20 ఏళ్లుగా చీకటి గదిలో గోవా మహిళ
పనాజీ: అసలే ఆ మహిళ భర్త చేతిలో మోసపోయారు. ఆపై తన కష్టాలు చెప్పుకునేందుకు పుట్టింటికి వచ్చారు. పుట్టింటివారు చీకటి గదిలో ఆమెను బంధించారు. ఇక అంతే అక్కడితో ఆమె జీవితం రెండు దశాబ్దాలు నరకకూపంలో గడిచిపోయింది. చివరికి ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమెను బయటి ప్రపంచంలోకి తీసుకొచ్చారు. ఈ ఘటన నార్త్ గోవాలో ఇటీవల వెలుగుచూసింది.
నార్త్ గోవాలోని క్యాండోలిమ్కు చెందిన మహిళ 20 ఏళ్ల కిందట ముంబైకి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నారు. భర్తతో పాటు ముంబైలోని అత్తింటికి వెళ్లారు. కానీ తన భర్తకు అప్పటికే వివాహం జరిగిందని తెలుసుకుని ఆమె కుమిలిపోయారు. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన తనకు కొన్ని రోజుల్లోనే చేదు అనుభవం ఎదురవుతుందని భావించలేదు. ఆపై కొన్ని రోజులకే భర్తపై ఆగ్రహంతో గోవాలోని తన పుట్టింటికి వచ్చారు. ఆమెను ఓదార్చి బాధను పంచుకోకపోగా, కుటుంబసభ్యులు ఆమె మానసిక స్థితిపై అనుమానపడ్డారు. ఓ చీకటి గదిలో ఆమెను బంధించారు. అసలే భర్త చేసిన మోసానికి ఎంతో ఆవేదన చెందిన మహిళ పుట్టింటి వారి చేష్టలకు బాహ్యప్రపంచంతో బంధం కోల్పోయింది.
20 ఏళ్లు చీకటిగదిలో గడిచిపోయాయి. నీళ్లు, ఆహారం మాత్రం ఆ గదిలోకి వెళ్లేవి. ఈ క్రమంలో గదికి ఉన్న కిటికీ ద్వారా మహిళను గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకుని ఫ్యామిలీని ప్రశ్నించి చీకటిగదిలోకి వెళ్లి చూసి షాక్ తిన్నారు. దాదాపు యాభైఏళ్లున్న ఓ మహిళ నగ్నంగా ధీనస్థితిలో పడి ఉన్నట్లు మహిళా పోలీసులు గుర్తించారు. ఆమెను ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి సోదరులను పోలీసులు ప్రశ్నించగా.. ముంబైకి నుంచి వచ్చాక తమ సోదరి ప్రవర్తనలో మార్పు రావడంతో ఆ రూములో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు వివరించారు.