GVK management
-
జీవీకేలో చాంగీ ఎయిర్ పోర్ట్ కు వాటా?
♦ ఎయిర్పోర్ట్ వ్యాపారంలో 49శాతం వాటా కొనుగోలు! ♦ ఇంకా చర్చల దశలోనేఉందంటున్న జీవీకే యాజమాన్యం ♦ వాటా విక్రయం ద్వారా తగ్గనున్న రూ.3,600 కోట్ల రుణ భారం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్పోర్ట్ వ్యాపారాన్ని ప్రత్యేక సంస్థగా విడదీసి స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలన్న ఆలోచనలకు జీవీకే ఇన్ఫ్రా పక్కకు పెట్టినట్లు తాజా సమాచారం. మార్కెట్ పరిస్థితులు అనువుగా లేకపోవడంతో ఐపీవో కంటే ప్రైవేటుగా వాటాలను విక్రయించడం ద్వారానే నిధులు సేకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం పలు అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సింగపూర్‌కు చెందిన చాంగీ ఎయిర్పోర్ట్ గ్రూపు జీవీకేకు చెందిన మొత్తం ఎయిర్పోర్ట్ వ్యాపారంలో 49శాతం వాటాను కొనేందుకు ముందుకొచ్చినట్లు మార్కెట్లో వార్తలు షికార్లు చేశాయి. ప్రస్తుతం జీవీకే గ్రూపు మొత్తం రెండు దేశీయ, ఒక విదేశీ విమానాశ్రయాన్ని నిర్వహిస్తోంది. జీవీకే ముంబై ఎయిర్‌పోర్టులో 50.5% వాటా, బెంగళూరు ఎయిర్‌పోర్టులో 43శాతం వాటా, ఇండోనేసియాకు చెందిన బాలీ ఎయిర్‌పోర్టులో 100శాతం వాటాను కలిగి ఉంది. జీవీకే ఎయిర్పోర్ట్ వ్యాపార విలువను సుమారుగా రూ. 8,800 కోట్లుగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు విభాగానికి రూ. 3,600 కోట్ల అప్పులున్నాయి. చాంగీ ఎయిర్‌పోర్ట్‌కు వాటాను విక్రయించడం ద్వారా మొత్తం రుణ భారాన్ని వదిలించుకోవాలన్నది జీవీకే ఇన్ఫ్రా ఆలోచన. కానీ చాంగీ ఎయిర్‌పోర్టు 49శాతం వాటాకి రూ. 3,000-3,500 కోట్లు మాత్రమే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. చర్చల మాట నిజమే..: వాటా విక్రయానికి సంబంధించి వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్న మాట వాస్తవమేని, కానీ ఇవి ఇంకా తుది దశకు చేరుకోలేదని జీవీకే ఇన్ఫ్రా స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియచేసింది. మార్కెట్లో నడుస్తున్న పుకార్లపై ఎక్స్ఛేంజీలు వివరణ కోరాయి. దీనిపై స్పందిస్తూ నిధుల సమీకరణ కోసం ఒకరిద్దరు ఇన్వెస్టర్లతోపాటు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ వివరించింది. ఫిబ్రవరి 12న మూడో త్రైమాసిక ఫలితాలు ఉండటంతో ప్రస్తుతం ‘సెలైంట్ పిరియడ్ (ఈ సమయంలో ఎటువంటి నిర్ణయాలు, ప్రకటనలు ఉండవు)’లో ఉన్నట్లు తెలిపింది. వాటాలు విక్రయించడానికి బిడ్డింగులు పిలవగా 5 అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయని, వీటిలో ‘చాంగీ’తో చర్చలు తుది దశలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో 6 నెలల్లో ఈ వాటా విక్రయం పూర్తవుతుందని భావిస్తున్నారు. లాభాల్లో ఎయిర్పోర్ట్ వ్యాపారం భారీ అప్పుల్లో కూరుకుపోయిన జీవీకే ఇన్ఫ్రాకు సంబంధించి, ఎయిర్పోర్ట్ వ్యాపారం ఒక్కటే లాభాల్లో కొనసాగుతోంది. తగ్గిన ఇంధన ధరలతో విమాన ప్రయాణికుల సంఖ్య పెరగడం, కొత్త విమానయాన సంస్థలు ప్రవేశించడంతో ఆదాయంలో గణణీయమైన వృద్ధి నమోదవుతోంది. ద్వితీయ త్రైమాసికంలో ఎయిర్పోర్ట్ విభాగం రూ. 674 కోట్ల ఆదాయంపై రూ. 94 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. -
నేటి నుంచి 108 ఉద్యోగుల దీక్షలు
సాక్షి, హైదరాబాద్: జీవీకే యాజమాన్యం మొండివైఖరికి నిరసనగా గురువారం నుంచి స్థానిక ఇందిరాపార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు 108 కాంట్రాక్టు ఉద్యోగుల అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు భూపాల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ 34 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం గానీ, జీవీకే యాజమాన్యం గానీ పట్టించుకోలేదని, అందుకే నిరాహార దీక్షలు చేపడుతున్నామని వివరించారు. -
108 ఉద్యోగుల దీక్ష భగ్నం
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట నాలుగు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న 108 ఉద్యోగులను సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి, చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్బంగా పోలీసులకు. ఉద్యోగలకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. అనంతరం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. 31 రోజుల పాటు సమ్మె చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరం లేక నిరాహారదీక్ష చేయాల్సి వచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం జీవీకే యాజమాన్యంతో కుమ్కకై ఉద్యోగులను అరెస్టు చేసిందని ఆరోపించారు. అరెస్టులు, దీక్షల భగ్నంతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. దీక్ష చేస్తున్న పలువురి ఆరోగ్యం క్షీణంచిందని, వారికి ఏదైనా జరిగితే ప్రభుత్వం, జీవీకే యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో చదలవాడ రవి, జి. సైదులు, ఎం. శ్రీనివాసరావు, బి. వెంకటరెడ్డి, డి. రాధాకృష్ణ ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.గణపతి, కె.నర్సింహారావు, లింగయ్య, దేవి, కుమారి ఉన్నారు. -
108 చర్చలు మళ్లీ విఫలం..
అసంపూర్తిగా ముగిసిన చర్చలు 13వ తేదీకి వాయిదా సాక్షి, హైదరాబాద్: 108 సిబ్బంది సమస్యలపై అదనపు లేబర్ కమిషనర్ వై.సూర్యప్రసాద్ సమక్షంలో యాజమాన్యం, 108 యూనియన్ల మధ్య గురువారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కనీస వేతనం పెంపు, 8 గంటల పనివిధానం, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం తదితర డిమాండ్లపై జీవీకే, ఈఎంఆర్ఐ యాజమాన్యం దిగిరాకపోవడంతో ఐదవ దఫా చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చర్చలను 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సూర్యప్రసాద్ ప్రకటించారు. చర్చల్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబా, 108 సిబ్బంది యూనియన్ గౌరవాధ్యక్షుడు భూపాల్, అధ్యక్షుడు అప్పిరెడ్డి తదితరులు, జీవీకే యాజమాన్యం పక్షాన భట్టాచార్య, మూర్తి పాల్గొన్నారు. అనంతరం సాయిబాబా, భూపాల్, అప్పిరెడ్డిలు విలేకరులతో మాట్లాడుతూ.. తమ డిమాండ్లపై యాజమాన్యం మొండివైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. పర్మనెంట్ చేస్తే గ్రామాల్లో సేవలందిస్తాం: జూడాలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం జూనియర్ డాక్టర్లను పర్మనెంట్ చేసినట్లయితే.. గ్రామాల్లో వైద్యసేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జూడాల అధ్యక్షుడు డాక్టర్ వంశీ తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయం ముందు జూనియర్ డాక్టర్లు గురువారం ధర్నా నిర్వహించారు. డీఎంఈ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జూడాలు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించనట్లయితే.. సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.