ఆదివారం విజయం సాధించాక బంగ్లాదేశ్ ఆటగాళ్ల సంబరాలు
పాచెఫ్‌స్ట్రూమ్: అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లాదేశ్ కుర్రాళ్ల శ్రుతిమించిన అతి ఉత్సాహంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంటుందని యువ భారత జట్టు మేనేజర్ అనిల్ పటేల్ తెలిపారు. ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ గ్రేమ్ లెబ్రూయ్ స్వయంగా తన వద్దకు వచ్చి చెప్పారని ఆయన అన్నారు. ‘నిజానికి అసలేం జరిగింది మాకు కచ్చితంగా తెలియదు. కానీ అంతా నిర్ఘాంతపోయారు. ఆఖరు నిమిషాల్లో ఏం జరిగిందనే విషయంపై ఐసీసీ అధికారులు ఆరా తీస్తారు. ఇందు కోసం వీడియో ఫుటేజీలు పరిశీలిస్తారు’ అని అనిల్ తెలిపారు. మ్యాచ్ ముగియగానే బంగ్లా కుర్రాళ్ల ఆనందం, వెర్రి తలకెక్కింది. ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చి భారత ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకొని విపరీత ధోరణిలో ప్రవర్తించారు.
పేసర్ షరీఫుల్ ఇస్లామ్ అయితే అందరికంటే అతి ఎక్కువ చేశాడు. భారత ఆటగాళ్లకు మరీ దగ్గరగా వచ్చి అనుచిత సంజ్ఞలు చేశాడు. మ్యాచ్ జరిగే సమయంలోనూ షరీఫుల్ బంతి సంధించిన ప్రతీసారి స్లెడ్జింగ్‌కు పాల్పడటం టీవీ కామెంటేటర్లను విస్మయానికి గురిచేసింది. భారత కెప్టెన్ ప్రియమ్ గార్గ్ బంగ్లా ఆటగాళ్ల ప్రవర్తనపై అసంతృప్తి వెలిబుచ్చా డు. ‘గెలుపోటములు సహజం. ఆటలో భాగమే. కానీ సంబరమైనా, బాధయినా మనం నియంత్రించుకోవాలి. మరీ ఇంత చెత్తగా స్పందించకూడదు. అతి చేష్టలకు పాల్పడకూడదు’ అని అన్నాడు. బంగ్లా సారథి అక్బర్ అలీ కూడా తమ ఆటగాళ్లు మరీ అంత అతిగా స్పందించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment