పనులు కావాలంటే పన్నులు వేయండి
నిధుల కోసం మేం ప్రపంచ బ్యాంకు వద్దకు వెళ్లాలా?
విజయవాడ కార్పొరేషన్ దివాళా తీసింది
సిబ్బంది ఉద్యోగ ధర్మం పాటించాలి
పౌర సన్మాన సభలో కేంద్రమంత్రి వెంకయ్య
సాక్షి, విజయవాడ : నగరపాలక సంస్థ దివాళా తీసిందని, సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని సాక్షాత్తు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. కార్పొరేషన్ రూ.246 కోట్ల అప్పుల్లో ఉండడంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయని చెప్పారు. అందుకే పన్నులు పెంచి వచ్చే ఆదాయంతో పనులు చేయాలని సూచించారు. శనివారం స్థానిక తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో వెంకయ్యకు పౌర సన్మానం జరిగింది.
ఈ సభలో ఆయన మాట్లాడుతూ 2002 నుంచి ఇప్పటివరకు నగరంలో పన్నులు పెంచలేదని గుర్తుచేశారు. స్థానికంగా ఆదాయ వనరులు సమకూర్చుకోకపోతే ఎలాగని ప్రశ్నించారు. కార్పొరేషన్‌కు కావాల్సిన నిధులు ఎవరొచ్చి ఇస్తారని అడిగారు. నిధులివ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పరిమితులు ఉన్నాయన్నారు. కార్పొరేషన్లు నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్దకెళితే.. రాష్ట్రం కేంద్రం వద్దకు వస్తే.. మరి కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు వద్దకు వెళ్లాలా?అని ప్రశ్నించారు.
పన్నులు రివైజ్ చేయండి..
జీఐఎస్ గ్రాఫిక్కు నగరం మ్యాప్‌ను అనుసంధానం చేయడం ద్వారా నగరంలోని ఏ ఇల్లు ఎంత విస్తీర్ణంలో ఉంది, దానికి ఎంత పన్ను చెల్లించాలో తెలుసుకోవచ్చని వెంకయ్యనాయుడు చెప్పారు. ప్రతి ఇంటి యజమాని సెల్ఫ్ ఎసెస్ వేసుకుని కార్పొరేషన్‌కు పన్నులు చెల్లించాలన్నారు. హైదరాబాద్ నగరాన్ని జీఐఎస్‌కు అనుసంధానం చేయడం ద్వారా రూ.765 కోట్లు వచ్చే పన్ను రూ.1035 కోట్లకు పెరిగిందన్నారు. పన్నులు చెల్లించని వారిపై ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని, వారు తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడానికి వెనుకాడరాదన్నారు. నగరానికి 30 కి.మీ. లోపు జరిగే నిర్మాణాలపై దృష్టి సారించాలని చెప్పారు. నగరపాలక సంస్థకు ఏవైనా ఇబ్బందులుంటే ఢిల్లీ వస్తే అక్కడ చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చని వివరించారు.
పుర్వవైభవం తీసుకురండి..
విజయవాడకు పూర్వవైభవం తీసుకురావాలని వెంకయ్య పిలుపునిచ్చారు. ఒకప్పుడు చిత్ర పరిశ్రమ ఇక్కడే ఉండేదని, సాహిత్య రంగం, పత్రికా రంగానికి విజయవాడ పుట్టినిల్లని, స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడ ఉండేవారని చెప్పారు. మధ్యలో కొన్ని రోజులు ఘర్షణలు జరిగినా తిరిగి ఇప్పుడు కలిసి పనిచేసి సాంస్కృతిక, సాహిత్య రంగాలను అభివృద్ధి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, గోకరాజు గంగరాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమ, మేయర్ కోనేరు శ్రీధర్, కలెక్టర్ రఘునందన్‌రావు, కమిషనర్ హరికిరణ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
వెంకయ్య ఇచ్చిన హామీలు
దుర్గగుడి వద్ద ఫ్లైవోవర్ నిర్మాణం
రూ.60 కోట్లతో కొండపల్లి అభివృద్ధి
అంతర్జాతీయ స్థాయికి గన్నవరం విమానాశ్రయం
విజయవాడ-గుంటూరు-తెనాలి నగరాల మధ్య మెట్రో రైలు ఏర్పాటుకు ఈ బడ్జెట్లో రూ.10 కోట్ల కేటాయింపు. త్వరలోనే సమగ్ర నివేదిక రెడీ.
గన్నవరం వద్ద ఉన్న బ్రహ్మయ్యలింగయ్య చెరువును హుస్సేన్‌సాగర్ తరహాలో అభివృద్ధి చేయడానికి పరిశీలన.
రవీంద్రభారతి తరహాలో తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రాన్ని తీర్చిదిద్దుతాం.
నగరానికి వెలుపల గుంటూరు జిల్లా కాజ నుంచి పెదఆవుటపల్లి వరకు అవుటర్ రింగ్‌రోడ్డు, తూర్పు వైపున మరో రింగ్‌రోడ్డు నిర్మాణం.
నగరంలోనిమురికివాడల్లో నివసించే పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం.