Industry associations
-
భూ, సాగు, కార్మిక సంస్కరణలు అవసరం: సీఐఐ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధి వేగవంతానికి వీలుగా మోదీ సర్కారు కారి్మక, భూ, సాగు సంస్కరణలు చేపట్టాలని పరిశ్రమల సంఘం సీఐఐ కేంద్రానికి సూచించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8.2 శాతం వృద్ధి సాధించినట్టు కేంద్ర సర్కారు ఇటీవలే అంచనాలు విడుదల చేయడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇది 8 శాతం మేర నమోదవుతుందని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్‌పురి అంచనా వేశారు. సీఐఐ అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడారు. గతంలో చేపట్టిన ఎన్నో విధానపనరమైన చర్యలు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను మెరుగైన స్థితిలో నిలబెట్టినట్టు చెప్పారు. ‘‘అసంపూర్ణంగా ఉన్న సంస్కరణల అజెండాను పూర్తి చేయడంపైనే వృద్ధి అంచనాలు ఆధారపడి ఉన్నాయి. మన ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యంలో అవకాశాలను విస్తృతం చేయడం, పెట్టుబడులు, వినియోగం, సాధారణ వర్షపాతంపై అంచనాలు వృద్ధిని ప్రభావితం చేస్తాయి’’అని పురి వివరించారు. ప్రైవేటు పెట్టుబడులు కూడా పుంజుకున్నట్టు చెప్పారు. జీఎస్టీలో మూడు రకాల రేట్లే ఉండాలని, పెట్రోలియం, రియల్ ఎస్టేట్‌ను సైతం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. -
ఆన్లైన్ గేమింగ్‌కు ఎస్ఆర్వో ఏర్పాటు చేస్తాం
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్‌పై పర్యవేక్షణకు సంబంధించి స్వీయ నియంత్రణ సంస్థను (ఎస్ఆర్వో) ఏర్పాటు చేసేందుకు పరిశ్రమ సమాఖ్య ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఐఏఎంఏఐ ముందుకొచ్చింది. ఇందుకు అవసరమైన సామరŠాధ్యలు, అనుభవం తమకు ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. నైపుణ్యాల ఆధారిత పలు ఆన్లైన్ గేమింగ్ సంస్థలకు ఐఏఎంఏఐలో సభ్యత్వం ఉండటం కూడా ఇందుకు తోడ్పడగలదని పేర్కొంది. ఇప్పటికే కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్దేశించినట్లుగా ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్ కంపెనీస్ మొదలైన వాటికి సంబంధించిన ఎస్ఆర్వోలను నిర్వహిస్తున్నామని తెలిపింది. సమాజంపై ప్రభావం చూపే ఆన్లైన్ గేమింగ్‌పై కేంద్రం తగు విధానాలు లేదా కొత్త చట్టం తీసుకువస్తుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో ఐఏఎంఏఐ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఇంధన భద్రతలో ఆటో ఎల్పీజీ కీలకపాత్ర
న్యూఢిల్లీ: ఓవైపు అంతర్జాతీయంగా సహజ వాయువు ధరలు పెరుగుతుండగా, మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా వ్యవస్థ సమస్యలు వెన్నాడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఇంధన భద్రతను సాధించడంలో ఆటో ఎల్పీజీ కీలక పాత్ర పోషించగలదని పరిశ్రమ సమాఖ్య ఐఏసీ తెలిపింది. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ తర్వాత రవాణా కోసం అత్యధికంగా ఉపయోగించే ఇంధనాల్లో ఆటో ఎల్పీజీ మూడో స్థానంలో ఉందని వివరించింది. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ అవకాశాలు చాలా తక్కువని ఐఏసీ పేర్కొంది. కరోనా కారణంగా అంతర్జాతీయంగా ఇంధనాల సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతుండటం, ఇంధన ఎగుమతిలో కీలకంగా ఉంటున్న ఒక దేశం పూర్తి స్థాయి యుద్ధంలో నిమగ్నమై ఉండటం తదితర అంశాల కారణంగా ఇంధన భద్రత సాధించడం మరింత కీలకంగా మారిందని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా ఆటో ఎల్పీజీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై కూడా ప్రభుత్వం మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలా కాకుండా వాటికి తగినంత గుర్తింపునివ్వకపోవడం ఆందోళన కలిగించే అంశమని ఐఏసీ డైరెక్టర్ జనరల్ సుయశ్ గుప్తా వ్యాఖ్యానించారు. విద్యుత్‌తో పోలిస్తే ఉత్పత్తి దశ నుంచి వినియోగం వరకూ ఎల్పీజీ వల్ల వచ్చే ఉద్గారాలు చాలా తక్కువని ఆయన చెప్పారు. -
రూ.లక్ష కోట్ల ఉద్దీపనలు కావాలి
న్యూఢిల్లీ: పెట్టుబడుల క్రమాన్ని వేగవంతం చేసేందుకు, క్షీణిస్తున్న ఆర్థిక రంగ వృద్ధి పునరుత్తేజానికి రూ.లక్ష కోట్లకు పైగా ఉద్దీపనలు అవసరమని దేశీయ పరిశ్రమల సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి సూచించాయి. త్వరలోనే ఆర్థిక వృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీనిచ్చినట్టు పారిశ్రామిక వేత్తలు సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రస్తుత మందగమన వాతావరణంలో వెంటనే పరిష్కారాలు అవసరమని అసోచామ్ ప్రెసిడెంట్ బీకే గోయంకా పేర్కొన్నారు. ‘‘ఉద్దీపనల ప్యాకేజీ ద్వారా ఆర్థిక రంగానికి సత్వర పరిష్కారం కావాలి. రూ.లక్ష కోట్లకు పైగా ప్యాకేజీని మేము సూచించాం’’ అని గోయంకా తెలిపారు. కుంగిన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని తీసుకొచ్చేందుకు, ఇబ్బందికర అంశాలపై మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ అధికారులు పరిశ్రమల నేతలతో చర్చించారు. పరిశ్రమల పునరుత్తేజానికి అతి త్వరలోనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు, ఆర్థిక శాఖ నుంచి సానుకూల అభిప్రాయాలు వచ్చినట్టు జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్ తెలిపారు. స్టీల్, ఎన్బీఎఫ్సీ, వాహన రంగాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పిన ఆయన వీలైనంత త్వరలోనే పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు చెప్పారు. లిక్విడిటీ సమస్య లేదు... పరిశ్రమలకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకులు పునరాలోచిస్తున్న విషయం సహా పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు పిరమల్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ అజయ్ పిరమల్ తెలిపారు. ‘‘బ్యాంకుల్లో లిక్విడిటీ లేకపోవడం కాదు, కానీ రుణ వితరణే జరగడం లేదు. ఆర్థిక రంగంలో ఎన్బీఎఫ్సీ పరంగా సమస్య నెలకొని ఉంది’’ అని సమావేశం అనంతరం మీడియాతో అజయ్ పిరమల్ వెల్లడించారు. ఎన్బీఎఫ్సీ రంగ సమస్యలు ఆటోమొబైల్, హోమ్‌లోన్, ఎంఎస్ఎంఈలపైనా ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే చర్యలు ఉంటాయని ప్రభుత్వం తెలిపిందని, వాటి కోసం తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. సీఎస్ఆర్ విషయంలో ఎటువంటి శిక్షాత్మక చర్యలు ఉండకూడదని ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు అజయ్ పిరమల్ వెల్లడించారు. దేశ ఆర్థిక రంగ వృద్ధి పునరుద్ధరణకు అవసరమైన తదుపరి ఉద్దీపనల విషయంలో ప్రభుత్వం తమ అభిప్రాయాలను కోరినట్టు సీఐఐ వైస్ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ తెలిపారు. సమావేశంలో ఎన్నో అంశాలు చర్చించినట్టు పేర్కొన్నారు. ఆటోమొబైల్ రంగంలో మాంద్యం స్టీల్ రంగంపైనా ప్రభావం చూపుతోందన్నారు. సెంట్రల్ బ్యాంకు రేట్ల కోతను బ్యాంకులు వినియోగదారులకు బదలాయించడం అతిపెద్ద అంశమని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని అభిప్రాయపడ్డారు. ‘‘రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు తప్పనిసరిగా వినియోగదారులు, రుణ గ్రహీతలకు బదలాయించాలి. తదుపరి రేట్ల కోతపైనా ఆశావహంగా ఉన్నాం. ఆర్బీఐ ఇప్పటి వరకు 110 బేసిస్ పాయింట్లు తగ్గించడం ఉత్సాహాన్నిచ్చేదే’’ అని సోమాని తెలిపారు. -
పైరసీని అరికట్టండి
పైరసీని అరికట్టాలని, అందుకు పాల్పడిన వారిని గూండా చట్టం కింద అరెస్టు చేయాలని సినీ సంఘాల నేతలు సీబీసీఐడీని కోరారు. సోమవారం ఉదయం స్థానిక ఎగ్మూర్‌లోని సీబీసీఐడీ కార్యాలయానికి వెళ్లిన సినీ సంఘాల నేతలు డిజిపి అశతోస్ శుక్లాకు వినతి పత్రాన్ని అందించారు. దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, విజయ్‌కుమార్, తమిళ నిర్మాతల సం ఘం అధ్యక్షులు కేఆర్, బుల్లితెర నటీనటుల సంఘం అధ్యక్షురాలు నళిని, తమిళ దర్శకుల సంఘాల తరపున రమేష్ ఖన్నా తదితరులు సోమవారం ఉదయం డీజీపీ అశుతోష్ శుక్లను కలిసి వినతి పత్రాన్ని అందించారు. పైరసి కారణంగా తమిళ సినిమా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోందన్నారు. ప్రజల ముఖ్యమంత్రి జయలలిత సినీ పరిశ్రమ వర్గాల వేడుకోలు మేరకు 2001-2006 ప్రాంతంలో పైరసీదారులపై గూండా చట్టం విధించారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడే పైరసీ మహమ్మారి విజృంభించిందన్నారు. కాబట్టి మళ్లీ గూండా చట్టం ప్రయోగించి పైరసీని రూపుమాపాలన్నారు. నూతన చిత్రం విడుదలైన రోజునే కొన్ని థియేటర్లు పైరసీకి పాల్పడుతున్నాయన్నారు. అలాంటి థియేటర్ల అనుమతులను రద్దు చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని సీడీల విక్రయ దుకాణాలపై పోలీసులు తరచు సోదాలు జరిపి పైరసీని అరికట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. లోకల్ కేబుల్ టీవీల్లో కొత్త చిత్రాలను అనుమతి లేకుండా ప్రసారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కేబుల్ చానెళ్లు సుమారు 300కు పైగా ఉన్నాయన్నారు. వాటి అనుమతులను కూడా రద్దు చేయాలన్నారు. అదే విధంగా తమిళనాడులో తిరుగుతున్న అని ప్రైవేటు ఆమ్నీ బస్సుల్లోనూ, అనుమతి లేకుండా కొత్త చిత్రాలను ప్రసారం చేస్తున్నారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.