god idols
-
Ayodhya: ప్రాణప్రతిష్టకు ముందే బాలరాముడి దివ్యరూప దర్శనం
అయోధ్య: అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే రామమందిరం ప్రారంభోత్సవం కంటే ముందే శ్రీ రాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది. భవ్యమందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్న బాలరాముని విగ్రహాం ఫోటోలు బయటకు వచ్చాయి. కృష్ణ శిలతో 51 అంగుళాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది. కాగా గురువారమే గర్భాలయానికి బలరాముడి విగ్రహం చేరుకుంది. మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు జరుపుతున్న ఆచారాల్లో భాగంగా బాలరామున్ని గర్భగుడికి తీసుకువచ్చారు. ప్రస్తుతం బాలరాముని విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిని చూసిన భక్తులు.. జైశ్రీరామ్ అంటూ పులకించిపోతున్నారు. రామ్‌లల్లా విశిష్టతలివే.. ►అయోధ్య రామాలయంలో ప్రతిష్టించబోయే బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. ► కృష్ణ శిల(నల్ల రాయి) నుంచి ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. ► రామ్‌లల్లాను చెక్కిన శిల బరువు దాదాపు 200 కిలోలు. ► ఐదేళ్ల బాలుడి రూపంలో రామ్‌లల్లా విగ్రహాన్ని రూపొందించారు. ►కాశీకి చెందిన జ్ఞానేశ్వర్ శాస్త్రీ ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ట పూజలు ► గర్భాలయంలో నిల్చున్న రూపంలోనే రామ్‌లల్లా దర్శనమిస్తాడు. ► విగ్రహ ప్రాణప్రతిష్ట ఈ నెల 22వ తేదీన.. సోమవారం మధ్యాహ్నం 12.20 గంట నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది. ►శ్రీరామ నవమి రోజున గర్భగుడిలో సూర్య కిరణాలు పడేలా ఏర్పాట్లు ►శ్రీరాముడికి సూర్య తిలకంలో కిరణాలు పడేలా ఏర్పాట్లు ► ప్రాణప్రతిష్ట సందర్భంగా గర్భగుడిలోకి కొందరికే ప్రవేశం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మహంత్ నృత్యగోపాల్ మహారాజ్ మాత్రమే గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ట్రస్టీలు ‘గర్భగృహం’ అని పిలిచే పవిత్ర ప్రాంతంలో ఆసీనులవుతారు. ► ఆలయ ప్రాణప్రతిష్టకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన యజమాని(కర్త)గావ్యవహరిస్తారు. ► ఈ నెల 23వ తేదీ నుంచి గర్భాలయంలో బాలరాముడిని సామాన్య భక్తులు దర్శించుకోవచ్చు. -
అపశకునం కాదు, దేవుడి విగ్రహాలతో రీసైక్లింగ్
ఆలయంలో అయినా, ఇంట్లో అయినా పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా చేస్తాం. ఇంట్లో ఉండే దేవతామూర్తుల విగ్రహాలు, పటాలు, ఫొటో ఫ్రేములు జారిపడినా, పక్కకు ఒరిగిపోయినా అపశకునంగా భావిస్తారు. అందుకే మరింత శ్రద్ధగా పూజ చేయడంతో పాటు, పూజాసామగ్రిని ఎంతో జాగ్రత్తగా భద్రపరుస్తుంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు విగ్రహాలు పాతబడి విరిగిపోవడం, ఫొటో ఫ్రేములు చిరిగిపోవడం లేదా తుప్పు పట్టి పాడైపోవడం జరుగుతుంటుంది. అలాంటి వాటిని వెంటనే తీసేసి కొత్తవాటిని పూజలో పెట్టుకుంటారు. మనలో చాలామంది ఇలానే పడేస్తుంటాము. తృప్తిౖ గెక్వాడ్ మాత్రం ఈ విగ్రహాలను పడేయకుండా.. రీ సైకిల్ చేసి రకరకాల వస్తువులను తయారు చేస్తోంది. చెత్తగా మారకుండా... సరికొత్త హంగులు అద్ది అందంగా మారుస్తోంది. మహారాష్ట్రలోని యోవలాలో పుట్టిపెరిగిన తృప్తి గైక్వాడ్ వృత్తిపరంగా నాసిక్‌లో స్థిరపడింది. న్యాయవాదిగా క్షణం తీరికలేని పని తనది. అయితే తన చుట్టూ ఉన్న సమాజంలో జరిగే విషయాలను ఎంతో ఆసక్తిగా గమనించే మనస్తత్వం కావడం వల్ల 2019లో ఓసారామె గంగానదిని చూడడానికి వెళ్లింది. అప్పుడు గంగానదిని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇదే సమయంలో ... విరిగిపోయిన దేవతామూర్తుల విగ్రహాలు, ఫ్రేములు తీసుకుని నదిలో వేయడానికి వచ్చాడు ఒకతను. అతన్ని చూసిన తృప్తి..‘‘వీటిని నదిలో వేయకు. వీటిలో ఉన్న పేపర్, కార్డ్బోర్డ్, మట్టిబొమ్మలు నదిని మరింత కలుషితం చేస్తాయి’’ అని చెప్పి అతను వాటిని నదిలో వేయకుండా వారించింది. అందుకు ఆ వ్యక్తి ఇక్కడ వేయవద్దు.. సరే వీటిని ఏం చేయాలి?’’ అంటూ చికాకు పడ్డాడు. అప్పటికేదో సమాధానం చెప్పి అతణ్ణి పంపింది కానీ తృప్తి మనసులో కూడా ‘అవును వీటిని ఏం చేయాలి?’ అన్న ఆలోచన మొదలైంది. కొద్దిరోజులు తర్వాత వీటిని రీ సైకిలింగ్ చేసి ఇతర వస్తువులు తయారు చేయవచ్చన్న ఆలోచన తట్టింది తనకు. తన ఐడియాను కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగుతో పంచుకుంది. అంతా ప్రోత్సహించేసరికి .. పాత దేవతామూర్తుల విగ్రహాలు రీసైకిల్ చేయడం ప్రారంభించింది. సంపూర్తిగా... విగ్రహాలను రీసైక్లింగ్ చేసేందుకు‘సంపూర్ణమ్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. సంపూర్ణమ్ టీమ్ దేవతామూర్తుల పాతవిగ్రహాలు, ఫొటోఫ్రేములను గుళ్లు, చెట్లకింద పడి ఉన్న వాటిని, ఇళ్లనుంచి సేకరిస్తుంది. ఈ విగ్రహాలను పూర్తిగా పొడిచేసి మొక్కలకు ఎరువులా మారుస్తారు. ఎరువుగా పనికిరాని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కలిసిన మట్టిని కుండలు, పాత్రలు, ఇటుక రాళ్లుగా తయారు చేస్తారు. వీటితో పక్షులు, జంతువులకు గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా తయారైన పాత్రల్లో పక్షులు, జంతువులకు ఆహారం, తాగునీటిని అందిస్తున్నారు. సంపూర్ణమ్ సేవలను మహారాష్ట్రలోని పూనే, నాసిక్, ముంబై, సోలాపూర్, సంగమ్నేర్లకు విస్తరించింది తృప్తి. ఇటీవల ఇతర రాష్ట్రాల్లో సైతం సేవలను ప్రారంభించింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ద్వారా ఈ రీసైక్లింగ్ గురించి అవగాహన కల్పిస్తోంది. ఆకర్షణీయమైన టాయిస్.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కలిసిన విగ్రహాలను పొడిగా మార్చి, ఈ పొడికి కొద్దిగా సిమెంట్‌ను కలిపి టాయిస్‌ను రూపొందిస్తున్నారు. మురికి వాడల్లోని నిరుపేద పిల్లల ద్వారా పాతవిగ్రహాలు, ఫొటోఫ్రేమ్లనూ సేకరిస్తూ వారికి ఆర్థికంగా సాయపడుతోంది. ‘‘దేవతల విగ్రహాల ఫొటోఫ్రేములను చక్కగా అలంకరించి నిష్ఠగా పూజిస్తారు. ఇటువంటి ఫ్రేములు పాడైతే పడేయాల్సిందే. ఇది నచ్చకే సంపూర్ణమ్ను తీసుకొచ్చాను. దేవుడి విగ్రహాలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేసిన తరువాతే రీసైక్లింగ్ చేస్తున్నాను. వాట్సాప్, ఫేస్బుక్లో చాలామంది కస్టమర్లు నన్ను సంప్రదిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటిదాకా వేల సంఖ్యలో రీసైక్లింగ్ చేసి పర్యావరణాన్ని కాపాడాను. అదేవిధంగా దేవుడి పటాలకు మంచి రూపాన్ని ఇవ్వడం ఎంతో తృప్తినిస్తోంది’’. – తృప్తి గైక్వాడ్ -
ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!
మనిషిని దేవుడు సృష్టించినట్లు పలువురు విశ్వసిస్తున్నారు. అయితే దేవుడి రూపు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. పేరు తలవగానే ఆ రూపం కళ్లముందు కదలాడే విధంగా శిలా ప్రతిమలను తీర్చిదిద్దుతున్నారు పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం మల్లేల గ్రామానికి చెందిన కళాకారులు. ఈ గ్రామం వద్ద ఉన్న నానుబాయి కొండ ప్రాంతంలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నల్లటి రాతి శిలలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి నాణ్యంగా, దేవతామూర్తుల విగ్రహాల తయారీకి అనువుగా ఉండడంతో పలు ప్రాంతాలకు చెందిన శిల్పులు శిలలను చెక్కి విక్రయిస్తున్నారు. కొందరు బండలాగుడు పోటీలకు పెద్ద బండరాళ్లను ఇక్కడి నుంచే తీసుకెళుతుంటారు. ఇక్కడి శిల్పులు, శిల్పళానైపుణ్యంపై సాక్షి ప్రత్యేక కథనం.. సాక్షి ప్రతినిధి, కడప (వైఎస్సార్ జిల్లా) : తొండూరు మండలం మల్లేలలో ఉన్న వడ్డెర కుటుంబాలు శతాబ్దాలుగా గుట్ట నుంచి రాయిని వెలికి తీయడం వృత్తిగా చేసుకున్నాయి. విగ్రహాలకు రాళ్లు అనువుగా ఉండడంతో ఆ రాళ్లను ఇతర ప్రాంతాల్లోని శిల్పులకు విక్రయిస్తున్నారు. ప్రధానంగా ఆళ్లగడ్డతోపాటు పలు ప్రాంతాల్లోని శిల్పులు ఇక్కడి నుంచే రాయిని తీసుకెళుతున్నారు. స్థానికంగానే కాకుండా ఇతర జిల్లాలలో గుడుల నిర్మాణంతోపాటు గుడుల స్తంభాలు, దేవతామూర్తుల విగ్రహాలు, ఇతర అవసరాల కోసం కూడా తీసుకెళుతుంటారు. రాయిని ఇక్కడి వడ్డెరలు అడుగు చొప్పున విక్రయిస్తున్నారు. ప్రధానంగా నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డకు చెందిన శిల్పులు మల్లేల గ్రామం నానుబాయి కొండ నుంచి ఎక్కువగా రాయిని తీసుకెళుతున్నారు. ఈ రాతితో వినాయకుడు, లక్ష్మిదేవి, సరస్వతిదేవి, శ్రీకృష్ణుడు, సీతారామ, లక్ష్మణుల విగ్రహాలు, గ్రామ దేవతల విగ్రహాలు సైతం తయారు చేసి విక్రయాలు సాగిస్తున్నారు. ఇటీవలే మల్లెల కొండ నుంచి ఆంజనేయస్వామి విగ్రహం కోసం 45 అడుగుల పొడువున్న రాయిని మైసూరుకు చెందిన వారు తీసుకెళ్లారు. దేవతామూర్తుల విగ్రహాలే కాకుండా బండలాగుడు పోటీలకు ఉపయోగించే పెద్ద బండరాళ్లు, కంకల గుండ్లు సైతం ఈ రాయితో ఇక్కడి వడ్డెరలు తయారు చేస్తున్నారు. ఇవేకాకుండా రోళ్లు, విసురు రాళ్లు, రుబ్బు రాళ్లు తదితర వాటిని సైతం తయారు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ గ్రామంలో ఉన్న ఎనిమిది వడ్డెర కుటుంబాలకు ఇదే వృత్తి. పొద్దునే వెళ్లి కొండ గుట్టపై మట్టిని తొలగించి రాళ్లను వెలికి తీస్తున్నారు. వెలికి తీసిన రాళ్లను అడుగు రూ. 75 చొప్పున విక్రయిస్తున్నారు. వడ్డెర మహిళలు సైతం పురుషులకు తోడుగా ఇదే పనిలో ఉంటున్నారు. పెద్ద రాళ్లను విగ్రహాలు, ఇతర వాటికి విక్రయించగా, చిన్న రాళ్లను విసురురాళ్లు, రోళ్లు తదితర వాటిని వీళ్లే మొలిచి అమ్ముకుంటున్నారు. లీజుతో తవ్వకాలు 10 ఎకరాల్లో నానుబాయి కొండను స్థానిక వడ్డెరలే సొసైటీ ద్వారా లీజుకు తీసుకున్నారు. భూమి నుండి ప ది అడుగులలోతు వరకు ఇక్కడ రాతి పొరలు ఉన్నా యి. పూర్వం నుంచి ఇదే వృత్తిలో ఉన్నట్లు వడ్డెరలు చెబుతున్నారు. పెద్దల నుంచి వచ్చిన వారసత్వంగా ఇప్పటికే రాళ్లు తీసి అమ్ముకోవడమే వృత్తిగా బ్రతుకుతున్నట్లు చెప్పారు. తమకు వ్యవసాయ భూములు లేవని, రాయి తీసి అమ్ముకోవడం, చిన్నరాళ్లను మొలిచి విక్రయించుకోవడమే వృత్తిగా బతుకుతున్నట్లు వారు పేర్కొన్నారు. రోజుకు రూ. 400–500లోపు కూలీ మాత్రమే పడుతున్నట్లు తెలిపారు. రాయి నాణ్యంగా ఉండడంతో శిల్పాలకు పనికి వస్తోందని, ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి రాయిని తీసుకెళుతున్నట్లు వారు వివరించారు. గ్రామాల్లో గుడులు నిర్మించేవారు, వారికి అవసరమైన రాయిని తరలించుకుని ఇక్కడి నుంచే తీసుకెళుతుంటారని వడ్డెర్లు చెబుతున్నారు. (క్లిక్: లక్షల్లో వేతనాలు వదిలిన జంట.. ‘పంట’ భద్రులైంది!) దేవతా విగ్రహాలకు ఇక్కడి రాయే తీసుకెళతారు దేవతామూర్తుల విగ్రహాలు చేసేందుకు శిల్పులు మా మల్లేల గ్రామం వద్దనున్న నానుబాయి కొండ రాయినే తీసుకు వెళతారు. శిల్పులకు అవసరమైన రాయిని మేము తవ్వితీసి అడుగు లెక్కన విక్రయిస్తాం. చాలామంది గుడులు నిర్మించేవారు కూడా రాయిని తీసుకెళతారు. పెద్దరాళ్లను విక్రయించి చిన్న రాళ్లను రోళ్లు, విసురు రాళ్లు తదితర వాటిని మేమే మొలిచి విక్రయిస్తుంటాం. మా పూర్వీకుల నుండి ఇప్పటివరకు ఇదే వృత్తితో జీవిస్తున్నాము. – కుంచెపు వీరభాస్కర్, మల్లేల గ్రామం పూర్వం నుంచి ఇదే వృత్తి మా పూర్వీకులు ఇక్కడి రాయిని వెలికితీసి దేవతామూర్తుల విగ్రహాల తయారీకి అమ్మేవారు.ప్రస్తుతం మేము అదే చేస్తున్నాం. గ్రామం వద్దనున్న నానుబాయి కొండ ప్రాంతాన్ని లీజు ద్వారా తీసుకుని రాయిని వెలికి తీసి అడుగు చొప్పున విక్రయిస్తుంటాం. ఆళ్లగడ్డ, ఇతర ప్రాంతాలవారు ఇక్కడి నుంచే రాయిని తీసుకెళతారు. ఈ రాయితోనే విగ్రహాలను, రుబ్బురోళ్లు తయారు చేస్తారు. – కుంచెపు చిన్న లింగన్న, మల్లేల గ్రామం -
పగలు భక్తి, రాత్రి లూటీ
యశవంతపుర: కలబురిగి నగరంలో దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో ఇద్దరు దొంగలకి గాయాలయ్యాయి. వివరాలు... మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లా తుళజాపూర్ తాలూకా ఝళకోళ గ్రామానికి చెందిన ముఠా దేవుని విగ్రహాల బండితో తిరుగుతూ డబ్బులు సేకరించేవారు. రాత్రి సమయంలో దోపిడీలు చేసేవారు. ఇటీవల కలబురిగి నగరంలో ఇళ్లు చోరీలు అధికంగా జరుగుతున్నాయి. ప్రజలు, పోలీసులకు తలనొప్పిగా మారింది. దుండగులు పగటిపూట దేవుని బండిని ఊరంతా తిప్పి తాళం వేసిన ఇళ్లు, ధనవంతుల నివాసాలను గుర్తుంచుకునేవారు. రాత్రి కాగానే లూటీ చేస్తుండేవారు. అర్ధరాత్రి దోపిడీకి యత్నం... మంగళవారం అర్ధరాత్రి బిద్దాపూర కాలనీలో దోపిడి చేయటానికీ చొరబడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటాడారు. దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో సీఐ పండిత్ సాగర్, పోలీసులు కాల్పులు జరిపారు. లవ, దేవిదాస్ అనే ఇద్దరు నిందితులకు తూటాలు తగిలి కిందపడిపోయారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఒక కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. (చదవండి: కి‘లేడీ’లు.. క్లోజ్‌గా మాట్లాడి హానీట్రాప్ చేసి ఆ తర్వాత..) -
దేవుడి మీద కోపంతో ఆ కూలీ ఏం చేశాడంటే..
భోపాల్: అతనో దినసరి కూలీ. రోజూ పనికి వెళ్తేగానీ.. భార్యాబిడ్డల కడుపు నిండదు. కాయకష్టంతో పాటు దేవుడ్ని కూడా నమ్ముకున్నారు. అలాంటిది అనారోగ్యం ఆ కుటుంబాన్ని చుట్టుముట్టింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. పెద్దల సలహాతో ఎన్నో పూజలు చేశాడు. పుణ్యక్షేత్రాలు దర్శించాడు. అయినా లాభం లేకపోయింది. చివరకు కలత చెందిన చేసినపని అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. మధ్యప్రదేశ్ ఛట్టార్పూర్ జిల్లాకు చెందిన వినోద్ కుమార్ అలియాస్ భూరా(27)పై.. బేటా 2 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో మూడు దేవతావిగ్రహాలను ధ్వంసం చేశాడని అతనిపై అభియోగం నమోదు అయ్యింది. సోమవారం ఉదయం అతను ఆ దాడికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అక్కడ పోలీసులను మోహరించారు. వినోద్‌కు భార్యా, ఐదేళ్ల బిడ్డ ఉన్నారు. గత మూడునాలుగేళ్లుగా వీళ్లద్దరి ఆరోగ్యం బాగుండడం లేదు. ఎన్ని మందులు వాడినా.. దేవుళ్లకు ఎంత మొక్కినా వాళ్ల ఆర్యోగం మెరుగుపడలేదట. ఈమధ్యే అతనికి పిల్లనిచ్చిన అత్త కూడా చనిపోయింది. ఈ పరిణామాలన్నీ అతన్ని మానసికంగా కుంగదీశాయి. దేవుడి మీద కోపం పెంచుకున్న వినోద్.. సుత్తి, శిలతో పూజారి లేని ఆ ఆలయానికి చేరుకుని విగ్రహాలు ధ్వంసం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంగళవారం అతన్ని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 295 (ప్రార్థనా స్థలాలను అప్రవిత్రం చేయడం) కింద కేసు నమోదు చేసుకుని వినోద్‌ను జైలుకు తరలించారు. చదవండి: ఒంటి కాలితో బడికి.. చిన్నారికు అంతా ఫిదా -
కుప్పంలో విగ్రహాల ధ్వంసం: చంద్రబాబుపై ఎస్పీ ఫైర్..
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలోని పురాతన విగ్రహాల ధ్వంసం ఘటనను పోలీసులు ఛేదించారు. కుప్పం మండలం గోనుగురు సమీపంలోని దేవతామూర్తుల విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ వేగవంతం చేసిన పోలీసులు సంఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించారు. మతిస్థిమితం లేని ఓ మహిళ విగ్రహాలు ధ్వంసం చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు. గుడి చాలా మారుమూల ప్రాంతంలో ఉందని, వారానికి ఒకసారి మాత్రమే అక్కడ పూజలు జరుగుతాయని తెలిపారు. మతిస్థిమితం లేని మహిళ ఈ ఘటనకు కారణమని తేలిందన్నారు. విగ్రహాల ధ్వంసం చేసిన విషయాన్ని జ్యోతి అనే మహిళ ఒప్పుకుందన్నారు. విగ్రహాలు ధ్వంసం చేసే సమయంలో మహిళ మద్యం మత్తులో ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రార్థనాలయాలకు జియో ట్యాగింగ్ చేశామని, ఈ ఘటనపై కుట్ర జరిగిందనేలా చంద్రబాబు ట్వీట్ చేయడం సరికాదన్నారు. నిజానిజాలు నిర్ధారించుకుని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయకూడదని హితవు పలికారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టరీత్యా కేసులు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే, పోలీసులు, పీస్ కమిటీకి వెంటనే తెలియజేయాలని తెలిపారు. చదవండి: అడుగడుగునా మేసేశారు -
‘ఆ ఆలయాలకు నోటీసులు జారీ చేస్తాం’
సాక్షి, పశ్చిమ గోదావరి : మండపేట టౌన్లో రాత్రిపూట పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు తెలిపారు. బుధవారం డీఐజీ మాట్లాడుతూ.. విగ్రహాల ధ్వంసంపై కేసు నమోదు చేసి, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో 20 మంది వరకు అనుమాతులు ఉన్నారని, సీసీ టీవీ ఫుటేజ్‌లో కొంతమందిని గుర్తించినట్లు తెలిపారు. మండపేట ప్రజలు సమన్వయంతో ఉండాలని సూచించారు. (‘చలో అంతర్వేది’కి అనుమతుల్లేవ్) ‘అరాచక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ప్రతి దేవాలయాల దగ్గర కమిటీలు ఏర్పాటు చేసుకుని సెక్యూరిటీ ఏర్పరుచుకోవాలి. సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పరుచుకుని గుడి బాధ్యతలు కమిటీ తీసుకోవాలి. చిన్న టెంపుల్స్‌లో సైతం కమిటీలు బాధ్యత తీసుకోవాలి. కమిటీలు ఏర్పాటు చేయని ఆలయాలకు నోటీసులు జారీ చేస్తాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు పోలీసులకు సహకరించాలి’. అని ఏలూరు రేంజ్ డీఐజీ పేర్కొన్నారు. (అక్టోబర్ 2 నుంచి 'మనం-మన పరిశుభ్రత') -
దేవుళ్ల పుట్టిల్లు
రాతికి జీవం ఉట్టిపడేలా చేయడం వారికి ఉలితో పెట్టిన విద్య. శిలలను సజీవ శిల్పాలుగా చెక్కి దేశ విదేశాల్లోని ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శిల్పులు. సుమారు 300 సంవత్సరాల కిందట నుంచీ వారు వంశపారంపర్యంగా రాతి శిల్పాలు చెక్కుతున్నట్టు చరిత్ర చెబుతోంది. ఆళ్లగడ్డ: ఏకశిల రథముపై లోకేశు వడిలోన.. ఓరచూపుల దేవి ఊరేగి వస్తుంది. శిల్పి స్పర్శ తగలగానే అక్కడి శిలలు చేతనత్వం పొంది.. సరిగమలు ఆలపిస్తాయి. కటిక రాతికి జీవకళ పోయడం వారికి ఉలితో పెట్టిన విద్య. శిలలను సజీవ శిల్పాలుగా చెక్కి దేశ విదేశాల్లోని ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు ఆళ్లగడ్డ శిల్పులు. సుమారు 300 సంవత్సరాల క్రితం నుంచీ ఆళ్లగడ్డ శిల్పులు వంశపారంపర్యంగా రాతి శిల్పాలు చెక్కుతున్నట్టు చరిత్ర చెబుతోంది. నాడు ఒక కుటుంబం మాత్రమే ఈ వృత్తిని చేపట్టగా.. ప్రస్తుతం సుమారు 100 కుటుంబాలు ఇదే వృత్తిని జీవనాధారంగా చేపట్టి శిల్పకళా రంగంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పేరును అంతర్జాతీయ స్థాయిలో పదిలపరుస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య నగరానికి తరలించేందుకు సిద్ధంగా ఉన్న శేషపాన్పు విగ్రహం ఇలా మొదలైంది ► ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని గుంప్రామాన్ దిన్నె గ్రామానికి చెందిన దురుగడ్డ బాలాచారి, వీరాచారి పూర్వీకులు సుమారు 300 సంవత్సరాల క్రితం శిల్పాల తయారీకి శ్రీకారం చుట్టారు. ► పట్టణ ప్రాంతంలో ఆదరణ బాగుంటుందనే ఉద్దేశంతో వీరు 1950లో అక్కడి నుంచి ఆళ్లగడ్డ పట్టణానికి వలస శిల్ప శాలను ఏర్పాటు చేశారు. ► 1982 వరకు ఆ ఒక్క కుటుంబం మాత్రమే శిల్పాలు తయారు చేసేది. ఆ తరువాత ఆ కుటుంబానికి చెందిన దురుగడ్డ రామాచారి తన నలుగురు కుమారులతోపాటు మరికొందర్ని శిష్యులుగా చేర్చుకుని శిల్పకళను అభివృద్ధి చేశారు. ► ప్రస్తుతం ఆళ్లగడ్డలో సుమారు 60 శిల్ప శాలలు ఉండగా.. వాటిలో 500 మంది శిల్పులు విగ్రహాలు తయారు చేస్లూ జీవనోపాధి పొందుతున్నారు. ఆళ్లగడ్డ నుంచి అమెరికా వరకు.. ► దేవతా మూర్తుల విగ్రహాలలోపాటు ప్రముఖ రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తల విగ్రహాలను జీవకళ ఉట్టి పడేలా తీర్చిదిద్దడం ఆళ్లగడ్డ శిల్పుల ప్రత్యేకత. ► వీరి చేతిలో రూపుదిద్దుకున్న అనేక విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా హిందూ ఆలయాల్లో మూలవిరాట్‌లుగా కొలువై పూజలందుకుంటున్నాయి. ► ఇక్కడి శిల్పులు అమెరికా వెళ్లి అక్కడే మూడు నెలలు ఉండి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి వచ్చారు. ► ఆళ్లగడ్డలో తయారు చేసిన విగ్రహాలు చైనా, రష్యా, శ్రీలంక, జపాన్ తదితర దేశాలకు ఓడల ద్వారా ఎగుమతి అవుతున్నాయి. మహిళలూ రాణిస్తున్నారు ► శిల్ప కళలో మహిళలు కూడా రాణిస్తున్నారు. మొదట్లో కుటుంబంలోని పురుషులు చెక్కిన విగ్రహాలకు నగిషీలు ఇవ్వటం, నునుపు చేయటం వంటి పనులు మహిళలు చేసేవారు. ► శిల్ప కళలో మెళకువలు నేర్చుకుని పురుషులతో సమానంగా పాల రాతి శిల్పాలు, గృహాలంకరణ ఉపకరణాలను తయారు చేస్తున్నారు. ► ప్రస్తుత కంప్యూటర్ యుగంలో యువకులంతా సాఫ్ట్వేర్ రంగం వైపు మొగ్గు చూపుతుంటే.. శిల్పుల కుటుంబాల్లోని యువకులు శిల్ప కళపైనే మక్కువ చూపుతున్నారు. ► ఆన్లైన్ ద్వారా విగ్రహాల ఆర్డర్లు బుక్ చేసుకోవడం వంటివి చేస్తున్నారు. శిల్పాల తయారీలో యంత్రాల వినియోగాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కో విగ్రహానికి.. ఒక్కో శిల ► విగ్రహాలను చెక్కడం ఓ ఎత్తైతే వాటికి అవసరమైన, వినియోగదారుడి బడ్జెట్‌కు సరిపోయే రాయిని ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. ► ఏ రాయి అయితే ఏ విగ్రహం ఎలా ఉంటుంది... ఎంత బడ్జెట్లో వస్తుందో చెప్పి విగ్రహాలను తయారు చేసి ఇస్తుంటారు. ► ఇందుకోసం వైఎస్సార్ జిల్లా తలమంచి పట్నం, మల్యాల, కాంచీపురం, బెంగళూరు, కోయిరా, మైసూర్ తదితర ప్రాంతాల నుంచి గ్రానైట్, ఎర్ర రాయి, నల్ల రాయి, పాల రాయి, కోయిరా రాయి వంటి శిలలను వినియోగిస్తారు. -
బందీగా దేవతామూర్తులు..
విజయవాడ: నూతన రాజధానిలో వందల సంవత్సరాల నాటి దేవాలయాలు, మఠాలు విజయవాడలో కూల్చివేతకు గురయ్యాయి. అందులోని విగ్రహాలు ప్రస్తుతం విలపిస్తున్నాయి. నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలందుకునే దేవతామూర్తుల విగ్రహాలు కొన్ని ప్రస్తుతం ఏ పూజకూ నోచుకోకుండా మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని గదుల్లో బందీలయ్యాయి. కృష్ణా నది ఒడ్డున నిత్యపూజలతో ఆధ్యాత్మికత విలసిల్లే వాతావరణం నేడు కనుమరుగవుతోంది. భక్తులతో కిటకటలాడాల్సిన ఆలయాలు నేలమట్టమై, దేవతామూర్తులు కనిపించకుండాపోవడంపై భక్తజనం ఆక్రోశిస్తున్నారు. విగ్రహాలు ఎక్కడికి తరలించారో అధికారులు చెప్పకపోవడంతో భక్తులు మండిపడుతున్నారు. ఆలనాపాలన, పూజా కార్యక్రమాల నిర్వహణకు విగ్రహాలు నోచుకోక ఎక్కడో ఓ మూలలో, చీకటి గదుల్లో ఉంచేశారు. తొలగించిన దేవాలయాలను పునర్మిస్తామని, విగ్రహాలకు నిత్య పూజలు జరిగేలా చూస్తామని చెప్పిన దేవాదాయశాఖ మంత్రి ఆ విషయం మరిచిపోయారు. చెల్లా చెదురైన విగ్రహాలు గుళ్లు తొలగించిన వారు ఇష్టమొచ్చిన చోట విగ్రహాలు పడేశారు. కొన్నింటిని మునిసిపాలిటీలో ఉంచారు. రథం సెంటర్లో ఉన్న పురాతన ద్వారపాలకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. శనీశ్వరాలయానికి ఎదురుగా ఇంద్రకీలాద్రికి దిగువ భాగంలో ఉండే సీతమ్మవారి పాదాలు తీసివేశారు. పురాతనమైన ఆంజనేయస్వామి దేవాలయాన్నీ కూల్చివేశారు. అర్జునవీధిలోని మహామండపం దిగువన గుడి ఉంది. అమ్మవారి గుడికి నాలుగు వైపుల ఆంజనేయస్వామి గుడులు ఉన్నాయి. అందులో తూర్పువైపున ఉన్న ఆంజనేయుడి దేవస్థానాన్ని కూల్చాక విగ్రహాన్ని ట్రాలీలో వేసి తాళ్లతో కట్టి మునిసిపల్ ఆఫీసుకు తీసుకెళ్లారు. అక్కడ ఆరుబయట ట్రాలీని ఉంచడంతో ‘సాక్షి’లో ఆ ఫొటో ప్రచురితమైంది. దీంతో తేరుకున్న అధికారులు అందులోని విగ్రహాలను వేరే ప్రాంతాలకు తరలించారు. పుష్కరాల సమయంలో దర్శనానికి దిక్కేది? పుష్కరాల సమయంలో భక్తులు దేవుడి దర్శనం చేసుకుందామంటే దేవాలయం కనిపించడం లేదు. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకుందామంటే ఘాట్ రోడ్డును మూసేశారు. అక్కడ ఉండే దుకాణాలు, విచారణ కేంద్రాలు, కార్యనిర్వహణాధికారి, పరిపాలనా భవనాలు, ఇతర దీక్ష మండపాలు, భవనాలు కూల్చి వేశారు. ఎందుకిలా చేశారని ప్రశ్నిస్తే ఈ ప్రాంతాన్ని గ్రీనరీగా మారుస్తామని చెబుతున్నారు. మరోవైపు ఆలయాల కూల్చివేతపై వేసిన మంత్రుల కమిటీ మాటలకే పరిమితమైంది. సీతమ్మవారి పాదాలు, దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు పునర్మిస్తామని మంత్రి మాణిక్యాలరావు హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆ ఊసేలేదు.