సాక్షి ప్రతినిధి, కడప:కన్నతల్లి లాంటి స్వగ్రామాన్ని వదిలాల్సి వచ్చింది. వారసులను కొండంతలా భావిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే తలంపు కళ్లు ముందు మెదిలాండింది. ప్రభుత్వ పరిహారం పుచ్చుకొని నలుగురితోపాటు జీవనం సాగిస్తున్నారు. ఉన్నత విద్య దిశగా కుమారుల పయనం ఉండడంతో ఆ కుటుంబం ఆనందడోలికల్లో ఉండిపోయింది. అంతలోనే వినకూడని మాటలు వినాల్సి వచ్చింది. కడచూపునకు సైతం నోచుకోని స్థితిలో కన్నకుమారుడు కనుమరుగైన నేపథ్యమిది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అట్లూరు మండలం చెండువాయి గ్రామం సోమశిల ప్రాజెక్టు మునకకు గురైంది.
ఆ గ్రామానికి చెందిన ఎస్ రాజారెడ్డి స్వగ్రామాన్ని వదిలేసి మాధవరం–1 గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఉన్న పొలం మునకు గురి కావడంతో కుమారుల ప్రయోజనాలే ప్రాధాన్యతగా వచ్చారు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు మల్లేశ్వరరెడ్డిని బీఫార్మసీ చదివించారు. మరో కుమారుడు మనోజ్‌కుమార్‌రెడ్డి(19) విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లెలో సింహాద్రి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చేర్పించారు. కుమారులిద్దరూ ప్రయోజకులు అవుతున్నారని రాజారెడ్డి కుటుంబంతోపాటు గ్రామస్తులు సైతం సంతోషం వ్యక్తం చేయసాగారు. ఈ క్రమంలో కళాశాలకు వెళ్లిన కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో వెతుక్కుంటూ అనకాపల్లెకి వెళ్లిన బంధువులకు కఠోర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మనోజ్‌కుమార్‌రెడ్డి సజీవంగా లేరని తేలింది. గుర్తుతెలియని మృతదేహంగా పంచనామా నిర్వహించి దహనక్రియలు సైతం చేశారు.
యాజమాన్యం అంతు లేని నిర్లక్ష్యం..
సింహాద్రి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం మనోజ్‌కుమార్‌రెడ్డి పట్ల అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఈ నెల 2న కళాశాలకు వెళ్లిన మనోజ్ తర్వాత రోజు నుంచి తరగతులకు హాజరు కాలేదు. ఆ విషయాన్ని ఎస్‌ఎంఎస్ ద్వారా పేరేంట్స్‌కు పంపినట్లు తెలుస్తోంది. అయితే కళాశాల పంపిన ఎస్‌ఎంఎస్‌ను మనోజ్ పేరేంట్స్ చూసుకోలేదు. కాగా మనోజ్ ఫోన్ పని చేయకపోవడం, అందుబాటులోకి రాకపోవడంతో విషయం తెలుసుకునేందుకు ఆదివారం సోదరుడు మల్లేశ్వరరెడ్డి అనకాపల్లెకు వెళ్లారు. హాస్టల్‌లో మనోజ్ లేరు. 20 రోజులుగా కళాశాలకు రావడం లేదని తేలింది. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వాకబు చేయగా కళాశాల సమీపంలో ఓ బావిలో 20 రోజుల క్రితం గుర్తుతెలియని మృతదేహాన్ని కనుగొన్నట్లు తెలిసింది. ఆ మేరకు స్థానిక పోలీసుస్టేషన్‌లో వాకబు చేస్తే మృతదేహం నుంచి స్వాధీనం చేసుకున్న దుస్తులను చూపించారు. నిర్గాంతపోవాల్సిన దుస్థితి పట్టింది. ఆ బట్టలు మనోజ్‌కుమార్‌రెడ్డివేనని గుర్తించారు. ఏమైందీ? ఎలా జరిగింది? ఎందుకు చనిపోయారు అనే విషయాలు వెల్లడి కాలేదు. కాగా 20 రోజులుగా కళాశాలకు విద్యార్థి హాజరు కాకపోతే యాజమాన్యం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శించడం వెనుక తెలియని రహాస్యమేదో దాగిందని బంధువులు అనుమానిస్తున్నారు.
అసలేం జరిగిందీ....మనోజ్‌కుమార్‌రెడ్డి కళాశాలకు వెళ్లగానే నూతన ఫోన్‌ను సహచర విద్యార్థులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆ ఫోన్ కన్పించలేదని సమాచారం. ఆ విషయంగా ఏమైనా తగాదా జరిగిందా? సహచర విద్యార్థులు ఏమైనా చేశారా? అనుకోకుండా ఘటన చోటుచేసుకొని చనిపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా పాడుబడ్డ బావిలో పడేశారా? అయినా కళాశాల యాజమాన్యం 20 రోజుల పాటు కళాశాలకు హాజరుకాకపోయినా పేరేంట్స్‌కు ఎందుకు ఫోన్ చేసి విషయం చెప్పలేదు? కళాశాల పక్కనే పాడుబడ్డ బావిలో మృతదేహాన్ని వెలికి తీసినా గుర్తించలేక పోవడానికి కారణాలు ఏమిటీ? తెలిసీ తెలియనట్లు నటించారా? ఇలాంటి సందేహాలు శేషప్రశ్నలుగా మిగిలాయి. కాగా ఇప్పటి వరకూ గుర్తుతెలియని మృతదేహంగా భావించి కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానస్పద కేసుగా మార్చినట్లు తెలుస్తోంది. ఆమేరకు విచారణ చేపట్టినట్లు సమాచారం. కాగా చెట్టంత కుమారుడి అర్థాంతర మృతి ఆ కుటుంబాన్ని కుంగదీస్తోంది. అండగా నిలుస్తాడని భావించిన తరుణంలో విషాదవార్త వినాల్సి రావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. పోలీసులు సమగ్ర విచారణలోనే వాస్తవాలు వెలుగు చూడాల్సి ఉంది.
ఇంజనీరింగ్ విద్యార్థి మనోజ్ అర్ధాంతర మృతి
Published Sun, Aug 21 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
Advertisement