సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై దాడి
డెహ్రాడూన్: కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై సోమవారం దుండగులు దాడి చేసి, నిప్పు అంటించారు. ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో ఉన్న తన ఇంటిపై దాడి జరిగిందని, సంబంధిత ఫొటోలు, వీడియోలను ఆయన సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఇటీవల ఆయన ఆయోధ్యపై రచించిన పుస్తకంలో ‘హిందూత్వ’కు, తీవ్రవాద సంస్థలకు సారూప్యత ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇంటిపై దాడి చేసిన వ్యక్తుల చేతుల్లో బీజేపీ జెండాలు ఉన్నాయని ఖుర్షీద్ పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన ఇంటి కిటికీలు ధ్వంసం అయ్యాయని, ఓ డోర్కు దుండగులు నిప్పు పెట్టారని నైనిటాల్ ఎస్పీ జగదీశ్ చంద్ర వివరించారు. ఈ దాడితో సంబంధం ఉన్న 21 మంది దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడిలో ఖుర్షీద్ కుటుంబసభ్యులకు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పేర్కొన్నారు. ఇంటిపై జరిగిన దాడిని కాంగ్రెస్ సీనియర్ నేతలు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ తదితరులు తీవ్రంగా ఖండించారు.