హోంగార్డుపై జమేదార్ జులుం
తిరుమలకల్చరల్, న్యూస్‌లైన్: తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్న హోంగోర్డుపై జమేదార్ జులుం ప్రదర్శించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంట లకు సుపథం వద్ద చంటిబిడ్డల తల్లిదండ్రుల క్యూ కిక్కిరిసి ఉంది. సాయంత్రం 5 గంటల తర్వాత అనుమతించే సహస్రదీపాలంకరణ టికెట్టుతో ఓ ఉద్యోగి వచ్చాడు. చంటి బిడ్డల క్యూలో తమ వారిని దర్శనానికి అనుమతించాలని అక్కడున్న రిజర్వు ఫోర్సు రోప్‌పార్టీ హోంగార్డు పురుషోత్తంను కోరాడు. సాయంత్రం 5 గంటల తర్వాతే అనుమతిస్తామని హోంగార్డు బదులిచ్చాడు. ఆ ఉద్యోగి అక్కడే విధుల్లో ఉన్న జమేదార్ నారాయణను సంప్రదించాడు.
ఆయన అంగీకరించాడు. దీనికి హోంగార్డు పురుషోత్తం అభ్యంతరం తెలిపాడు. భక్తులు ఆగ్రహిస్తారని చెప్పి అక్కడి నుంచి ముందుకు కదిలారు. జమేదార్ నారాయణకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పక్కకు పోతున్న హోంగార్డును పరుగుతో వెంటాడి నెట్టాడు. దీనిపై హోంగార్డు పురుషోత్తం తీవ్ర మనస్తాపానికి గురై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. పది నిమిషాలపాటు హోంగార్డు, ఉద్యోగి, జమేదార్ మధ్య సాగిన ఈ ఘటనను క్యూలో ఉన్న భక్తులు చూస్తూ ఉండిపోయారు. కొందరు భక్తులు హోంగార్డు పురుషోత్తంను ఓదార్చడం గమనార్హం.