
భోపాల్: అతనో దినసరి కూలీ. రోజూ పనికి వెళ్తేగానీ.. భార్యాబిడ్డల కడుపు నిండదు. కాయకష్టంతో పాటు దేవుడ్ని కూడా నమ్ముకున్నారు. అలాంటిది అనారోగ్యం ఆ కుటుంబాన్ని చుట్టుముట్టింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. పెద్దల సలహాతో ఎన్నో పూజలు చేశాడు. పుణ్యక్షేత్రాలు దర్శించాడు. అయినా లాభం లేకపోయింది. చివరకు కలత చెందిన చేసినపని అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది.
మధ్యప్రదేశ్ ఛట్టార్‌పూర్ జిల్లాకు చెందిన వినోద్ కుమార్ అలియాస్ భూరా(27)పై.. బేటా 2 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది. స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో మూడు దేవతావిగ్రహాలను ధ్వంసం చేశాడని అతనిపై అభియోగం నమోదు అయ్యింది. సోమవారం ఉదయం అతను ఆ దాడికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అక్కడ పోలీసులను మోహరించారు.
వినోద్‌కు భార్యా, ఐదేళ్ల బిడ్డ ఉన్నారు. గత మూడునాలుగేళ్లుగా వీళ్లద్దరి ఆరోగ్యం బాగుండడం లేదు. ఎన్ని మందులు వాడినా.. దేవుళ్లకు ఎంత మొక్కినా వాళ్ల ఆర్యోగం మెరుగుపడలేదట. ఈమధ్యే అతనికి పిల్లనిచ్చిన అత్త కూడా చనిపోయింది. ఈ పరిణామాలన్నీ అతన్ని మానసికంగా కుంగదీశాయి.
దేవుడి మీద కోపం పెంచుకున్న వినోద్.. సుత్తి, శిలతో పూజారి లేని ఆ ఆలయానికి చేరుకుని విగ్రహాలు ధ్వంసం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంగళవారం అతన్ని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 295 (ప్రార్థనా స్థలాలను అప్రవిత్రం చేయడం) కింద కేసు నమోదు చేసుకుని వినోద్‌ను జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment