Jaiprakash Power Ventures
-
రూ.5 వేల కోట్ల డీల్: అదానీ చేతికి మరో సిమెంట్ కంపెనీ!
సాక్షి, ముంబై: బిలియనీర్, ప్రపంచ మూడో అతిపెద్ద కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూపు మరో సిమెంట్ కంపెనీనీ కొనుగోలు చేసినట్టు సమాచారం. సిమెంట్ పరిశ్రమలో తమ ఆధిపత్యాన్ని చాటుకునేలా తాజా డీల్ చేసుకున్నారని మార్కట్ వర్గాలు భావిస్తున్నాయి. అప్పుల భారంతో ఉన్న జైప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ సిమెంట్ యూనిట్‌ను కొనుగోలుకు ఎడ్వాన్స్డ్ చర్చలు జరుపుతోంది. ఈ డీల్ విలువ సుమారు 5 వేల కోట్ల రూపాయలని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ డీల్చర్చలు సక్సెస్ అయితే త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వెలువడనుందని భావిస్తున్నారు. (ఓలా దివాలీ గిఫ్ట్: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, అతిచౌక ధరలో) రుణ సంక్షోభంలో ఉన్న జైప్రకాష్ అసోసియేట్స్ అనుబంధ సంస్థ జైప్రకాష్ సిమెంట్ గ్రౌండింగ్ ప్లాంట్ ఇతర ఆస్తులను కొనుగోలు చేయనుందట. సోమవారం నాటి స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో బోర్డు రుణాన్ని తగ్గించుకునే క్రమంలో సిమెంట్ వ్యాపారాన్ని విక్రయించాలని భావిస్తున్నట్టు జైప్రకాష్ అసోసియేట్స్ వెల్లడించింది. జైప్రకాష్ పవర్ వెంచర్స్ సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్, అలాగే ఇతర నాన్-కోర్ ఆస్తులను విక్రయానికి, కొనుగోలుదారులను అన్వేషిస్తోందని ప్రకటించడం ఈ వార్తలు బలాన్నిస్తోంది. అయితే తాజా నివేదికలపై వ్యాఖ్యానించేందుకు అదానీ గ్రూప్, జైప్రకాష్ అసోసియేట్స్ ప్రతినిధులు అందుబాటులో లేరు. (WhatsApp update: అదిరిపోయే అప్డేట్,అడ్మిన్లకు ఫుల్ జోష్) సిమెంట్ వ్యాపారం పై దృష్టిపెట్టిన అదానీ గ్రూపు మేలో స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్ లిమిటెడ్ నుండి అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ , ఏసీసీ లిమిటెడ్‌లను కొనుగోలు చేసిన తరువాత ఏటా 67.5 మిలియన్ టన్నుల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో దాదాపు భారతదేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా అవతరించింది. సిమెంట్ పరిశ్రమలో 200 బిలియన్ రూపాయల పెట్టుబడులు పెట్టాలని, రానున్న ఐదేళ్లలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 140 మిలియన్ టన్నులకు పెంచాలని లక్క్ష్యంగా పెట్టుకున్నట్టు గత నెలలో అదానీ ప్రకటించిన సంగతి విదితమే. ఇదీ చదవండి: బిలియనీర్ గౌతమ్ అదానీ విదేశీ నిధులపై కన్ను: భారీ కసరత్తు -
ఏపీ: ఏ పార్టీతోనూ సంబంధం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధానంలోనే తాము ఇసుక ఆపరేషన్స్ నిర్వహిస్తున్నామని జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీవీఎల్) సంస్థ స్పష్టం చేసింది. తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవని, ఓ పత్రికలో ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జేపీవీఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ గౌర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా తమ సంస్థపై అసత్యాలతో కూడిన వార్తలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. జేపీవీఎల్ ఇసుక సబ్ కాంట్రాక్టులను అధికార పార్టీ నేతలకు జిల్లాల వారీగా ఇచ్చినట్లు ఎల్లో మీడియా రెండు రోజులుగా తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. ప్రభుత్వమే ఈ సబ్ కాంట్రాక్టులను ఇస్తున్నట్లు, ఇసుకలో భారీ దోపిడీ జరుగుతున్నట్లు అసత్య కథనాలను వెలువరిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై జేపీవీఎల్ సంస్థ స్పందించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా నిర్వహించిన టెండర్లలో తమ సంస్థ రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ నిర్వహణను దక్కించుకున్నట్లు పేర్కొంది. టెండర్లలో మిగిలిన సంస్థలతో పోటీ పడి తమ సాంకేతిక, ఆర్థిక సామర్థ్యాన్ని నిరూపించుకుని కాంట్రాక్టు పొందినట్లు వెల్లడించింది. టెండర్ నిబంధనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను పాటిస్తూ ఇసుక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. తమ సంస్థకు విద్యుత్, కోల్ మైనింగ్ రంగాల్లో విస్తారమైన అనుభవం ఉందని, తాము చేపట్టిన ఏ ప్రాజెక్టునైనా సమర్థంగా నిర్వహిస్తామని పేర్కొంది. ఇతరులు లావాదేవీలు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు.. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను నిర్వహించేందుకు టెండర్ల ద్వారా దక్కించుకున్న జేపీవీఎల్ అనుమతించిన వ్యక్తులకు మాత్రమే అవకాశం ఉందని జిల్లాల ఎస్పీలు స్పష్టం చేశారు. ఇతరులు ఎవరైనా ఇసుక సబ్ కాంట్రాక్టర్ లేదా ఇతర పేర్లతో లావాదేవీలు జరిపితే చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సబ్ కాంట్రాక్టులు పొంది జిల్లాల వారీగా విక్రయాలను నిర్వహిస్తున్నట్లు ఎవరైనా ప్రచారం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జీపీవీఎల్ పోలీస్ శాఖను కోరినట్లు తెలిపారు. -
జేపీ జల విద్యుత్ కేంద్రాలు టీఏక్యూఏ చేతికి!
న్యూఢిల్లీ/అబుదాబి: దేశీయ సంస్థ జైప్రకాష్ పవర్ వెంచర్స్‌కు చెందిన రెండు జల విద్యుత్ కేంద్రాలను అబుదాబి నేషనల్ ఎనర్జీ కంపెనీ(టీఏక్యూఏ) ఆధ్వర్యంలో ఏర్పాటైన కన్సార్షియం కొనుగోలు చేయనుంది. ఇందుకు 160 కోట్ల డాలర్లను(రూ. 10,000 కోట్లు) చెల్లించనున్నట్లు టీఏక్యూఏ తెలిపింది. దీనిలో ఈక్విటీ రూపేణా 61.6 కోట్ల డాలర్లను(రూ. 3,820 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. మిగిలిన మొత్తం ప్రధానంగా సెక్యూర్డ్(నాన్‌రికోర్స్) రుణం రూపేణా ఉంటుందని తెలిపింది. డీల్‌లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని కినౌర్ జిల్లాలోగల బాస్పా రెండో దశ, కర్చాం వాంగ్టూ ప్లాంట్లను సొంతం చేసుకోనుంది. వీటి సంయుక్త విద్యుదుత్పత్తి సామర్థ్యం 1,391 మెగావాట్లుకాగా, ఈక్విటీ పెట్టుబడులలో టీఏక్యూఏ 51% వాటాను సమకూరుస్తుంది. త ద్వారా రెండు జల విద్యుత్ ప్లాంట్లకు సంబంధిం చిన యాజ మాన్యం, కార్యకలాపాల నిర్వహణలను అబుదాబీ నేషనల్ ఎనర్జీ కంపెనీ సొంతం చేసుకోనుంది. కన్సార్షియంలో కెనడాకు చెందిన సంస్థాగత ఇన్వెస్టర్ సంస్థకు(పేరు వెల్లడించలేదు) 39% వాటా, ఐడీఎఫ్సీ ఆల్టర్నేటివ్స్ ఇండియా ఇన్ఫ్రా ఫండ్‌కు 10% వాటా ఉంటుందని టీఏక్యూఏ వివరించింది. ఈ కొనుగోలు ద్వారా ఇండియా జల విద్యుత్ రంగంలో తాము అతిపెద్ద ప్రయివేట్ కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు టీఏక్యూఏ తెలిపింది.