INS Arihant
-
‘అణు’ బెదిరింపులకు జవాబు
న్యూఢిల్లీ: భారత నౌకాదళానికి చెందిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ తన తొలి అణు నిరోధక గస్తీని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వెల్లడించారు. అణు బెదిరింపులకు పాల్పడేవారికి అరిహంత్ తగిన సమాధానమని ప్రశంసించారు. పాకిస్తాన్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ ‘దేశానికి, శాంతికి శత్రువులుగా ఉన్న వారికి ఇది హెచ్చరిక. భారత్‌కు వ్యతిరేకంగా వారు ఎలాంటి దుందుడుకు చర్యలకు దిగకూడదు’ అని అన్నారు. అరిహంత్ పూర్తిగా విజయవంతం కావడంతో ఇక నీరు, భూమి, ఆకాశం.. ఈ మూడింటిలో ఎక్కడినుంచైనా అణ్వాయుధాలను ప్రయోగించే సత్తా భారత్‌కు చేకూరింది. దేశీయంగా తయారైన తొలి అణు జలాంతర్గామి ఇదే. ‘అరిహంత్ భారత్‌కు గర్వకారణం. ఈ విజయంలో పాలుపంచుకున్న అందరికీ, ప్రత్యేకించి ఐఎన్ఎస్ అరిహంత్ సిబ్బందికి నా అభినందనలు. వారి సేవలు చరిత్రలో ఎప్పటికీ గుర్తుంటాయి. ఇలాంటి కీలక సమయంలో ఓ విశ్వసనీయమైన అణు నిరోధకం అత్యవసరం’ అని మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. దేశానికి ఇదో గొప్ప విజయమనీ, ఇతర దేశాల నుంచి భారత్‌కు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి ఐఎన్ఎస్ అరిహంత్ రక్షణ కల్పించడంతోపాటు ఈ ప్రాంతంలో శాంతి వాతావరణం నెలకొనేలా చేస్తుందన్నారు. అరిహంత్ సామర్థ్యం @ 3,500 కి.మీ. ► అరిహంత్ అంటే శత్రు సంహారిణి అని అర్థం ► అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెస్సెల్ (ఏటీవీ) అనే రహస్య ప్రాజెక్టు కింద ఐఎన్ఎస్ అరిహంత్‌తోపాటు మరో రెండు అణు జలాంతర్గాములను అభివృద్ధి చేయడం 1990ల్లోనే మొదలైంది. ఐఎన్ఎస్ అరిహంత్ మొదటిది కాగా, రెండోదైన ఐఎన్ఎస్ అరిధమన్ తయారీ ఈ ఏడాదిలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ► ఇప్పటికే ఆకాశం నుంచి మిరేజ్–2000 యుద్ధ విమానం ద్వారా, భూమి నుంచి అగ్ని బాలిస్టిక్ క్షిపణి ద్వారా అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి. ఇప్పుడు ఐఎన్ఎస్ అరిహంత్ కూడా పూర్తిగా విజయవంతం కావడంతో గాలి, భూమి, నీరు.. మూడింటిలో ఎక్కడి నుంచైనా అణ్వస్త్రాన్ని భారత్ ప్రయోగించగలదు. ► ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్‌లకు గాలి, నీరు, భూమి నుంచి అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం ఉంది. ఈ జాబితాలో భారత్ ఆరో దేశంగా చేరింది. ► డెబ్బైకి పైగా అణు జలాంతర్గాములతో అమెరికా ఈ విభాగంలో తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉన్న రష్యా వద్ద దాదాపు ముప్పై, ఫ్రాన్స్, బ్రిటన్ల వద్ద చెరో 10–12 అణు జలాంతర్గాములు ఉన్నాయి. ► ఐఎన్ఎస్ అరిహంత్ గరిష్టంగా 3,500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలపై అణు దాడి చేయగలదు. అదే చైనా, రష్యా, అమెరికాల వద్ద ఉన్న అణు జలాంతర్గాములు 5 వేల కిలో మీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను కూడా ధ్వంసం చేయగలవు. ► జలాంతర్గాముల నుంచి ప్రయోగించే పన్నెండు కె–15 బాలిస్టిక్ క్షిపణులను ఇది మోసుకెళ్లగలదు. ► అణు నిపుణులతో కలిసి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఐఎన్ఎస్ అరిహంత్‌ను అభివృద్ధి చేసింది. ► ఐఎన్ఎస్ అరిహంత్ పొడవు, వెడల్పులు వరుసగా 110 మీటర్లు, 11 మీటర్లు ► నీటిలో 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. 83 మెగా వాట్ల అణు విద్యుత్తు రియాక్టర్ ఇందులో ఉంటుంది. ► ఉపరితలానికి రాకుండా సముద్ర గర్భంలోనే కొన్ని నెలలపాటు ప్రయాణించగలదు. ► కార్గిల్ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2009 జూలైలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కేంద్రం నుంచి అరిహంత్‌ను తొలిసారిగా సముద్రంలోకి పంపారు. ► అనేక పరీక్షల అనంతరం 2016లో ఐఎన్ఎస్ అరిహంత్‌ను నౌకా దళంలోకి తీసుకున్నారు. -
ఆ దేశాల సరసన భారత్..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ అమ్ములపొదిలో అణు క్షిపణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ చేరింది. ఈ జలాంతర్గామి విజయవంతంగా తొలి గస్తీని పూర్తిచేసుకుని రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సిబ్బందిని అభినందించారు. ఐఎన్ఎస్ అరిహంత్ సాధించిన ఘనత దేశ చరిత్రలో ఎన్నటికీ గుర్తుండిపోతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పర్యవేక్షణలో 6000 టన్నుల ఐఎన్ఎస్ అరిహంత్‌ను అభివృద్ధి చేశారు. తొలి గస్తీని విజయవంతంగా పూర్తిచేయడంతో ఐఎన్ఎస్ అరిహంత్ పూర్తిస్ధాయి అణు జలాంతర్గామిగా సేవలు అందించనుంది. ఈ విజయంతో అణు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే వారికి దీటైన జవాబిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ అణు జలాంతర్గామి అందుబాటులోకి రావడంతో ఉపరితల క్షిపణులు చేరుకోలేని లక్ష్యాలను సైతం ఇది చేధించగలదు. ఐఎన్ఎస్ అరిహంత్ రాకతో ఇప్పటికే అణుజలాంతర్గాములను నిర్మించి నిర్వహిస్తున్న అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్ల సరసన భారత్ చేరింది. -
ఐఎన్ఎస్ అరిహంత్‌తో ఆ దేశాల సరసన..
-
ఐఎన్ఎస్ అరిహంత్ మూలన పడిందా?
సాక్షి, న్యూఢిల్లీ : స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన భారతదేశ తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్కు హాని జరిగిందా?. గతేడాది జరిగిన ఓ ప్రమాదంలో అరిహంత్ తీవ్రంగా నష్టపోయిందా?. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ ప్రశ్నలను బుధవారం లోక్‌సభలో అడిగారు. ప్రశ్నలపై స్పందించిన రక్షణ శాఖ జాతి ప్రయోజనాల దృష్ట్యా ఈ సమాచారాన్ని ఇవ్వలేమని పేర్కొంది. ఐఎన్ఎస్ అరిహంత్కు 2017లో హాని జరిగినట్లు మీడియా రిపోర్టులు వస్తున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి రక్షణశాఖను ఈ మేరకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి అరిహంత్ సముద్రయానం చేయడం లేదా? అని కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మానవ తప్పిదం వల్లే అరిహంత్‌లోని ప్రొపల్షన్ కంపార్ట్మెంట్లో ప్రమాదం జరిగిందని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. 2016లో అరిహంత్ భారతీయ నేవీలో చేరింది. -
ఐఎన్ఎస్ అరిహంత్ రెడీ!
న్యూఢిల్లీ: సొంత అణు జలాంతర్గామి త్రయాన్ని సమకూర్చుకునే దిశగా భారత్ మరో ముందడుగు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన భారత తొలి అణు జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిహంత్’ ఎట్టకేలకు సముద్ర పరీక్షలకు సిద్ధమైంది. విశాఖపట్నం తీరంలో నావికాదళానికి చెందిన స్థావరంలో శుక్రవారం రాత్రి జలాంతర్గామిపై ఉన్న పరమాణు రియాక్టర్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా క్రియాశీలం చేశారు. దీంతో ఈ జలాంతర్గామి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అణు ఇంధనంతో నడిచే ఐఎన్ఎస్ అరిహంత్‌పై గల అణు రియాక్టర్‌ను క్రియాశీలం చేసినందున ఈ జలాంతర్గామికి త్వరలోనే వివిధ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే, అరిహంత్‌పై క్రియాశీలం చేసిన రియాక్టర్ పనితీరును తెలుసుకునేందుకు దానిని కాసేపు ఆపేయనున్నామని ‘అణు శక్తి సంఘం(ఏఈసీ)’ చైర్మన్ ఆర్కే సిన్హా తెలిపారు. ప్రస్తుతం రష్యా, అమెరికా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్ల వద్ద మాత్రమే అణు జలాంతర్గాములు ఉన్నాయి. అరిహంత్‌ను సమకూర్చుకోవడంతో భారత్ కూడా వాటి సరసన చేరనుంది. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో సమకూర్చుకుంటున్న అణు జలాంతర్గాముల త్రయంలో ఐఎన్ఎస్ అరిహంత్ మొదటిది. రూ.15 వేల కోట్లతో నిర్మించిన దీనిని ప్రధాని మన్మోహన్ 2009లో ప్రారంభించారు. ఆరు వేల టన్నుల బరువు ఉండే ఈ జలాంతర్గామి కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు కొన్ని నెలలపాటు పరీక్షలు ఎదుర్కోనుంది. 82.5 మెగావాట్ల అణు రియాక్టర్‌తో నడిచే ఈ జలాంతర్గాములు భూ, గగన, సముద్రతలాల్లోని లక్ష్యాలపైకి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించగలవు. రష్యా నుంచి లీజుకు తీసుకున్న అకులా-2 తరగతికి చెందిన ఐఎన్ఎస్ చక్ర జలాంతర్గామిని భారత్ ప్రస్తుతం ఉపయోగిస్తోంది. అరిహంత్‌పై అణు రియాక్టర్‌ను క్రియాశీలం చేసిన శాస్త్రవేత్తలను ప్రధాని మన్మోహన్, రక్షణ మంత్రి ఆంటోనీలు అభినందించారు.