భాషా సామరస్య సదస్సులో జయప్రకాష్ నారాయణ్
వ్యవస్థలో మార్పుతోనే హక్కుల పరిరక్షణ సాధ్యమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అన్నారు. సంక్షోభంలో ఉన్న తెలుగుజాతిని సమన్వయపరిచే రీతిలో పరిష్కార మార్గాన్ని అన్వేషించాల్సి ఉందన్నారు. విద్యార్థుల అభిరుచుల మేరకు భాషల ఎంపికను వదిలి పెట్టాలని సూచించారు. జేపీ ప్రసంగి స్తున్న సమయంలో సమైక్యవాదులు నినాదాలు హోరెత్తించారు.
సాక్షి, చెన్నై: సేవ సంస్థ నేతృత్వంలో భాషా సామరస్యం - భారత ప్రజాస్వామ్యం అనే అంశంపై జాతీయ సదస్సు చెన్నైలోని ఆస్కా ఆవరణలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ్ ప్రసంగించారు. భాష పుట్టుక, అభివృద్ధి, చీలికలు, టెక్నాలజీ ప్రభావంతో వస్తున్న మార్పులను విశదీకరించారు. దేశంలో 122 భాషలు ఉన్నాయని, వీటిలో 22 ప్రాముఖ్యం పొందాయని తెలిపారు. ఒక భాష ఆ ప్రాంత సంస్కృతి, హక్కులను ఎలుగెత్తి చాటుతుందని పేర్కొన్నారు. అయితే అనేక భాషలు కనుమరుగు అవుతుండడం ఆవేదన కలిగి స్తోందన్నారు. సంస్కృతి సంపద్రాయాల్ని గౌరవించడంలో, భాషా సామరస్యాన్ని చాట డం లో తమిళులు ముందు వరుసలో ఉంటారని కితాబిచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో అల్ప సంఖ్యాక భాషలకు ఉన్న హక్కుల్ని ఈ సందర్భంగా వివరించారు. విద్యా పరంగా భాషల ఎంపిక బాధ్యతను విద్యార్థులకే వదిలి పెట్టాలని సూచించారు. అప్పుడే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు.
తరిమి కొడదాం
కులం, మతం, వెనుకబాటుతనం, మూడ నమ్మకాల జెంజాటం నుంచి ఈ సమాజం బయటపడాలని జేపీ సూచించారు. సుపరిపాలన చూడాలన్నా, అన్ని రకాల హక్కులకు రక్షణ కావాలన్నా వ్యవస్థల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా భారత ఎన్నికల వ్యవస్థలో మార్పు తప్పనిసరని పేర్కొన్నారు. పక్షపాత, అవకాశవాద రాజకీయాలకు చరమ గీతం పాడే రీతిలో ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
గౌరవిద్దాం
ఒకరి భాషను మరొకరు గౌరవించాల్సిన అవసరం ఉందని జేపీ తెలిపారు. ఓ ప్రాంతంలో ఉన్న మెజారిటీ భాషకు ఎలాంటి నష్టమూ కలగకుండా కాపాడాల్సిన అవసరం ఉందని సూచించారు. తమిళనాడులోని తెలుగువారు ఇక్కడి భాషకు నష్టం కలగకుండా తమ మాతృ భాషను పరిరక్షించుకునే రీతిలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలుగుజాతి సంక్షోభంలో ఉందని, అందరినీ సమన్వయ పరిచే విధంగా పరిష్కారాల్ని అన్వేషించాలని అభిప్రాయపడ్డారు.
పెరుగుతున్న దురభిమానం
భాష మీద అభిమానం కన్నా దురభిమానం ప్రస్తుతం పెరుగుతోందని అఖిల భారత అల్ప సంఖ్యాక భాషల ఫోరం అధ్యక్షుడు సీఎంకే రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్బంధ విద్యా విధానం అల్ప సంఖ్యాక భాషలపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా గతంలో తీసుకున్న నిర్ణయాల సవరణకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. రాజకీయ గంజాయి వనంలో తులసి మొక్కలాంటి వారు జేపీ అని కితాబిచ్చారు.
సమైక్య సెగ
జయప్రకాష్ నారాయణ్ ప్రసంగిస్తున్న సమయంలో సమైక్యవాదుల నుంచి నిరసన ఎదుర్కొన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా జేపీ నినదించాలంటూ కొందరు పట్టుబట్టారు. ఆస్కా ట్రస్టీ శ్రీనివాసులు రెడ్డి, ఐటీఏ అధ్యక్షుడు నగేష్, వైఎస్ఆర్సీపీ అభిమాని కె.రవీం ద్రనాథ్‌రెడ్డి తదితరులు ప్లకార్డు చేతబట్టి నిరసన తెలిపారు. జేపీ స్పందిస్తూ తెలంగాణ ఇవ్వాలన్న ఆలోచనే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి లేదన్నారు. తెలంగాణలో కన్నా సీమాంధ్రలోనే అత్యధిక సీట్లు వస్తాయన్న విషయం ఆయనకు తెలుసునన్నారు. అందుకే తెలంగాణ ఇవ్వాలన్న ఆలోచనే ఆయనకు లేదని వివరించారు. ప్రత్యేక రాష్ట్రాలతో అద్భుతాలు సృష్టించలేమని, దీని వల్ల పెద్ద ప్రమాదమూ లేదని అన్నారు.
తెలంగాణ వస్తే పదో తరగతి చదువుకున్నోడికీ ఉద్యోగాలు వస్తాయనడం దేవుడికే ఎరుకా అంటూ చమత్కరించారు. అగ్గి పెట్టెల్ని తయారు చేసినంత సులువుగా హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తామని చెబుతున్నారన్నారు. హైదరాబాద్ ప్రరుువేటు ఆస్తి కాదని, అందరి సొత్తు అన్నది గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సేవ అధ్యక్షుడు డి.సత్యనారాయణ, సేవ విద్యా కమిటీ చైర్మన్ అనిల్‌కుమార్‌రెడ్డి, సేవ ప్రతినిధులు తంగుటూరి రామకృష్ణ, ఆదిశేషయ్య, పుట్టా జయరాం, విజయేంద్ర రావు, సీనియర్ జర్నలిస్టు ఎస్.వి.సూర్యప్రకాష్‌రావు తదితరులు పాల్గొన్నారు.