కొత్త గరిష్టం నుంచి జారుడు...
కొన్ని బ్లూచిప్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో మంగళవారం భారత్ స్టాక్ సూచీలు గరిష్టస్థాయి నుంచి కిందకు దిగిపోయాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మంగళవారం ట్రేడింగ్ తొలిదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా ర్యాలీ జరిపి 22,041 పాయింట్లకు, నిఫ్టీ 70 పాయింట్ల పెరుగుదలతో 6,575 పాయింట్లకు చేరాయి. ఇవి రెండు కొత్త రికార్డుస్థాయిలు. చివరకు సెన్సెక్స్ 23 పాయింట్ల స్వల్పలాభంతో 21,833 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 6,516 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ కమిటీ రెండురోజుల సమావేశం మంగళవారం ప్రారంభంకానుండటం, క్రిమియా రష్యాలో విలీనమయ్యే ప్రక్రియ ప్రారంభంకావడం వంటి అంశాలతో గరిష్టస్థాయిలో లాభాల స్వీకరణ జరిగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. ఎస్బీఐ నేతృత్వంలో యూనియన్‌బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు 2-5 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. మారుతి సుజుకి 7 శాతంపైగా పెరగ్గా, ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు 1.5-2.5 శాతం మధ్య ఎగిశాయి. ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రోలు 1-2 శాతం మధ్య క్షీణించాయి. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రోలు 1-3 శాతం మధ్య తగ్గాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 1,012 కోట్ల పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 202 కోట్లు వెనక్కు తీసుకున్నాయి.
ఎస్బీఐ కౌంటర్లో షార్ట్ కవరింగ్.....
ప్రైవేటు రంగ బ్యాంకింగ్ షేర్లతో పోలిస్తే వెనుకబడివున్న ప్రభుత్వ రంగ ఎస్బీఐ మంగళవారం స్థిరంగా ర్యాలీ జరిపింది. క్యాష్ మార్కెట్లో కొనుగోళ్లతో పాటు ఫ్యూచర్ కాంట్రాక్టులో షార్ట్ కవరింగ్ జరగడంతో ఈ కాంట్రాక్టు నుంచి 1.86 లక్షల షేర్లు కట్ అయ్యాయి. దాంతో మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 70.26 లక్షల షేర్లకు తగ్గింది.
రూ. 1,700 స్ట్రయిక్ వద్ద కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ ఫలితంగా ఈ కాల్ ఆప్షన్ నుంచి 1.40 లక్షల షేర్లు కట్‌కాగా, పుట్ ఆప్షన్లో 64 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఈ ఆప్షన్లలో వరుసగా 4,80 లక్షలు, 2.08 లక్షల షేర్ల చొప్పున ఓఐ వుంది. రూ. 1,750 స్ట్రయిక్ వద్ద కాల్ రైటింగ్ కారణంగా 3.11 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఈ ఆప్షన్లో ఓఐ 7.14 లక్షల షేర్లకు పెరిగింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 1,700పైన స్థిరపడితే రూ. 1,750 స్థాయిని సమీపించవచ్చని, రూ. 1,700 దిగువన క్రమేపీ బలహీనపడవచ్చని ఈ డేటా సూచిస్తున్నది.