‘అణు’ బెదిరింపులకు జవాబు | INS Arihant Completes India's Nuclear Triad | Sakshi
Sakshi News home page

‘అణు’ బెదిరింపులకు జవాబు

Published Tue, Nov 6 2018 2:43 AM | Last Updated on Tue, Nov 6 2018 2:43 AM

INS Arihant Completes India's Nuclear Triad - Sakshi

ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ జలాంతర్గామి అణు నిరోధక గస్తీ ఊహాచిత్రం

న్యూఢిల్లీ: భారత నౌకాదళానికి చెందిన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ తన తొలి అణు నిరోధక గస్తీని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వెల్లడించారు. అణు బెదిరింపులకు పాల్పడేవారికి అరిహంత్‌ తగిన సమాధానమని ప్రశంసించారు. పాకిస్తాన్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ ‘దేశానికి, శాంతికి శత్రువులుగా ఉన్న వారికి ఇది హెచ్చరిక. భారత్‌కు వ్యతిరేకంగా వారు ఎలాంటి దుందుడుకు చర్యలకు దిగకూడదు’ అని అన్నారు.

అరిహంత్‌ పూర్తిగా విజయవంతం కావడంతో ఇక నీరు, భూమి, ఆకాశం.. ఈ మూడింటిలో ఎక్కడినుంచైనా అణ్వాయుధాలను ప్రయోగించే సత్తా భారత్‌కు చేకూరింది. దేశీయంగా తయారైన తొలి అణు జలాంతర్గామి ఇదే. ‘అరిహంత్‌ భారత్‌కు గర్వకారణం. ఈ విజయంలో పాలుపంచుకున్న అందరికీ, ప్రత్యేకించి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ సిబ్బందికి నా అభినందనలు. వారి సేవలు చరిత్రలో ఎప్పటికీ గుర్తుంటాయి. ఇలాంటి కీలక సమయంలో ఓ విశ్వసనీయమైన అణు నిరోధకం అత్యవసరం’ అని మోదీ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. దేశానికి ఇదో గొప్ప విజయమనీ, ఇతర దేశాల నుంచి భారత్‌కు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ రక్షణ కల్పించడంతోపాటు ఈ ప్రాంతంలో శాంతి వాతావరణం నెలకొనేలా చేస్తుందన్నారు.

అరిహంత్‌ సామర్థ్యం @ 3,500 కి.మీ.
► అరిహంత్‌ అంటే శత్రు సంహారిణి అని అర్థం
► అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెస్సెల్‌ (ఏటీవీ) అనే రహస్య ప్రాజెక్టు కింద ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌తోపాటు మరో రెండు అణు జలాంతర్గాములను అభివృద్ధి చేయడం 1990ల్లోనే మొదలైంది. ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ మొదటిది కాగా, రెండోదైన ఐఎన్‌ఎస్‌ అరిధమన్‌ తయారీ ఈ ఏడాదిలోనే పూర్తయ్యే అవకాశం ఉంది.
► ఇప్పటికే ఆకాశం నుంచి మిరేజ్‌–2000 యుద్ధ విమానం ద్వారా, భూమి నుంచి అగ్ని బాలిస్టిక్‌ క్షిపణి ద్వారా అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి. ఇప్పుడు ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ కూడా పూర్తిగా విజయవంతం కావడంతో గాలి, భూమి, నీరు.. మూడింటిలో ఎక్కడి నుంచైనా అణ్వస్త్రాన్ని భారత్‌ ప్రయోగించగలదు.
► ప్రస్తుతం అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్‌లకు గాలి, నీరు, భూమి నుంచి అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం ఉంది. ఈ జాబితాలో భారత్‌ ఆరో దేశంగా చేరింది.
► డెబ్బైకి పైగా అణు జలాంతర్గాములతో అమెరికా ఈ విభాగంలో తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉన్న రష్యా వద్ద దాదాపు ముప్పై, ఫ్రాన్స్, బ్రిటన్‌ల వద్ద చెరో 10–12 అణు జలాంతర్గాములు ఉన్నాయి.
► ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ గరిష్టంగా 3,500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలపై అణు దాడి చేయగలదు. అదే చైనా, రష్యా, అమెరికాల వద్ద ఉన్న అణు జలాంతర్గాములు 5 వేల కిలో మీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను కూడా ధ్వంసం చేయగలవు.  
► జలాంతర్గాముల నుంచి ప్రయోగించే పన్నెండు కె–15 బాలిస్టిక్‌ క్షిపణులను ఇది మోసుకెళ్లగలదు.
► అణు నిపుణులతో కలిసి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ను అభివృద్ధి చేసింది.
► ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ పొడవు, వెడల్పులు వరుసగా 110 మీటర్లు, 11 మీటర్లు
► నీటిలో 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. 83 మెగా వాట్ల అణు విద్యుత్తు రియాక్టర్‌ ఇందులో ఉంటుంది.
► ఉపరితలానికి రాకుండా సముద్ర గర్భంలోనే కొన్ని నెలలపాటు ప్రయాణించగలదు.  
► కార్గిల్‌ విజయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2009 జూలైలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కేంద్రం నుంచి అరిహంత్‌ను తొలిసారిగా సముద్రంలోకి పంపారు.  
► అనేక పరీక్షల అనంతరం 2016లో ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ను నౌకా దళంలోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement