ingeneering college
-
ఇంజనీరింగ్ కొత్త కోర్సుల్లో 19,240 సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతిచ్చిన 19,240 కొత్త సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని వంద వరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ కోర్సులను నిర్వహించేందుకు ఓకే చెప్పింది. ఇందు లో ఎలాంటి ఆర్థిక భారం లేకుండా, పాత సీట్లను రద్దు చేసుకొని, కొత్త కోర్సుల్లో సీట్లకు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న 13,820 సీట్లతో పాటు ఆర్థిక భారం కలిగిన మరో 5,350 అదనపు సీట్లకు ఆమోదం తెలిపింది. వాటికి అనుబంధ గుర్తింపు ఇచ్చేందు కు జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలకు అనుమతిస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్టీయూ పరిధిలోని 90 వరకు కాలేజీల్లో 18,210 సీట్లతో బీటెక్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్–మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ (నెట్ వర్క్స్)వంటి కొత్త కోర్సులను నిర్వహించేందుకు ఆమోదం తెలుపుతూ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ జీవో జారీ చేశారు. ఈ కోర్సుల కోసం ఏటా అదనంగా రూ.33.85 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని వెల్లడించా రు. నిబంధనల ప్రకారం ఈ కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని జేఎన్టీయూను ఆదేశించినట్లు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల సంఘం నేతలు గౌతంరావు, కృష్ణారావు వెల్లడించారు. ఏఐసీటీఈ ఇచ్చిన కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. వీటితోపాటు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వెయ్యి కి పైగా సీట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వుల జారీ కావాల్సి ఉందని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం వరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టినట్లు వివరించారు. కొత్త కోర్సులకు అనుమతి ఇచ్చినందున విద్యార్థులు వెబ్ ఆప్షన్లు జాగ్రత్తగా ఇచ్చుకోవాలని సూచించారు. నేటి రాత్రి నుంచే వెబ్ ఆప్షన్లు! రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త సీట్లకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అనుబంధ గుర్తింపు జారీపై యూనివర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ ప్రారంభించనున్నాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు అనుబంధ గుర్తింపు వస్తే అదేరోజు రాత్రి నుంచి విద్యా ర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపడతామని ప్రవేశాల క్యాంపు అధికారులు చెబుతున్నారు. అనుబంధ గుర్తింపు జారీలో ఆలస్యమైతే 19 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఇక ఏఐసీటీఈ ఈ సారి రాష్ట్రంలోని 201 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,10,873 సీట్లకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే అందులో యూనివర్సిటీలు ఎన్నింటికి అనుబంధ గుర్తింపు జారీ చేస్తాయన్నది నేడు తేలనుంది. -
ఒడలు బళ్లు.. బళ్లు ఓడలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాంకేతిక విద్యా కోర్సులను అభ్యసించేందుకు విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిపోతోంది. నాణ్యత ప్రమాణాలు కొరవడటంతో ఆయా కోర్సుల్లో చేరేందుకు ముందుకు రావడం లేదు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గత మూడేళ్లలో క్రమంగా తగ్గుతూ వస్తోంది. మరోవైపు సంప్రదాయ డిగ్రీలైన బీకాం, బీఎస్సీలలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సైన్సు, కామర్స్ రంగాల్లో అవకాశాలు పెరుగుతుండటంతో వీటిలో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థుల సంఖ్య గత మూడేళ్లలో 6 వేల వరకు తగ్గిపోగా, సంప్రదాయ డిగ్రీల్లో చేరిన వారి సంఖ్య గత ఏడాదికి, ఇప్పటికి 25 వేలకు పైగా పెరగడం గమనార్హం. ఉన్నత విద్యా శాఖ తాజాగా తేల్చిన లెక్కల్లో ఈ వాస్తవం బయటపడింది. సంప్రదాయ డిగ్రీల్లో భారీ పెరుగుదల.. రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీలైన బీఏ, బీకాం, బీఎస్సీలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతేడాదికి ఇప్పటికి పోల్చితే బీఏలో 8 వేలకు పైగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. అలాగే బీకాంలో 16 వేల వరకు పెరగగా, బీఎస్సీలో 10 వేల వరకు విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో 2016–17 విద్యా సంవత్సరంలో 71,066 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 54,064 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక 2018–19 విద్యా సంవత్సరంలో 66,079 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 48,662 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక ఎంబీఏ, ఎంసీఏలోనూ 2016–17లో 24,557 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 22,479 సీట్లు భర్తీ అయ్యాయి. అదే 2018–19కి వచ్చే సరికి 25,912 సీట్లు అందుబాటులో ఉండగా కేవలం 21,767 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. పాలిటెక్నిక్‌లోనూ 2016 విద్యా సంవత్సరంలో 50,721 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 36,983 సీట్లు భర్తీ అయ్యాయి. అదే 2018 విద్యా సంవత్సరంలో 38,359 సీట్లు అందుబాటులో ఉంటే అందులో 29,310 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. -
ఇంజనీరింగ్ విద్యార్థి మనోజ్ అర్ధాంతర మృతి
సాక్షి ప్రతినిధి, కడప:కన్నతల్లి లాంటి స్వగ్రామాన్ని వదిలాల్సి వచ్చింది. వారసులను కొండంతలా భావిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే తలంపు కళ్లు ముందు మెదిలాండింది. ప్రభుత్వ పరిహారం పుచ్చుకొని నలుగురితోపాటు జీవనం సాగిస్తున్నారు. ఉన్నత విద్య దిశగా కుమారుల పయనం ఉండడంతో ఆ కుటుంబం ఆనందడోలికల్లో ఉండిపోయింది. అంతలోనే వినకూడని మాటలు వినాల్సి వచ్చింది. కడచూపునకు సైతం నోచుకోని స్థితిలో కన్నకుమారుడు కనుమరుగైన నేపథ్యమిది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అట్లూరు మండలం చెండువాయి గ్రామం సోమశిల ప్రాజెక్టు మునకకు గురైంది. ఆ గ్రామానికి చెందిన ఎస్ రాజారెడ్డి స్వగ్రామాన్ని వదిలేసి మాధవరం–1 గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఉన్న పొలం మునకు గురి కావడంతో కుమారుల ప్రయోజనాలే ప్రాధాన్యతగా వచ్చారు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు మల్లేశ్వరరెడ్డిని బీఫార్మసీ చదివించారు. మరో కుమారుడు మనోజ్‌కుమార్‌రెడ్డి(19) విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లెలో సింహాద్రి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చేర్పించారు. కుమారులిద్దరూ ప్రయోజకులు అవుతున్నారని రాజారెడ్డి కుటుంబంతోపాటు గ్రామస్తులు సైతం సంతోషం వ్యక్తం చేయసాగారు. ఈ క్రమంలో కళాశాలకు వెళ్లిన కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో వెతుక్కుంటూ అనకాపల్లెకి వెళ్లిన బంధువులకు కఠోర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మనోజ్‌కుమార్‌రెడ్డి సజీవంగా లేరని తేలింది. గుర్తుతెలియని మృతదేహంగా పంచనామా నిర్వహించి దహనక్రియలు సైతం చేశారు. యాజమాన్యం అంతు లేని నిర్లక్ష్యం.. సింహాద్రి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం మనోజ్‌కుమార్‌రెడ్డి పట్ల అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఈ నెల 2న కళాశాలకు వెళ్లిన మనోజ్ తర్వాత రోజు నుంచి తరగతులకు హాజరు కాలేదు. ఆ విషయాన్ని ఎస్ఎంఎస్ ద్వారా పేరేంట్స్‌కు పంపినట్లు తెలుస్తోంది. అయితే కళాశాల పంపిన ఎస్ఎంఎస్ను మనోజ్ పేరేంట్స్ చూసుకోలేదు. కాగా మనోజ్ ఫోన్ పని చేయకపోవడం, అందుబాటులోకి రాకపోవడంతో విషయం తెలుసుకునేందుకు ఆదివారం సోదరుడు మల్లేశ్వరరెడ్డి అనకాపల్లెకు వెళ్లారు. హాస్టల్లో మనోజ్ లేరు. 20 రోజులుగా కళాశాలకు రావడం లేదని తేలింది. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వాకబు చేయగా కళాశాల సమీపంలో ఓ బావిలో 20 రోజుల క్రితం గుర్తుతెలియని మృతదేహాన్ని కనుగొన్నట్లు తెలిసింది. ఆ మేరకు స్థానిక పోలీసుస్టేషన్లో వాకబు చేస్తే మృతదేహం నుంచి స్వాధీనం చేసుకున్న దుస్తులను చూపించారు. నిర్గాంతపోవాల్సిన దుస్థితి పట్టింది. ఆ బట్టలు మనోజ్కుమార్రెడ్డివేనని గుర్తించారు. ఏమైందీ? ఎలా జరిగింది? ఎందుకు చనిపోయారు అనే విషయాలు వెల్లడి కాలేదు. కాగా 20 రోజులుగా కళాశాలకు విద్యార్థి హాజరు కాకపోతే యాజమాన్యం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించడం వెనుక తెలియని రహాస్యమేదో దాగిందని బంధువులు అనుమానిస్తున్నారు. అసలేం జరిగిందీ....మనోజ్‌కుమార్‌రెడ్డి కళాశాలకు వెళ్లగానే నూతన ఫోన్‌ను సహచర విద్యార్థులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆ ఫోన్ కన్పించలేదని సమాచారం. ఆ విషయంగా ఏమైనా తగాదా జరిగిందా? సహచర విద్యార్థులు ఏమైనా చేశారా? అనుకోకుండా ఘటన చోటుచేసుకొని చనిపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా పాడుబడ్డ బావిలో పడేశారా? అయినా కళాశాల యాజమాన్యం 20 రోజుల పాటు కళాశాలకు హాజరుకాకపోయినా పేరేంట్స్‌కు ఎందుకు ఫోన్ చేసి విషయం చెప్పలేదు? కళాశాల పక్కనే పాడుబడ్డ బావిలో మృతదేహాన్ని వెలికి తీసినా గుర్తించలేక పోవడానికి కారణాలు ఏమిటీ? తెలిసీ తెలియనట్లు నటించారా? ఇలాంటి సందేహాలు శేషప్రశ్నలుగా మిగిలాయి. కాగా ఇప్పటి వరకూ గుర్తుతెలియని మృతదేహంగా భావించి కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానస్పద కేసుగా మార్చినట్లు తెలుస్తోంది. ఆమేరకు విచారణ చేపట్టినట్లు సమాచారం. కాగా చెట్టంత కుమారుడి అర్థాంతర మృతి ఆ కుటుంబాన్ని కుంగదీస్తోంది. అండగా నిలుస్తాడని భావించిన తరుణంలో విషాదవార్త వినాల్సి రావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. పోలీసులు సమగ్ర విచారణలోనే వాస్తవాలు వెలుగు చూడాల్సి ఉంది.