పాత్రికేయుల అరెస్టులా?
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్లో మతఘర్షణలు రేకెత్తించే విధంగా తప్పుడు కథనాలను ప్రసారం చేశారన్న ఆరోపణలతో జీ 24 గంటల చానెల్ సిబ్బందిపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఢిల్లీలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి నిధులు శనివారం ఏపీభవన్ ప్రధాన ద్వారం ఎదుట నిరసన తెలిపారు. అక్రమ కేసులు ఎత్తివేసి, రాష్ట్ర డీజీపీపై చర్యలు తీసుకోవాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. పాత్రికేయులపై తప్పుడు కేసులు పెట్టడంపై మీడియా ప్రతినిధులు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామిని కలిసి డీజీపీ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేస్తూ తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందచేశారు. సానుకూలంగా స్పందించిన గోస్వామి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విచారణకు ఆదేశించినట్టు మీడియా ప్రతినిధులు తెలిపారు. మరోవైపు పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న పోలీసుల వ్యవహారాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం ఆయనకు కూడా వినతి పత్రాన్ని అందచేయనున్నారు.