బ్రిటిషర్లు కొట్టిన దెబ్బ! ‘టాటా’ సాహసోపేత నిర్ణయం..
భారతీయ పరిశ్రమ పితామహుడిగా భావించే జమ్షెడ్జీ టాటా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అనేక పరిశ్రమలు, వ్యాపారాల ద్వారా భారతదేశ వ్యాపార ప్రపంచాన్ని మార్చిన జమ్షెడ్జీ టాటా బ్రిటిష్ పాలకులు కొట్టిన దెబ్బతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. టాటా గ్రూప్‌లో తొలి సంస్థ మూతపడింది...1890లలో టాటా షిప్పింగ్ లైన్‌ను మూసివేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై ఇటీవల విడుదలైన ఒక పుస్తకంలో వివరించారు. క్లిష్ట సమయంలో నష్టాలను తగ్గించుకోవడానికి, మరింత ఆచరణీయమైన వెంచర్లపై దృష్టి పెట్టడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో జమ్షెడ్జీ టాటా చతురతను ఈ వ్యూహాత్మక చర్య తెలియజేస్తుంది. టాటా గ్రూప్‌నకు చెందిన వెటరన్లు ఆర్ గోపాలకృష్ణన్, హరీష్ భట్ రాసిన "జమ్సెడ్జీ టాటా - పవర్ఫుల్ లర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్" అనే పుస్తకంలో అప్పటి పరిస్థితులను వివరించారు.అది 1880, 90ల కాలం. భారతదేశం నుంచి షిప్పింగ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన P.&O సంస్థదే ఆధిపత్యం. ఆ గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తూ జమ్షెడ్జీ టాటా 'టాటా లైన్'ను ప్రారంభించారు. టాటా పేరును కలిగి ఉన్న మొదటి వ్యాపారం ఇదే. బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం మద్దతుతో P.&O భారతీయ వ్యాపారులకు అధిక సరుకు రవాణా రేట్లు విధించింది. బ్రిటిష్, యూదు సంస్థలకు మాత్రం ఎక్కువ రాయితీలను అందించింది.టాటా లైన్ ప్రస్థానం..తన వస్త్ర వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని అనుభవించిన జమ్షెడ్జీ టాటా జపాన్‌లోని అతిపెద్ద షిప్పింగ్ లైన్ అయిన నిప్పాన్ యుసెన్ కైషా (NYK)తో కలిసి పనిచేయడానికి జపాన్‌కు వెళ్లారు. జమ్షెడ్జీ టాటా సమానమైన రిస్క్ తీసుకుని, నౌకలను స్వయంగా నిర్వహించినట్లయితేనే తమతో భాగస్వామ్యానికి ఎన్‌వైకే అంగీకరించింది. దీంతో టాటా 'అన్నీ బారో' అనే ఆంగ్ల నౌకను నెలకు 1,050 పౌండ్లకు అద్దెకు తీసుకున్నారు. ఇది 'టాటా లైన్'లో తొలి నౌక.తాను ప్రారంభించిన ఈ వ్యాపారం మొత్తం భారతీయ వస్త్ర పరిశ్రమకు షిప్పింగ్ రేట్లను తగ్గిస్తుందని, P.&O. గుత్తాధిపత్యాన్ని ఛేదించి టన్ను సరుకు రవాణాకు రూ. 19 నుంచి రూ. 12 వరకు తగ్గుతుందని జమ్సెడ్జీ విశ్వసించారు. అనతికాలంలోనే రెండవ ఓడ 'లిండిస్ఫార్న్'ను అద్దెకు తీసుకున్నారు. 1894 అక్టోబరులో ది ట్రిబ్యూన్ పత్రిక జమ్సెడ్జీ ప్రయత్నాలను ప్రశంసించింది.టాటా లైన్ వ్యాపారాన్ని దెబ్బకొట్టేందుకు P.&O సంస్థ ఎత్తుగడ వేసింది. టాటా లైన్, ఎన్‌వైకే షిప్‌లను ఉపయోగించని వ్యాపారులకు షిప్పింగ్ చార్జీని టన్నుకు 1.8 రూపాయలకు తగ్గిస్తామని ప్రకటించింది. దీంతోపాటు ఇలా అంగీకరించిన కొంతమంది వ్యాపారులకు ఉచితంగా రవాణాను కూడా అందించింది. 'లిండిస్ఫార్న్' నౌక పత్తి రవాణాకు పనికిరాదని పుకార్లు వ్యాప్తి చేసింది.క్రమంగా P.&O ప్రభావానికి భయపడి భారతీయ వ్యాపారులు టాటా లైన్‌తో వ్యాపారాన్ని ఉపసంహరించుకున్నారు. టాటా లైన్‌ను మూసివేస్తే భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయని హెచ్చరించినప్పటికీ వారు అర్థం చేసుకోలేదు. ఫలితంగా జమ్షెడ్జీ టాటా నష్టాలను చవిచూశారు. ప్రతి నెలా రూ. వేలల్లో నష్టాలు.. ధరల పోటీ ముగిసే సమయానికి టాటా లైన్లో రూ. లక్షకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది.పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత టాటా లైన్‌కు స్థిరమైన మార్గం లేదని నిర్ధారించుకున్న జామ్‌సెడ్జీ విజయవంతమైన వ్యాపారవేత్తగా తన ప్రతిష్టను పణంగా పెట్టి వ్యాపారాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నారు. లీజుకు తీసుకున్న ఓడలను ఇంగ్లండ్‌కు తిరిగి పంపించి టాటా లైన్‌ను ముగించేశారు. అయితే ఎంప్రెస్ మిల్స్, స్వదేశీ మిల్స్, అహ్మదాబాద్ అడ్వాన్స్ మిల్స్, టాటా స్టీల్ టాటా పవర్‌తో సహా జమ్షెడ్జీ టాటా స్థాపించిన అనే వ్యాపారాలు విజయవంతమయ్యాయి.