ICC board
-
సస్పెన్షన్‌పై రవి బిష్ణోయ్ తండ్రి భావోద్వేగం
న్యూఢిల్లీ: టీమిండియా స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ దురుసుగా ప్రవర్తించాడంటూ ఐసీసీ సస్సెన్షన్ విధించడంపై అతని తండ్రి మంగిలాల్ బిష్ణోయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై మంగిలాల్ బిష్ణోయ్ స్పందిస్తూ..తన కుమారుడు చాలా ప్రశాంతంగా ఉంటాడని, అతనిపై వస్తున్న ఆరోపణలను విని ఆశ్చర్యపోయానన్నారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు టీమిండియా ఆటగాళ్లపై దాడి చేస్తున్న సందర్భంలో సహచరుడిని కాపాడే క్రమంలో తన కుమారుడు ఆవేశానికి లోనైనట్లు తెలిపారు. ఈ సంఘటనపై కలత చెందిన బిష్ణోయ్ తల్లి భోజనం కూడా చేయడం లేదని వాపోయారు. (‘అతి’కి సస్పెన్షన్ పాయింట్లు) ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్‌లలో యువ ఆటగాళ్లు భావోద్వేగానికి లోనవ్వడం సహజమని ఆయన పేర్కొన్నారు. ఆటగాళ్లు ఒకరినొకరు గౌరవించుకుంటూ క్రీడా స్పూర్తిని ప్రదర్శించాలని మంగిలాల్ బిష్ణోయ్ తెలిపారు. ఆదివారం జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఆటగాడు రవి బిష్ణోయ్ ఆర్టికల్ కోడ్ 2.21ను ఉల్లంఘించాడంటూ ఐసీసీ సస్పెన్షన్ విధించింది. భారత్‌కు చెందిన ఆకాశ్ సింగ్‌కు 8 సస్పెన్షన్ పాయింట్లు (6 డి మెరిట్ పాయింట్లకు సమానం), రవి బిష్ణోయ్‌కి 5 సస్పెన్షన్ (2 డి మెరిట్) పాయింట్లు ఐసీసీ విధించింది. అండర్ 19 వరల్డ్ కప్‌లో టీమిండియా పరాజయం పొందినప్పటికి కొందరు టీమిండియా యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రవి బిష్ణోయ్ టోర్నమెంట్‌లోనే అత్యధిక వికెట్లను(17) పడగొట్టిన సంగతి తెలిసిందే. -
‘అతి’కి సస్పెన్షన్ పాయింట్లు
దుబాయ్: జెంటిల్మెన్ క్రికెట్‌కు తమ దురుసు ప్రవర్తనతో మచ్చ తెచ్చిన భారత్, బంగ్లాదేశ్ యువ క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చర్యలు తీసుకుంది. అండర్–19 ప్రపంచకప్ ఫైనల్ ముగిశాక ఆటగాళ్ల ప్రవర్తన... లెవెల్–3 నియమావళికి విరుద్ధంగా ఉండటంతో ఐసీసీ చర్యలు చేపట్టింది. కప్ నెగ్గిన ఆనందంలో ‘అతి’గా సంబరపడిన బంగ్లాదేశ్ ఆటగాళ్లపై, దీనికి దీటుగా ఆవేశపడిన భారత ఆటగాళ్లపై సస్పెన్షన్ పాయింట్లు విధించింది. భారత్‌కు చెందిన ఆకాశ్ సింగ్‌కు 8 సస్పెన్షన్ పాయింట్లు (6 డి మెరిట్ పాయింట్లకు సమానం), రవి బిష్ణోయ్‌కి 5 సస్పెన్షన్ (2 డి మెరిట్) పాయింట్లు విధించారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో తౌహిద్ హ్రిదోయ్ (10 సస్పెన్షన్=6 డి మెరిట్), షమీమ్ హుస్సేన్ (8 సస్సెన్షన్=6 డి మెరిట్), రకీబుల్ హసన్ (4 సస్పెన్షన్= 5 డి మెరిట్)లపై ఐసీసీ చర్యలు తీసుకుంది. రకీబుల్ ప్రవర్తించిన తీరుపై ఎక్కువ డి మెరిట్ పాయింట్ల నిషేధం విధించింది. ఆదివారం ఉత్కంఠ పెంచిన ‘లో’ స్కోర్ల మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. తొలిసారి ఐసీసీ ప్రపంచకప్ నెగ్గిన ఆనందంలో బంగ్లాదేశ్ యువ ఆటగాళ్లు విచక్షణ కోల్పోయారు. -
ఐసీసీ చర్యలు తీసుకుంటుంది
పాచెఫ్‌స్ట్రూమ్: అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ కుర్రాళ్ల శ్రుతిమించిన అతి ఉత్సాహంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంటుందని యువ భారత జట్టు మేనేజర్ అనిల్ పటేల్ తెలిపారు. ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ గ్రేమ్ లెబ్రూయ్ స్వయంగా తన వద్దకు వచ్చి చెప్పారని ఆయన అన్నారు. ‘నిజానికి అసలేం జరిగింది మాకు కచ్చితంగా తెలియదు. కానీ అంతా నిర్ఘాంతపోయారు. ఆఖరు నిమిషాల్లో ఏం జరిగిందనే విషయంపై ఐసీసీ అధికారులు ఆరా తీస్తారు. ఇందు కోసం వీడియో ఫుటేజీలు పరిశీలిస్తారు’ అని అనిల్ తెలిపారు. మ్యాచ్ ముగియగానే బంగ్లా కుర్రాళ్ల ఆనందం, వెర్రి తలకెక్కింది. ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చి భారత ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకొని విపరీత ధోరణిలో ప్రవర్తించారు. పేసర్ షరీఫుల్ ఇస్లామ్ అయితే అందరికంటే అతి ఎక్కువ చేశాడు. భారత ఆటగాళ్లకు మరీ దగ్గరగా వచ్చి అనుచిత సంజ్ఞలు చేశాడు. మ్యాచ్ జరిగే సమయంలోనూ షరీఫుల్ బంతి సంధించిన ప్రతీసారి స్లెడ్జింగ్‌కు పాల్పడటం టీవీ కామెంటేటర్లను విస్మయానికి గురిచేసింది. భారత కెప్టెన్ ప్రియమ్ గార్గ్ బంగ్లా ఆటగాళ్ల ప్రవర్తనపై అసంతృప్తి వెలిబుచ్చా డు. ‘గెలుపోటములు సహజం. ఆటలో భాగమే. కానీ సంబరమైనా, బాధయినా మనం నియంత్రించుకోవాలి. మరీ ఇంత చెత్తగా స్పందించకూడదు. అతి చేష్టలకు పాల్పడకూడదు’ అని అన్నాడు. బంగ్లా సారథి అక్బర్ అలీ కూడా తమ ఆటగాళ్లు మరీ అంత అతిగా స్పందించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. -
ఐపీఎల్ మ్యాచ్‌లు చూపించడం కుదరదు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు విజయవంతమైన టోర్నీగా ప్రపంచ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లోని పలువురు సభ్యులు ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడలేదు. ఏప్రిల్ 22 నుంచి 26 మధ్య కోల్‌కతాలో జరిగే ఐసీసీ సమావేశానికి వీరంతా హాజరవుతుండటంతో తాము ఐపీఎల్ చూడవచ్చని వారు ఆశించారు. కానీ ఆయా తేదీల్లో ఈడెన్ గార్డెన్స్‌లో ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా లేదు. దాంతో తమ కోసం షెడ్యూల్‌ను కాస్త మార్చి ఒక మ్యాచ్ జరిగేలా చూడమంటూ బీసీసీఐని ఐసీసీ చిరు కోరిక కోరింది. అయితే బీసీసీఐ మాత్రం అది కుదరదంటూ తిరస్కరించేసింది. ‘ఒక మ్యాచ్‌లో మార్పులు చేస్తే మొత్తం షెడ్యూల్, దానికి సంబంధించి ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లు దెబ్బ తింటాయి. కాబట్టి అది సాధ్యం కాదని మేం జవాబిచ్చాం’ అని బోర్డు ఉన్నతాధికారి వెల్లడించారు. -
‘కొత్త’ ఐసీసీకి లంక బోర్డు సమ్మతం
కొలంబో: కాస్త ఆలస్యంగానైనా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పరిపాలనా పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) అంగీకారం తెలిపింది. ఈనెల 8న సింగపూర్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో వీటికి ఎస్ఎల్సీ సమ్మతించక ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. తమ అభిప్రాయం తెలిపేందుకు కొంత సమయం కావాలని కోరింది. అయితే సవరించిన ప్రతిపాదనలపై తాము సంతృప్తిగా ఉన్నామని లంక బోర్డు తెలిపింది. ‘సోమవారం జరిగిన ఎస్ఎల్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఐసీసీ ప్రతిపాదనలపై సభ్యుల మధ్య చర్చ జరిగింది. సవరించిన పరిపాలన, షెడ్యూల్ పద్ధతిని ఏకగ్రీవంగా ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని ఎస్ఎల్సీ తెలిపింది. వచ్చే ఏడేళ్లలో భారత, ఆసీస్, ఇంగ్లండ్‌లతో సిరీస్‌ల కారణంగా తమకు 48 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని కార్యదర్శి నిశాంత రణతుంగ అన్నారు.