రాకాసి తిమింగలానికి ఏమైంది..!
లండన్: ప్రపంచంలోనే అత్యధిక వయసు గల కిల్లర్ వేల్(తిమింగలం) అదృశ్యమైందా.. లేక చనిపోయిందా.. అంటే చనిపోయి ఉండొచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దాదాపు వంద ఏళ్ల వయసున్న కిల్లర్ వేల్ కు గ్రాన్నీ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్షీరదాల ఫ్యామిలీలో గ్రాన్నీ, మరికొన్ని తిమింగలాలు మాత్రమే కీలక పాత్ర పోషిస్తాయి. కిల్లర్ వేల్స్ ఇతర ఆడ తిమింగలాలు, పిల్ల తిమింగలాలకు రక్షణ కల్పిస్తాయి. మగ తిమింగలాలకు ఆహారం అందించడం వీటి మరో ప్రత్యేకత. గత కొన్ని నెలలుగా కిల్లర్ వేల్ గ్రాన్నీ కనిపించిన దాఖలాలు లేవని, దీంతో వీటి సంఖ్య తగ్గే అవకాశం ఉందని యూకే లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సీటర్కు చెందిన ఓ ప్రొఫెసర్ డారెన్ గ్రాఫ్ట్ అభిప్రాయపడ్డారు.
శతాబ్దం వయసు గల ఈ కిల్లర్ వేల్ ఎన్నో ఏళ్లుగా తన వర్గానికి చెందిన తిమింగలాలకు రక్షణ కల్పించింది. ఇతర తిమింగలాలకు ఆహారం ఎలా సంపాదించుకోవాలి.. ఎక్కడ దొరుకుతుంది అనే విషయాలలో ఇది గైడ్‌గా పనిచేస్తుందని ప్రొఫెసర్ తెలిపారు. 1972లో కిల్లర్ వేల్‌ను కెన్ బాల్కోంబ్ అనే రీసెర్చర్ ఫొటో తీశాడు. సెంటర్ ఫర్ వేల్ రీసెర్చ్ వారు దీనికి 'j2' అని పేరు పెట్టారు. గ్రాన్నీ తిమింగళంపై దాదాపు 4 దశాబ్దాలపాటు రీసెర్చ్ చేసినట్లు ఈ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. చివరగా గతేడాది అక్టోబర్ 12న ఉత్తర దిశగా ఈదుతూ కనిపించింది. ఆ తర్వాత పలువురు గ్రాన్నీ వేల్ ను వెతకగా దీని జాడ కనిపించలేదని చనిపోయి ఉండొచ్చునని అదే దీని అదృశ్యానికి కారణమని రీసెర్చర్స్ పేర్కొన్నారు.