Gummidipoondi
-
చెన్నై టు ఏపీ; బియ్యం అక్రమ రవాణ
గుమ్మిడిపూండి(నెల్లూరు జిల్లా) : రైలు మార్గం గుండా తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా బియ్యం తరలిస్తున్న ముఠాను నెల్లూరుజిల్లా అధికారులు పట్టుకున్నారు. దాదాపు 1500 కేజీల బియ్యాన్ని లోకల్ రైలులో తరలిస్తుండగా గుమ్మిడిపూండి రెవెన్యూ అధికారులు వలపన్ని సరుకును స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న గుమ్మిడిపూండి టీఎస్వో ఇళవరసి.. పౌర సరఫరాల శాఖ సిబ్బందితో కలసి శుక్రవారం ఏళావూర్, గుమ్మిడిపూండి, కవరపేట, తదితర స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో లోకల్ రైల్లో సీట్ల కింద 45 బియ్యం బస్తాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పంజెట్టిలోని పౌరసరఫరాల గోదాముకు తరలించారు. -
రేషన్ బియ్యం స్వాధీనం
గుమ్మిడిపూండి: రైలులో ఆంధ్రాకు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై సెంట్రల్ నుంచి గుమ్మిడిపూండి మీదుగా తడ, సూళ్లూరుపేట, నెల్లూరుకు వెళ్లే యూనిట్ రైలులో కొందరు రేషన్ బియ్యాన్ని ఆక్రమంగా రవాణా చేస్తున్నారని గుమ్మిడిపూండి టీఎస్ఓ ఇళవరసికి సమాచారం అందింది. దీంతో ఆమె రెండు రోజులుగా తన సిబ్బందితో గుమ్మిడిపూండి, కవరపేట, తదితర స్టేషన్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ప్లాట్‌ఫాం పక్కన ముళ్లపొదల్లో దాచిన బియ్యం బస్తాలను గుర్తించి అధికారులు వాటిని స్వాధీనం చేస్తున్నారు. బియ్యం బస్తాలను పంజెట్టిలోని పౌరసరఫరాల శాఖ గోదాముకు తరలించారు. -
పెళ్లిలో గొడవ: యువకుడి హత్య
గుమ్మిడిపూండి:పెళ్లి భోజనాల వద్ద జరిగిన గొడవలో ఓ యువకుడిని హత్యకు గురైన సంఘటన మాదరపాక్కంలో మంగళవారం జరిగింది. మాదరపాక్కం సమీపంలోని పాదిరివేడు దళిత కాలనికి చెందిన ఓ యువకుడికి ఈగువారిపాలెం సమీపంలోని కుమ్మనాయుడుపేటకు చెందిన యువతితో సోమవారం గుమ్మిడిపూండిలో వివాహం జరిగింది. భోజనాల వద్ద పాదిరివేడు, కుమ్మనాయుడు పేటకు చెందిన యువకుల మధ్య గొడవ ప్రారంభమైంది. అప్పుడు ఇరుగ్రామాలకు చెందిన పెద్దలు నచ్చచేప్పి పంపివేశారు. అయితే పాదిరివేడు గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ (21) ఒంటరిగా పాదిరివేడుకు వెళుతుండగా కుమ్మనాయుడుపేటకు చెందిన యువకులు కర్రలతో కొట్టి హత్య చేసి సమీపంలోని కల్వర్టు క్రింద పడవేశారు. ఈ విష యం తెలిసిన మాదరపాక్కం గ్రామస్తులు ఆగ్రహంతో కుమ్మనాయుడుపేట గ్రామంపై దాడి చేశారు. అరుణ్‌కుమార్‌ను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ..షాపులు మూసి ధర్నాకు దిగారు. రోడ్డుపై టైర్లు కాల్చి రాస్తారోకో చేశారు. దీంతో బస్సులు నిలిచి పోయాయి. విషయం తెలుసుకున్న గుమ్మిడిపూండి డీఎస్పీ శివలింగం వచ్చి ఆందోళన చేస్తున్న గ్రామస్తులతో చర్చలు జరిపారు. వారు వినకపోవడంతో జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వగా వెంటనే ఎస్పీ శాంసన్ మాదరపాక్కం గ్రామానికి వచ్చారు. ఈ సమయంలో పాదిరివేడుకు చెందిన కొం దరు కుమ్మనాయుడు పేటకు చెందిన ఓ యువకుడిని చితక్కొట్టారు. దీంతో రెండు గ్రామాల్లో అలజడి రేగింది. నిందితులను అరెస్టు చేసేంత వరకు ఇక్కడినుంచి కదలమని భీష్మించుకుని కూచున్నారు. దీంతో జిల్లా ఎస్పీ శాంసన్, తహసీల్దార్ పాల్స్వామి అక్కడే ఉన్నారు. ఎట్టకేలకు సాయంత్రం గ్రామస్తులు శాంతించారు. -
అన్నాడీఎంకే విజయాన్ని అడ్డుకోలేరు
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయాన్ని ఏ కూటమీ అడ్డుకోలేదని రాష్ట్ర మంత్రి వలర్మతి అన్నారు. గుమ్మిడిపూండి బజారువీధిలో అన్నాడీఎంకే యువజన శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విజయాలను వివరించే బహిరంగసభ జరిగింది. ఈ సభకు యువజనశాఖ జిల్లా కార్యదర్శి ముల్లైవేందన్ నేతృత్వం వహించగా యూనియన్ కార్యదర్శి గోపాల్‌నాయుడు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా మంత్రులు వలర్మతి, బీవీ రమణ పాల్గొన్నారు. మంత్రి వలర్మతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జయలలిత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. అమ్మ పనితీరును జాతీయ పత్రికలు కొనియాడుతుంటే రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు ఇది మింగుడుపడడం లేదన్నారు. డీఎంకే అధినేత కరుణానిధి లోక్‌సభ ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం పాకులాడుతున్నారని తెలిపారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి తప్పదని పేర్కొన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 40 స్థానాల్లో అన్నాడీఎంకే గెలుపు కోసం కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషిచేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విజయాలను వివరించారు. ఎమ్మెల్యేలు పొన్‌రాజా, మణిమారన్, జిల్లా చైర్మన్ రవిచంద్రన్, జిల్లా కౌన్సిలర్లు నారాయణమూర్తి, ఎన్.శ్రీధర్, యూనియన్ చైర్మన్ గుణమ్మ, వైస్ చైర్మన్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: ఆరణి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. కవరపేట సమీపం మేల్మదలంబేడు గ్రామానికి చెందిన కార్మెగం(24) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. పెరియపాళెంలోని బంధువుల ఇంట్లో కార్యక్రమానికి శుక్రవారం రాత్రి వెళ్లాడు. శనివారం ఉదయం తిరిగి వస్తుండగా ఆరణి వద్ద ఓ ప్రైవేటు స్కూలు బస్సు ఢీకొనింది. తీవ్రంగా గాయపడ్డ కార్మెగం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆరణి పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులను ఇంటికి పంపి బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించా రు. కార్మెగం మృతదేహాన్ని పొన్నేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఆరణి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
పాదిరివేడులో సమైక్యాంధ్ర ర్యాలీ
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్ : ఆంధ్ర రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరు తూ ఆదివారం గుమ్మడిపూండి యూనియన్ పాదిరి వేడులో దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ మహోన్నత పాఠశాల నుంచి పాదిరివేడు బస్టాండు మీదుగా మాదరపాక్కం బస్టాండు వరకు సాగింది. దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఎం.మునిస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం తెలంగాణ విభజనకు అంగీ కారం తెలపడం దారుణమన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు 60 రోజులుగా సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్నా కాంగ్రెస్‌లో కొంచెం కూడా చలనం లేకపోవడం సీమాంధ్రుల పట్ల వారికున్న సులకన భావం అర్థమవుతోందన్నారు. రాజకీయ నాయకులు పదవులు పట్టుకొని వేలాడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ మెడలు వంచాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో యూనియన్ మాజీ వైస్ చైర్మన్ త్యాగరాయ, యూనియన్ కౌన్సిలర్ కాంచన వీరభద్రం, దేవాంగ సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, సంయుక్త కార్యదర్శులు చిట్టిబాబు, సత్యం బాబు, సత్యవేడు, జేఎంసీ సభ్యులు చొప్పల సోమశేఖర్, సత్యవేడు దేవాంగ సంఘం అధ్యక్షులు శివయ్య, తెలుగు వికాస సమితి సంయుక్త కార్యదర్శులు వి.కృష్ణమోహన్, షణ్ముగం పాల్గొన్నారు.