పని చేస్తున్న క్రైం సిబ్బందితోపాటు సీసీఎస్ విభాగం సిబ్బందిని కూడా తీసుకొచ్చి సమాచార సేకరణ, విచారణ, నియంత్రణ విభాగాలుగా విభజించారు. వీరికి అవసరమైన వాహనాలు, కంప్యూటర్లు, ఇతర సామగ్రి, నగదు అందజేశారు. వీరు మంగళవారం నుంచి విధులు ప్రారంభించారు.
కేంద్రీకృత వ్యవస్థ పనితీరు ఇలా..
సమాచార సేకరణ విభాగం : ఆస్తి దొంగతనాలకు అలవాటుపడిన నేరస్తుల సమాచారాన్ని ఈ విభాగంలో పనిచేసేవారు సేకరిస్తారు. ఇదే సమయంలో నేరస్తులపై నిఘా ఉంచడంతో పాటు వారిని గుర్తించేందుకు, పొరుగు జిల్లాల నేరస్తుల ఆచూకీ తెలుసుకునేందుకు వేగుల ఏర్పాటు సహా వివిధ పద్ధతులు అమలు చేస్తారు. ఏదైనా పోలీసు స్టేషన్ పరిధిలో నేరం జరిగితే వీరు వెళ్లి కేసు పూర్వాపరాలు విశ్లేషించడంతో పాటు నేరానికి పాల్పడేందుకు అవకాశం ఉన్న వారిని గుర్తిస్తారు.తద్వారా విశ్లేషించిన సమాచారాన్ని దర్యాప్తు విభాగానికి అందజేస్తారు.
దర్యాప్తు విభాగం : విశ్లేషణ విభాగం నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ విభాగం సిబ్బంది దర్యాప్తు చేస్తారు. వీరికి వచ్చిన సమాచారంలో తమ అనుభవాన్ని జోడించి నేరస్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు చోరీకి గురైన సొత్తును రాబడతారు.
నియంత్రణ విభాగం : నగరవాసులను అప్రమత్తం చేస్తూ నేరాల నియంత్రణకు ఈ విభాగం కృషిచేస్తుంది. తమకు ఇచ్చిన ప్రచార సాధనాల (రికార్డెడ్ సూచనలు)తో కాలనీలు, అపార్టుమెంట్లు, హోటళ్లలో చోరీల నియంత్రణకు తీసు కోవాల్సిన చర్యలను వివరిస్తారు. ప్రజలు సంచరించే షాపులు, థియేటర్లు, హోటళ్లు తదితర ప్రాంతాల్లో సీసీ కెమేరాల ఏర్పాటు వంటి చర్యలను ఈ విభాగమే చూసుకుంటుంది.